Chiranjeevi Sequels: చిరంజీవి ఆ రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ చేసిన అశ్వినీ దత్
Chiranjeevi Sequels: చిరంజీవి కెరీర్లో బ్లాక్‌బస్టర్లుగా మిగిలిపోయిన రెండు సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ చేశాడు నిర్మాత అశ్వినీ దత్. ఇంద్ర రీరిలీజ్ సక్సెస్ తర్వాత మెగాస్టార్ ఇంట్లో మూవీ టీమ్ కు ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అతడు ఈ సీక్వెల్స్ గురించి వెల్లడించడం విశేషం.
Chiranjeevi Sequels: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో రెండు మరుపురాని బ్లాక్ బస్టర్ సినిమాలు ఇంద్ర, జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ రెండు సినిమాలనూ వైజయంతీ మూవీస్ బ్యానరలో అశ్వినీ దత్ తెరకెక్కించాడు. ఈ సినిమాలకు సీక్వెల్స్ కావాలని చాలా రోజులుగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి నిర్మాత అశ్వినీ దత్ దీనిపై స్పందించాడు.
ఇంద్ర టీమ్‌కు సన్మానం
మెగాస్టార్ చిరంజీవి 69వ బర్త్ డే సందర్భంగా 2002లో వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఇంద్ర మూవీ రీరిలీజ్ అయిన విషయం తెలుసు కదా. ఇప్పుడు కూడా ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఈ సందర్భంగా ఇంద్ర మూవీ టీమ్ ను తన ఇంటికి పిలిచి సన్మానించాడు చిరంజీవి. ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ తోపాటు డైరెక్టర్ బి.గోపాల్, రచయితలు పరుచూరి బ్రదర్స్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, చిన్ని కృష్ణ.. చిరు ఇంటికి వెళ్లారు.
టీమ్ లోని అందరికీ చిరు శాలువాలు కప్పి సన్మానించాడు. అంతేకాకుండా నిర్మాత అశ్వినీ దత్ కు పాంచజన్యాన్ని బహుమతిగా ఇవ్వడం విశేషం. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఎన్టీఆర్ కృష్ణుడి వేషధారణలో ఈ పాంచజన్యాన్ని పూరిస్తూ కనిపిస్తాడు.అందుకే చాన్నాళ్లుగా తాను దీనిని గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నట్లు చిరు చెప్పాడు.
ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్
ఈ సన్మాన కార్యక్రమం ముగిసిన తర్వాత మీడియాతో నిర్మాత అశ్వినీ దత్ మాట్లాడాడు. ఇంద్ర, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలకు సీక్వెల్స్ తీసుకురానున్నట్లు అతడు వెల్లడించాడు. ఈ రెండు సీక్వెల్స్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని, ఈ క్రేజీ సీక్వెల్స్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పాడు.
నిజానికి చిరు కెరీర్లో మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోయిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీకి సీక్వెల్ తీసుకురావాలని, అందులో రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. అంతేకాదు ఈ మూవీ సీక్వెల్ కు నాగ్ అశ్విన్ దర్శకత్వ బాధ్యతలు తీసుకునే అవకాశం కూడా ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.
ఇంద్ర రీరిలీజ్ రికార్డులు
అటు 2002లో వచ్చిన ఇంద్ర మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలో ఇంద్ర పాత్రలో చిరు నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అందులోని పవర్‌ఫుల్ డైలాగులు, పాటలు, చిరు స్టెప్పులు, ఫైట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే ఇప్పుడు రీరిలీజ్ లోనూ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసింది.
తొలిరోజు ఈ మూవీ ఇండియా వైడ్‌గా రెండు కోట్ల యాభై లక్షల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్‌సీస్‌లో యాభై లక్షలకుపైగా వసూళ్లను దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. మొత్తంగా ఫస్ట్ డే మూడు కోట్ల ఐదు లక్షలకుపైగా ఇంద్ర మూవీకి కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇంద్ర సినిమా ఒక్క నైజాంలోనే గురువారం రోజు కోటి వరకు వసూళ్లను సాధించింది. నైజాం ఏరియాలో 252 వరకు ఇంద్ర స్పెషల్ షోస్‌ను స్క్రీనింగ్ చేశారు.