Chiranjeevi on Thaman: తెలుగు సినిమా ఈజ్ షైనింగ్.. మన సినిమాను మనమే చంపుకుంటున్నా అంటూ డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన కామెంట్స్ పై మెగా స్టార్ చిరంజీవి శనివారం (జనవరి 18) తన ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించాడు. అతని మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయని అన్నాడు. సినిమాలపై సోషల్ మీడియాలో వస్తున్న నెగటివ్ ప్రచారంపై తమన్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో తమన్ చేసిన కామెంట్స్ పై చిరంజీవి స్పందించాడు. తన ఎక్స్ అకౌంట్లో శనివారం ఉదయం ఓ పోస్ట్ చేశాడు. “డియర్ తమన్.. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది.
విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, Words can inspire. And Words can destroy. Choose what you wish to do (మాటలు స్ఫూర్తి నింపుతాయి.. అవే మాటలు పడగొడతాయి.. మీరేం చేయాలనుకుంటున్నారో తేల్చుకోండి). మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది. చాాలా మంచి మాటలు చెప్పావు బ్రదర్” అని చిరంజీవి ట్వీట్ చేశాడు.
బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ శుక్రవారం (జనవరి 17) జరిగాయి. ఇందులో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాస్త ఆవేదనగా మాట్లాడాడు. ప్రస్తుతం తెలుగు సినిమా ఎక్కడికో వెళ్లిపోయినా.. నెగటివ్ ట్రోల్స్ తో మన సినిమాను మనమే చంపుకుంటుంటే ఏం బతుకు బతుకుతున్నాం అని చాలా బాధగా ఉందని తమన్ అన్నాడు. ప్రస్తుతం ప్రపంచమంతా తెలుగు సినిమా వైపే చూస్తోందని, తాను తమిళం, మలయాళం, హిందీలోకి వెళ్లినా.. తెలుగులో ఓ సినిమా తీయాలని అనుకుంటున్నట్లు వాళ్లు తనతో చెప్పారని తమన్ వెల్లడించాడు.
అంతటి గొప్ప సినిమాను సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ తో మనకు మనమే చంపేస్తున్నామని తమన్ ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమా బాగా లేకపోతే నిందించండి.. మేము తప్పు తెలుసుకుంటాం.. నేర్చుకుంటాం అని అతడు అన్నాడు. నెగటివ్ ట్రోల్స్, నెగటివ్ ట్యాగ్స్ ఈ రోజుల్లో చాలా బాధిస్తున్నట్లు చెప్పాడు. మీ కామెంట్స్ వల్ల ప్రొడ్యూసర్ ఎంత కుమిలిపోతున్నాడో మీకు తెలియదని తెలిపాడు. ప్రొడ్యూసర్స్ ను బాగా చూసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని అన్నాడు. తమన్ కామెంట్స్ విని బాలకృష్ణతోపాటు డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా చప్పట్లు కొడుతూ తమ మద్దతు తెలిపారు.