MEGA 157: ‘మెగా స్టార్ట్’: చిరంజీవి కొత్త సినిమా పనులు మొదలు.. అప్‍డేట్ ఇచ్చిన డైరెక్టర్
MEGA 157: మెగాస్టార్ చిరంజీవి మరో చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకు సంబంధించిన అప్‍డేట్‍ను దర్శకుడు వశిష్ట ప్రకటించారు. వివరాలివే..
MEGA 157: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ చిత్రం ఆగస్టులో వచ్చి నిరాశపరిచింది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ ప్లాఫ్‍గా నిలిచింది. డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ ఇలా అన్ని అంశాల్లో చిరంజీవి ఆకట్టుకున్నా.. కథ, టేకింగ్ పరంగా ఈ చిత్రం పేలవంగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. దీంతో భోళాశంకర్ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. తదుపరి మెగాస్టార్ చిరంజీవి.. 'బింబిసార' ఫేమ్ దర్శకుడు వశిష్టతో సినిమా (MEGA 157) చేస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ జానర్‌లో ఈ మూవీ ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి నేడు అప్‍డేట్ ఇచ్చారు దర్శకుడు వశిష్ట.
ట్రెండింగ్ వార్తలు
మెగా157 చిత్రానికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టినట్టు డైరెక్టర్ వశిష్ట ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “మెగా ఫిల్మ్ కోసం ఒక మెగాస్టార్ట్. మేం ప్రొడక్షన్ పనులను ప్రారంభించాం! సినిమాటిక్ అడ్వెంచర్‌కు మీ అందరినీ త్వరలో తీసుకెళ్లేందుకు మేం రెడీ” అని వశిష్ట ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవికి ఇది 157వ చిత్రంగా ఉండనుంది.
దర్శకుడు వశిష్ట, యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ప్రమోద్, వంశీ, విక్రమ్, సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు.. చిరంజీవిని కలిశారు. చిరూతో కలిసి దిగిన ఫొటోను వశిష్ట షేర్ చేశారు.
ఇటీవల విడుదలైన మెగా157 కాన్సెప్ట్ పోస్టర్ అందరిలోనూ ఆసక్తిని రేపింది. స్టార్ చుట్టూ పంచభూతాలతో ఉన్న ఆ పోస్టర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ మూవీగా ఉండనుంది. ఈ సినిమా షూటింగ్ నవంబర్ లేదా డిసెంబర్‌లో మొదలవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.
డైరెక్టర్ వశిష్ట గతేడాది బింబిసార చిత్రంలో సూపర్ హిట్ కొట్టారు. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఆ సోషియో ఫ్యాంటసీ మూవీ భారీ కలెక్షన్లను సాధించింది. చాలా ఏళ్ల తర్వాత కల్యాణ్ రామ్‍కు హిట్‍ను ఇచ్చింది. దానికి సీక్వెల్ కూడా ఉండనుందని తెలుస్తోంది. మెగా157 పూర్తయ్యాక బింబిసార-2 పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
మరోవైపు, సోగ్గాడే చిన్ననాయన ఫేమ్ దర్శకుడు కల్యాణ్ కృష్ణతోనూ మెగాస్టార్ చిరంజీవి మరో చిత్రం చేయనున్నారని తెలుస్తోంది. ముందుగా 'బ్రోడాడీ' చిత్రానికి రీమేక్ చేయాలనుకున్నా.. ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. రీమేక్ కాకుండా.. కొత్త కథతోనే చిత్రం చేయాలనుకుంటున్నారట. అయితే, దీనిపై స్పష్టమైన ప్రకటన ఇంకా వెలువడలేదు.