చిరంజీవికే బోర్ కొట్టేసిందట: ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన కోన వెంకట్-chiranjeevi boarded with commercial tropes says writer kona venkat ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  చిరంజీవికే బోర్ కొట్టేసిందట: ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన కోన వెంకట్

చిరంజీవికే బోర్ కొట్టేసిందట: ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన కోన వెంకట్

చిరంజీవి తనతో చెప్పిన కొన్ని విషయాలను కోన వెంకట్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారో చెప్పారని వెల్లడించారు. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

చిరంజీవికే బోర్ కొట్టేసిందట: ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన కోన వెంకట్

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎక్కువ శాతం కమర్షియల్ చిత్రాలే చేశారు. రుద్రవీణ, ఆపద్భాందవుడు లాంటి కొన్ని సినిమాలు మధ్యమధ్యలో చేసినా.. ఎక్కువగా కమర్షియల్ రూల్ పాటించారు. ప్రేక్షకులను అలరిస్తూ దశాబ్దాలుగా టాలీవుడ్ అగ్రహీరోగా వెలుగొందుతున్నారు. రీ-ఎంట్రీలోనూ కమర్షియల్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు చిరు. అయితే, ఈ విషయంపై రైటర్ కోన వెంకట్ ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. చిరంజీవి ఏమనుకుంటున్నారో వెల్లడించారు.

బోర్ కొట్టేసిందన్నారు

మాస్ హీరోగానే కమర్షియల్ సినిమాలు చేసి తనకు బోర్ కొట్టిందని, విభిన్నమైన చిత్రాలు చేయాలని అనుకుంటున్నట్టు చిరంజీవి తనతో అన్నారని గలాటాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోన చెప్పారు. “ఇలాంటి డ్రమాటిక్ ప్లాష్‍బ్యాక్ ఉండే సినిమాలు ఇంకెంత కాలం చేయాలని ఆయన (చిరంజీవి) కూడా అనుకుంటున్నారు. ఇలాంటి చిత్రాలు ఇక చేయలేనని ఆయన అన్నారు. ఓ సాదారణ పాత్రను తాను ఎందుకు చేయలేనని చిరూ అడిగారు. కొత్త సినిమాలు ఎప్పుడు చేయాలి? నాకు బోర్ వచ్చేస్తోందని చెప్పారు” అని కోన వెంకట్ తెలిపారు.

అలాంటి సినిమాలు చేయలేరని చెప్పా

ఒకే లాంటి సినిమాలు కాకుండా కొత్తగా ఏదైనా చేయాలని చిరంజీవి అనుకుంటున్నారని కోన వెంకట్ అన్నారు. “ఒకే విధమైన సినిమాల నుంచి ఆయన బ్రేక్ కావాలని అనుకుంటున్నారు. ఏదైనా కొత్తగా చేయాలని భావిస్తున్నారు. కానీ అలాంటి సినిమాలు మీరు చేయలేరని చెప్పా. బాక్సాఫీస్ సినిమాలు మీరు చేయాలని అన్నా” అని కోన వెల్లడించారు.

అలాంటి మూవీ ఇప్పుడు కూడా చేయగలరు

స్వయం కృషి లాంటి సినిమాలు వ్యక్తిగతంగా సంతృప్తిని ఇచ్చినా.. కమర్షియల్‍గా నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టలేవని కోన వెంకట్ అన్నారు. “ఉదాహరణకు స్వయం కృషి సినిమాను.. అలాంటి కొన్ని చిత్రాలను తీసుకుందాం. అవి ఆయనకు వ్యక్తిగతంగా సంతృప్తిని కలిగించి ఉండొచ్చు. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఏమైంది? స్వయం కృషి లాంటి సినిమాను తక్కువ బడ్జెట్‍తో ఇప్పుడు కూడా చిరంజీవి చేయగలరు. కానీ మల్టీప్లెక్టుల్లోనే ఈ చిత్రం నడుస్తుంది. యాక్షన్ సీన్లు, ఐటెమ్ సాంగ్ ఎందుకు లేవని మాస్ ఆడియన్స్ అనుకుంటారు” అని కోన చెప్పారు.

చిరంజీవి లైనప్

చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర చిత్రం విడుదల కావాల్సి ఉంది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ చేస్తామని టీమ్ ప్రకటించినా వాయిదా పడింది. ఇంకా కొత్త డేట్ ఖరారు కాలేదు. జూలైలో వస్తుందనే రూమర్లు ఉన్నాయి. ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ రూ.150కోట్లకు పైగా భారీ బడ్జెట్‍తో రూపొందింది.

డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ కమర్షియల్ కామెడీ మూవీ చేయనున్నారు చిరంజీవి. ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. వచ్చే ఏడాది 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ ఉంది. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ యాక్షన్ చిత్రం చేయనున్నారు చిరంజీవి. ఈ ప్రాజెక్టుపై హైప్ ఇప్పటికే చాలా ఉంది. ఈ మూవీ డిఫరెంట్‍గా ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయి.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం