Criminal or Devil Review: సీడీ (క్రిమిన‌ల్ ఆర్ డెవిల్ ) రివ్యూ - అదా శ‌ర్మ హార‌ర్ మూవీ ఎలా ఉందంటే?-cd criminal or devil movie review adah sharma telugu horror movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Criminal Or Devil Review: సీడీ (క్రిమిన‌ల్ ఆర్ డెవిల్ ) రివ్యూ - అదా శ‌ర్మ హార‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Criminal or Devil Review: సీడీ (క్రిమిన‌ల్ ఆర్ డెవిల్ ) రివ్యూ - అదా శ‌ర్మ హార‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh Kumar HT Telugu
May 24, 2024 02:50 PM IST

Criminal or Devil Review: అదాశ‌ర్మ‌, విశ్వాంత్ హీరోహీరోయిన్లుగా న‌టించిన హార‌ర్ మూవీ సీడీ (క్రిమిన‌ల్ ఆర్ డెవిల్‌) శుక్ర‌వారం థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ మూవీ ఎలా ఉందంటే?

సీడీ క్రిమినల్ ఆర్ డెవిల్ మూవీ రివ్యూ
సీడీ క్రిమినల్ ఆర్ డెవిల్ మూవీ రివ్యూ

Criminal or Devil Review: తెలుగులో హార్ట్ ఎటాక్‌, క్ష‌ణం, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తితో పాటు ప‌లు సినిమాలు చేసింది అదాశ‌ర్మ‌. కొన్నాళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటోన్న అదాశ‌ర్మ సీడీ (క్రిమిన‌ల్ ఆర్ డెవిల్‌) మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో విశ్వాంత్ హీరోగా న‌టించాడు. కృష్ణ అన్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సీడీ మూవీ శుక్ర‌వారం రిలీజైంది. ఈ హార‌ర్ మూవీతో అదా శ‌ర్మ‌కు హిట్టు ద‌క్కిందా? లేదా? అంటే…

సిద్ధు...ర‌క్ష...క‌థ‌...

సిద్దు (విశ్వాంత్)కు ద‌య్యాలంటే భ‌యం. ఇంట్లో ఒంట‌రిగా ఉండ‌టానికి కూడా జంకుతుంటాడు. ఓ రోజు సిద్ధు అమ్మానాన్నలు పెళ్లి కోసం ఊరికి వెళ్ల‌డంతో ఒక్క‌డే ఇంట్లో ఉండాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. ఆ టైమ్‌లోనే అనుకోకుండా డెవిల్ అనే దెయ్యం సినిమా చూస్తాడు.ఆ సినిమాలోని ద‌య్యం త‌న‌ను వెంటాడుతున్న‌ట్లు, చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు భ్ర‌మ‌ప‌డ‌తాడు.

మ‌రోవైపు సిటీలో అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంటుంది లేడీ సైకో రక్ష (అదా శర్మ) . ఆమెను ప‌ట్టుకునేందుక పోలీసులు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన ఫ‌లించ‌వు. ఐ విల్ కిల్ యూ అని రాస్తూ మరీ అందరినీ ర‌క్ష కిడ్నాప్ చేస్తుంటుంది. ఒంట‌రిగా ఉన్న సిద్ధును వెతుక్కుంటూ అత‌డి ఇంటికి వ‌స్తుంది ర‌క్ష‌. సిద్ధు ద‌గ్గ‌ర‌కు సైకో రక్ష రావ‌డానికి కార‌ణం ఏమిటి? సిద్ధుకు ఉన్న సమస్య ఏంటి?

సిటీలో అమ్మాయిల మిస్సింగ్ వెనుక ర‌క్ష‌నే ఉందా? మ‌రెవ‌రైనా ఉన్నారా? మిస్స‌యిన అమ్మాయిలు ఎమ‌య్యారు? సిద్దు గురించి ర‌క్ష‌...ర‌క్ష గురించి సిద్ధు ఒక‌రికొక‌రు తెలుసుకున్న నిజానిజాలేమిటి అన్న‌దే సీడీ (క్రిమిన‌ల్ ఆర్ డెవిల్) మూవీ క‌థ‌.

సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌...

హార‌ర్ అంశాల‌తోసాగే సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు కృష్ణ అన్నం సీడీ (క్రిమిన‌ల్ ఆర్ డెవిల్‌) మూవీ తెర‌కెక్కించాడు. హార‌ర్ సినిమాలు చాలా వ‌ర‌కు పాత‌కాలం నాటి ఇళ్లు, విల్లా చుట్టూ తిరుగుతుంటాయి. వికృత రూపాల‌తో ద‌య్యాల‌ను చూపించి ఆడియెన్స్‌ను భ‌య‌పెడుతుంటారు ద‌ర్శ‌కులు.

