Paruvu Web Series: సుస్మిత‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నా - ప‌రువు వెబ్‌సిరీస్‌పై చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌-chiranjeevi applaudes daughter sushmita konidela and brother nagababu on paruvu web series sucess ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Paruvu Web Series: సుస్మిత‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నా - ప‌రువు వెబ్‌సిరీస్‌పై చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Paruvu Web Series: సుస్మిత‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నా - ప‌రువు వెబ్‌సిరీస్‌పై చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Jun 20, 2024 01:35 PM IST

Paruvu Web Series: ప‌రువు వెబ్‌సిరీస్‌ను మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. ఈ వెబ్‌సిరీస్‌ను ప్రొడ్యూస్ చేసిన కూతురు సుస్మిత కొణిదెల‌తో పాటు ఇందులో విల‌న్‌గా న‌టించిన నాగ‌బాబుపై చిరంజీవి ప్ర‌శంస‌లు కురిపించాడు.

ప‌రువు వెబ్‌సిరీస్‌
ప‌రువు వెబ్‌సిరీస్‌

Paruvu Web Series: చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేసిన తెలుగు వెబ్‌సిరీస్ ప‌రువు ఇటీవ‌ల జీ5 ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ప‌రువు హ‌త్య‌ల నేప‌థ్యంలో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సిరీస్‌లో నివేతా పేతురాజ్‌, న‌రేష్ అగ‌స్త్య కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ వెబ్‌సిరీస్‌లో నాగ‌బాబు నెగెటివ్ షేడ్స్‌తో కూడిన రోల్‌లో క‌నిపించారు.

సుస్మిత కొణిదెల‌...

గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టితో క‌లిసి సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ సిరీస్‌కు సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వన్ సాధినేని షో రన్నర్‌గా వ్య‌వ‌హ‌రించారు.

గ‌ర్వంగా ఉంది...

ప‌రువు వెబ్‌సిరీస్‌ను చూసిన మెగాస్టార్ చిరంజీవి సుస్మిత కొణిదెల‌తో పాటు నాగ‌బాబుపై ప్ర‌శంస‌లు కురిపించాడు. అద్భుత‌మైన కంటెంట్‌తో సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేసిన ఈ ఓటీటీ సిరీస్ బాగుంద‌ని చిరంజీవి ట్వీట్ చేశాడు. సుస్మిత‌ను చూస్తుంటే గ‌ర్వంగా ఉంద‌ని ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు. నాగ‌బాబు న‌ట‌న బ్రిలియంట్ అంటూ సోద‌రుడిని మెచ్చుకున్నారు చిరంజీవి.

ఒక చక్కటి ప్లాన్‌ తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై ఎమ్మెల్యే గారి పాట్లు...లాస్ట్‌కి ఈ జంట తప్పించుకుందా లేదా అని సీజ‌న్ 2లో చూడాలనుకుంటా అంటూ ప‌రువు వెబ్‌సిరీస్ ను ఉద్దేశించి చిరంజీవి చేసిన ఈ ట్వీట్ వైర‌ల్ అవుతోంది. ప‌రువు వెబ్ సిరీస్ స‌క్సెస్ కావ‌డం ఆనందంగా ఉంద‌ని చిరంజీవి పేర్కొన్నాడు.

ప‌రువు వెబ్ సిరీస్ క‌థ ఇదే...

ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప‌ల్ల‌వి (నివేతా పేతురాజ్‌) పెద్ద‌ల‌ను ఎదురించి తెలంగాణ‌కు చెందిన‌ సుధీర్‌ను (న‌రేష్ అగ‌స్త్య‌) ప్రేమ‌వివాహం చేసుకుంటుంది.వేరే కులానికి చెందిన వ్య‌క్తిని పెళ్లి చేసుకుంద‌ని ప‌ల్ల‌విని ఆమె త‌ల్లిదండ్రుల‌తో పాటు బంధువులు దూరం పెడ‌తారు. పెద‌నాన్న చ‌నిపోవ‌డంతో చివరిసారి అత‌డిని చూసేందుకు భ‌ర్త‌తో క‌లిసి ప‌ల్ల‌వి సొంత ఊరు బ‌య‌లుదేరుతుంది. అనుకోకుండా ఈ జ‌ర్నీలో ప‌ల్ల‌వి బావ చందును సుధీర్ చంపేస్తాడు.

చందు శ‌వాన్ని ఎవ‌రికి తెలియ‌కుండా మాయం చేయాల‌ని ప‌ల్ల‌వి, సుధీర్ ఫిక్స‌వుతారు. మ‌రోవైపు చందు జాడ కోసం అత‌డి ప్రియురాలు స్వాతి (ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌) వెతుకుంటుంది. లోక‌ల్ ఎమ్మెల్యే రామ‌య్య.(నాగ‌బాబు)..చందును కిడ్నాప్ చేశాడ‌ని అనుమానిస్తుంది.

ఆ త‌ర్వాత ఏమైంది? చందు డెడ్‌బాడీని సుధీర్‌, ప‌ల్ల‌వి ఎవ‌రి కంట ప‌డ‌కుండా మాయం చేయ‌డం కోసం ఎలాంటి ప్లాన్స్ వేశారు. ఓ ప‌రువు హ‌త్య‌కు చందుకు ఉన్న సంబంధం ఏమిటి? రామ‌య్య‌పై రివేంజ్ తీర్చుకోవ‌డానికి స్వాతి ఏం చేసింది? చందును చంప‌మ‌ని సుధీర్‌తో ప‌ల్ల‌వి ఎందుకు చెప్పింది? అన్న‌దే ఈ వెబ్‌సిరీస్ క‌థ‌.

బిగ్‌బాస్ బిందుమాధ‌వి...

ప‌రువు వెబ్‌సిరీస్‌లో ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, రాజ్‌కుమార్ క‌సిరెడ్డి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. ప‌రువు వెబ్‌సిరీస్‌కు సీజ‌న్ 2 కూడా రాబోతుంది. సీజ‌న్ వ‌న్ క్లైమాక్స్‌లో బిగ్‌బాస్ విన్న‌ర్ బిందుమాధ‌వి గెస్ట్ రోల్‌లో క‌నిపించి ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది. ప‌రువు సీజ‌న్ 2లో బిందు మాధ‌వి పాత్ర హైలైట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ హింట్ ఇచ్చారు.

ఫ‌స్ట్ వెబ్‌సిరీస్‌...

తెలుగులో నివేతా పేతురాజ్ చేసిన ఫ‌స్ట్ వెబ్‌సిరీస్ ఇది. ఈ సిరీస్‌తో చాలా కాలం త‌ర్వాత నివేతా పేతురాజ్ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రోవైపు తండ్రి సినిమాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌నిచేస్తోంది సుస్మిత కొణిదెల‌.

అలాగే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశాల‌తో కూడిన చిన్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌ను ప్రొడ్యూస్ చేసేందుకు గోల్డ్‌బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పేరుతో బ్యాన‌ర్‌ను ప్రారంభించింది. ఈ బ్యాన‌ర్‌పై షూట్ అవుట్ ఎట్ ఆలేరుతో పాటు శ్రీదేవి శోభ‌న్‌బాబు, సేనాప‌తి సినిమాల‌ను నిర్మించింది సుస్మిత కొణిదెల‌. ప‌రువు ఆమె ప్రొడ్యూస్ చేసిన సెకండ్ వెబ్‌సిరీస్ కావ‌డం గ‌మ‌నార్హం.

WhatsApp channel