Chirag Paswan Kangana Ranaut: ఈ కొత్త కేంద్ర మంత్రి, కొత్త ఎంపీ కలిసి సినిమా చేశారన్న విషయం మీకు తెలుసా?
Chirag Paswan Kangana Ranaut: కొత్తగా కేంద్ర మంత్రి అయిన చిరాగ్ పాశ్వాన్, ఎంపీ అయిన కంగనా రనౌత్ ఒకప్పుడు కలిసి ఓ సినిమా చేశారన్న విషయం మీకు తెలుసా? ఆ సినిమా ఏంటో చూడండి.
Chirag Paswan Kangana Ranaut: కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీయే సర్కారులో కొత్తగా మంత్రి అయిన వ్యక్తి, కొత్తగా ఎంపీగా ఎన్నికైన నటి ఒకప్పుడు కలిసి బాలీవుడ్ లో ఓ సినిమా తీశారు. ఆ మూవీ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇప్పటి మంత్రికి అదే కెరీర్లో తొలి, చివరి సినిమాగా మిగిలిపోయింది. ఆ మంత్రి పేరు చిరాగ్ పాశ్వాన్ కాగా.. ఆ నటి, ఎంపీ పేరు కంగనా రనౌత్.
కేంద్ర మంత్రి, ఎంపీ మూవీ ఇదే
ఇప్పుడు కేంద్ర మంత్రి హోదాలో చిరాగ్ పాశ్వాన్, ఎంపీ హోదాలో కంగనా రనౌత్ ఒకరినొకరు ఢిల్లీలో పలకరించుకున్నారు. ఒకప్పటి తమ మధ్య ఉన్న సినీ బంధాన్ని నెమరేసుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి 2011లో వచ్చిన మిలే నా మిలే హమ్ సినిమాలో నటించారు. ఆ మూవీలో చిరాగ్ పాశ్వాన్ ఓ టెన్నిస్ ప్లేయర్ గా నటించగా.. కంగనా ఓ మోడల్ గా కనిపించింది.
అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం బోల్తా పడింది. కబీర్ బేడీ, పూనమ్ ధిల్లాన్, నీరు బజ్వా, సాగరికా ఘట్గే, సురేశ్ మేనన్ లాంటి వాళ్లు నటించినా.. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో చిరాగ్ ఇదొక్క సినిమా చేసి తనకు మరెంతో ఇష్టమైన రాజకీయాల వైపు వెళ్లిపోయాడు. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత ఏకంగా కేంద్ర మంత్రి అయ్యాడు.
ఎవరీ చిరాగ్ పాశ్వాన్?
చిరాగ్ పాశ్వాన్ ఒకప్పటి ప్రముఖ నేత, దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడే. వీళ్లది బిహార్ లోని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ). ఈ పార్టీ చాలా రోజులుగా బీజేపీకి అండగా ఎన్డీయేలోనే ఉంటూ వస్తోంది. 2011లో తన తొలి, చివరి సినిమా చేసిన తర్వాత చిరాగ్ మరో మూవీలో కనిపించలేదు. 2014లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాడు. అప్పటి నుంచీ ఎల్జేపీ బాధ్యతలు చూస్తున్నాడు.
బీహార్ లో గొప్ప యూత్ లీడర్ గా ఎదిగాడు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హజీపూర్ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికయ్యాడు. ఒకప్పుడు తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ పోటీ చేసి కేంద్ర మంత్రి అయ్యింది కూడా ఇదే స్థానం నుంచి కావడం గమనార్హం. తనతోపాటు తన పార్టీకి చెందిన మరో నలుగురు ఎంపీలను కూడా చిరాగ్ గెలిపించుకొని ఎన్డీయే భాగస్వామిగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
తనకు నటనంటే ఎంతో ఇష్టమని అందుకే బాలీవుడ్ వైపు కూడా వెళ్లినట్లు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చిరాగ్ చెప్పాడు. అయితే తాను ఎప్పటికైనా రాజకీయాల్లోనే స్థిరపడాలని కూడా ముందు నుంచీ భావించినట్లు తెలిపాడు. మరోవైపు బీజేపీ తరఫున హిమాచల్ ప్రదేశ్ నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తొలిసారి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ ఈ మధ్యే ఢిల్లీలో కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు.
కంగనా రనౌత్ మండి నియోజకవర్గం నుంచి 74 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఈ ఏడాదే బీజేపీలో చేరిన ఎంపీ టికెట్ సంపాదించిన ఆమె.. తొలిసారే భారీ మెజార్టీతో గెలవడం నిజంగా విశేషమే. ఆమె నటించిన ఎమర్జెన్సీ సినిమా ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది.