Chatrapathi Teaser: ఛత్రపతి హిందీ టీజర్ వచ్చేసింది.. మక్కీకి మక్కీ దించేశారు
Chatrapathi Teaser: ఛత్రపతి హిందీ టీజర్ వచ్చేసింది. తెలుగు ఛత్రపతి రీమేక్ కావడంతో దానికి మక్కీకి మక్కీ దించేశారు. హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ లీడ్ రోల్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే.
Chatrapathi Teaser: ఛత్రపతి మూవీ టాలీవుడ్ లో ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో గుర్తుంది కదా. ఎప్పుడో 18 ఏళ్ల కిందట వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. దర్శక ధీరుడు రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ఇది. యంగ్ రెబల్ స్టార్ గా పేరుగాంచిన ప్రభాస్ కు అతికినట్లు సరిపోయే క్యారెక్టర్ ఇది.
ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఇదే మూవీని మన తెలుగు డైరెక్టర్, తెలుగు హీరో హిందీలో రీమేక్ చేస్తుండటం విశేషం. ఛత్రపతి పేరుతోనే వస్తున్న ఈ సినిమా టీజర్ ను గురువారం (మార్చి 30) రిలీజ్ చేశారు. ఇందులో లీడ్ రోల్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తుండగా.. వీవీ వినాయక్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే.. తెలుగు ఛత్రపతిని మక్కీకి మక్కీ దించేసినట్లు కనిపిస్తోంది. ప్రభాస్ ప్లేస్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించడం తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్. యాక్షన్ సీన్స్, హీరో ఎలివేషన్ పక్కాగా 18 ఏళ్ల కిందటి ఛత్రపతి చూస్తున్నట్లే అనిపించింది. ఈ మూవీ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ మేకోవర్ మాత్రం బాగుంది.
శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ధవల్ జయంతిలాల్, అక్షయ్ జయంతిలాల్ పెన్ స్టూడియోస్ బ్యానర్ కింద మూవీని నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ ఛత్రపతి మూవీ ప్రభాస్, రాజమౌళి స్థాయిని మరో లెవల్ కు తీసుకెళ్లింది. హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ తనదైన రీతిలో ఎమోషన్ ను పండించే రాజమౌళి.. ఛత్రపతిని ప్రేక్షకులకు దగ్గర చేశాడు.
ఒరిజినల్ మూవీలో ప్రభాస్ చూపించిన రౌద్రాన్ని ఈ రీమేక్ లోనూ బెల్లంకొండ శ్రీనివాస్ చూపించాడు. తన ఫిజిక్ ను కూడా పూర్తిగా మార్చేశాడు. మరి తెలుగులో సక్సెస్ అయిన ఈ మూవీ హిందీలో ఏం చేస్తుందో చూడాలి.