Bollywood: ఈ ఏడాది బాలీవుడ్‍కు తొలి బ్లాక్‍బస్టర్ ఇదే! కలెక్షన్లలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా సినిమా దూకుడు
Chhaava Box office Collections: ఛావా చిత్రం కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. మంచి ఓపెనింగ్ దక్కించుకున్న ఈ మూవీ అదే రోజు కొనసాగిస్తోంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ దిశగా దూసుకెళుతోంది.

బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఛావా చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ హిస్టారికల్ యాక్షన్ చిత్రం ఈ శుక్రవారం ఫిబ్రవరి 14వ తేదీన థియేటర్లలో రిలీజైంది. కొన్ని వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ మూవీ విడుదలైంది. క్రేజ్‍తో వచ్చిన ఛావా చిత్రం అంచనాలను అందుకుంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లలోనూ అదరగొడుతోంది.
రెండు రోజుల కలెక్షన్లు
ఛావా చిత్రం రెండు రోజుల్లో ఇండియాలో రూ.67.50 కోట్ల నెట్ కలెక్షన్లను దక్కించుకుంది. భారత్‍లో తొలి రోజు రూ.31కోట్లు రాగా.. రెండో రోజు రూ.36.50కోట్లను ఈ చిత్రం సొంతం చేసుకుంది. ఫస్ట్ డే కంటే రెండో రోజు కలెక్షన్లలో వృద్ధి ఉంది. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లపరంగా ఈ చిత్రం రూ.100కోట్లు దాటేసినట్టు తెలుస్తోంది.
ఛావా సినిమాకు ఆదివారమైన మూడో రోజు కూడా బుకింగ్స్ చాలా బాగున్నాయి. ఎక్కువ శాతం పాజిటివ్ టాక్ రావడం బాగా కలిసి వచ్చింది. దీంతో ఇండియాలో రూ.100కోట్ల నెట్ కలెక్షన్లను నేడే ఈ చిత్రం దాటేయనుంది. వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.150కోట్లు క్రాస్ చేయనుంది. ఆ తర్వాత కూడా ఛావా మూవీ జోరు కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తోంది. పెద్దగా పోటీ కూడా లేదు.
2025లో బాలీవుడ్‍కు ఫస్ట్ హిట్
ఈ 2025లో బాలీవుడ్‍లో ఛావానే తొలి బ్లాక్‍బస్టర్‌గా కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మూవీ రూ.130కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. టాక్‍ను బట్టి చూస్తే ఫుల్ రన్‍లో ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో వచ్చిన బాలీవుడ్ చిత్రాలు ఫతే, ఎమర్జెన్సీ, స్కైఫోర్స్, దేవా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేదు. దీంతో బాలీవుడ్‍లో ఛావానే ఈ ఏడాది ఫస్ట్ బ్లాక్‍బస్టర్ కానుండడం కచ్చితంగా కనిపిస్తోంది.
సంబాజీ మహరాజ్ జీవితం ఆధారంగా..
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు ఛత్రపతి సంబాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఛావా చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ప్రశంసలు ఎక్కువగా వస్తున్నాయి. సంబాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటన అద్భుతమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రంలో యెసుబాయ్ పాత్రను రష్మిక చేశారు. ఈ చారిత్రక సినిమాను అద్భుతంగా తెరకెక్కించారంటూ డైరెక్టర్ లక్ష్మణ్‍ను చాలా మంది పొగుడుతున్నారు. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సులు, ఎమోషనల్ సీన్లు మెప్పించేలా ఉందనే టాక్ వచ్చింది.
ఛావా చిత్రంలో విక్కీ కౌశల్, రష్మికతో పాటు అక్షయ్ ఖన్నా, అశుతోశ్ రాణా, దివ్య దసత్తా, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేకర్, ఆలోక్ నాథ్, కిరణ్ కమర్కర్ కీలకపాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి పెద్ద బలంగా నిలిచింది. ఈ చిత్రాన్ని మాడ్‍డాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ చేశారు.
సంబంధిత కథనం
టాపిక్