Chandrayaan 3: ‘ప్రణామ్ ఇస్రో’ ‘ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదు’: చిరంజీవి, రాజమౌళి సహా సినీ ప్రముఖుల ట్వీట్లు
Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం అవటంతో దేశ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ హీరో చిరంజీవి, దర్శక ధీరుడు రాజమౌళి సహా చాలా మంది ట్వీట్లు చేశారు.
Chandrayaan 3: చంద్రయాన్ 3 విజయవంతంతో భారత్ చరిత్ర సృష్టించింది. జాబిల్లిపై అడుగుపెట్టింది. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుమోపిన తొలి దేశంగా ఇండియా రికార్డు సృష్టించింది. ఇస్రో చరిత్రలో అతిపెద్ద విజయంగా చంద్రయాన్ 3 నిలిచింది. చంద్రయాన్ 3 నుంచి విక్రమ్ ల్యాండర్ బుధవారం సాయంత్రం విజయంతంగా చంద్రుడిపై దిగడంతో దేశమంతా సంబరాలు చేసుకుంటోంది. ఈ అపూర్వ విజయం పట్ల కోట్లాది మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా భారత్, ఇస్రో సాధించిన విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ల ద్వారా తమ సంతోషాన్ని తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు
భారత దేశం సాధించిన గొప్ప విజయాల్లో చంద్రయాన్-3 నిలిచిందని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ మిషన్ అద్భుత విజయాన్ని దక్కించుకుందని హర్షం వ్యక్తం చేశారు. నేటి రోజు చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. “భారత శాస్త్రవేత్తలను అభినందిస్తున్న, సంబరాలు చేసుకుంటున్న వందకోట్ల మందిలో నేను జాయిన్ అవుతున్నా. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలకు, మరిన్ని సాంకేతిక మిషన్లకు ఇది దారి వేసింది. చంద్రుడిపై హాలీడే మరెంతో దూరంలో లేదని ఆశిస్తున్నా” అని చిరంజీవి ట్వీట్ చేశారు.
గర్వంతో తన హృదయం ఉప్పొంగిందని, ప్రణామ్ ఇస్రో అంటూ దర్శక ధీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు. “గర్వంతో నా హృదయం ఉప్పొంగిపోయింది. చెక్కిళ్లపై కన్నీళ్లు దొర్లుతున్నాయి. అద్భుతమైన విజయం సాధించిన ఇస్రోకు ప్రణామాలు. చంద్రయాన్ 3 స్మూత్ ల్యాండింగ్ భారత అంతరిక్ష చరిత్రలో కొత్త శకాన్ని సూచిస్తోంది” అని రాజమౌళి పోస్ట్ చేశారు.
“చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 3 మిషన్‍ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఇస్రోకు నా హృదయపూర్వక అభినందనలు. ఇస్రో ఎప్పుడూ దేశానికి గర్వకారణం” అని స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. “ఇస్రోకు అభినందనలు. భారత అంతరిక్ష పరిశోధనల్లో ఇవి గర్వించదగ్గ క్షణాలు. చంద్రుడి దక్షిణ ధృవాన్ని తాకిన తొలి దేశంగా అత్యద్భుత విజయాన్ని భారత్ సాధించింది. జై హింద్” అని ఐకాన్ హీరో అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
“చంద్రుడి దక్షిణ ధృవంపైకి అద్భుతమైన, విజయవంతమైన ప్రయాణం. భారత దేశ శాస్త్ర నైపుణ్యాలకు, అత్యద్భుత అంతరిక్ష పరిశోధనలకు ఈ విజయం ఓ గొప్ప నిదర్శనం. ఆకాశం కూడా ఇది హద్దు కాదు. ఇస్రోకు అభినందనలు” అని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. రవితేజ, విజయ్ దేవరకొండ, మంచు మనోజ్ సహా చాలా మంది టాలీవుడ్ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు చంద్రయాన్ 3 విజయవంతంపై సంతోషం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.