ఈ రొటీన్ పార్ములానే ద‌ర్శ‌కుడు సీడీలో కొత్త‌గా చూపించాడు. హీరో ఇంటి నేప‌థ్యంలోనే ఈ సినిమా క‌థ‌ను అల్లుకున్నారు. సీడీలో ద‌య్యం గ్లామ‌ర‌స్‌గా క‌నిపిస్తుంది. హీరో ద‌య్యాన్ని చూసి భ‌య‌ప‌డే సీన్స్ నుంచి థ్రిల్‌తో పాటు రొమాన్స్‌ను కూడా స్క్రీన్‌పై ఆవిష్క‌రించాడుడైరెక్ట‌ర్‌.

రెండు పాత్ర‌లే...

సినిమాలో ఎక్కువ‌గా విశ్వాంత్‌, ఆదాశ‌ర్మ పాత్ర‌లే స్క్రీన్‌పై క‌నిపిస్తాయి. మిగిలిన వాళ్లు గెస్ట్‌లా అప్పుడ‌ప్పుడు ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోతుంటారు. ఈ ఇద్ద‌రి పాత్ర‌ల‌కు సంబంధించి క్లైమాక్స్‌లో ద‌ర్శ‌కుడు రాసుకున్న ట్విస్ట్ మాత్రం బాగుంది. అమ్మాయిల మిస్సింగ్ వెనుక‌న్న మ‌లుపు మాత్రం స‌ర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది.

ఫ‌స్ట్ హాఫ్ ఫ‌న్‌...

ఫ‌స్ట్ హాఫ్‌లో ఇంట్లో ఒంట‌రిగా ఉండ‌టానికి సిద్ధు భ‌య‌ప‌డే సీన్స్‌ను ఫ‌న్నీగా చూపించారు ద‌ర్శ‌కుడు. మ‌రోవైపు అమ్మాయిల మిస్సింగ్‌కు సంబంధించి పోలీసుల‌ ఇన్వేస్టిగేష‌న్ సీన్స్‌తో పాటు సైకోగా అదాశ‌ర్మ‌ను ప‌రిచ‌యం చేయ‌డం ఆస‌క్తిని పంచుతుంది. సెకండాఫ్‌లో సిద్ధును వెతుక్కుంటూ ర‌క్ష అత‌డికి ఇంటికి ఆమె ద‌య్య‌మా? కాదా అన్న‌ది తెలియ‌క సిద్ధు భ‌య‌ప‌డే సీన్స్ ఎంగేజింగ్ గా అనిపిస్తాయి. రొమాన్స్‌ను మిక్స్ చేస్తూ హార‌ర్ సీన్స్‌తో ద‌ర్శ‌కుడు సెకండాఫ్‌ను న‌డిపించాడు.

పాయింట్ కొత్త‌ది కానీ...

సీడీ మూవీ కోసం ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ కొత్త‌గా ఉంది. ఈ పాయింట్‌ను థ్రిల్లింగ్‌గా చెప్ప‌డంలో త‌డ‌బ‌డిన‌ట్లుగా అనిపిస్తుంది. కేవ‌లం క్లైమాక్స్ ట్విస్ట్ కోస‌మే క‌థ‌ను సాగిదీసిన‌ట్లు అనిపిస్తుంది. హార‌ర్ ఎలిమెంట్స్ అంత‌గా భ‌య‌పెట్ట‌లేక‌పోయాడు.

అదా శ‌ర్మ యాక్టింగ్‌...

యాక్టింగ్ ప‌రంగా అదా శ‌ర్మ ఈ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచిందినెగెటివ్‌, పాజిటివ్ షేడ్స్‌తో కూడిన ర‌క్ష పాత్ర‌లో చ‌క్క‌టి వేరియేష‌న్స్ చూపించింది. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో అద‌ర‌గొట్టింది.

అతి భ‌య‌స్తుడిగా విశ్వాంత్ నాచుర‌ల్ యాక్టింగ్‌ను క‌న‌బ‌రిచాడు. జ‌బ‌ర్ధ‌స్థ్ రోహిణి కామెడీ కొంత వ‌ర‌కు న‌వ్వించింది.

హార‌ర్ మూవీ...

సీడీ కొత్త పాయింట్‌తో వ‌చ్చిన ఓ రొటీన్ హార‌ర్ మూవీ. అదాశ‌ర్మ‌, విశ్వాంత్ యాక్టింగ్ కోసం ఓ సారి చూడొచ్చు.

రేటింగ్‌: 2.5/5

Whats_app_banner