Allu Arjun Case: అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా చిక్కుల్లో
Pushpa 2 screening: అభిమానులతో కలిసి పుష్ప 2 బెనిఫిట్ షోను చూసేందుకు సడన్‌గా అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కి వచ్చారు. దాంతో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా… ఆమె కొడుకు..?
పుష్ప 2 రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న వేళ.. అల్లు అర్జున్‌కి చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా.. ఆ ఘటనకి అల్లు అర్జున్‌ని బాధ్యుడిని చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. అలానే థియేటర్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.
సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్
ప్రపంచవ్యాప్తంగా బుధవారం అర్ధరాత్రి నుంచి పుష్ప 2 రిలీజ్ అవ్వగా.. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో వేసిన బెనిఫిట్ షోని చూసేందుకు అల్లు అర్జున్ కూడా వచ్చాడు. అల్లు అర్జున్ రాకతో థియేటర్ వద్ద ఒక్కసారిగా అలజడి వాతావరణం నెలకొంది.
అల్లు అర్జున్‌ని చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో.. జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ (9) తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
చిక్కుల్లో సంధ్య థియేటర్
ఈ ఘటనపై విచారణ జరిగిన తెలంగాణ పోలీసులు.. అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. అలానే భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటూ.. ఆ థియేటర్ మూసివేతకి సిఫార్సు చేసినట్లు తెలిపారు.
టికెట్ల తనిఖీ కోసం ఒక్కసారిగా ప్రేక్షకుల్ని అనుమతించారని, కనీస భద్రతా ప్రమాణాల్ని పాటించలేదని థియేటర్ సిబ్బందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. తమకి లేదా థియేటర్ యాజమాన్యానికి కనీసం సమాచారం ఇవ్వకుండా అక్కడికి వచ్చిన అల్లు అర్జున్‌పై కూడా కేసు నమోదు చేశారు.
అల్లు అర్జున్ టీమ్ సాయం
మహిళ మృతి ఘటనపై అల్లు అర్జున్ టీమ్‌తో పాటు పుష్ప2 నిర్మాణ సంస్థ కూడా స్పందించింది. ఆమె కొడుకు చికిత్సతో పాటు.. కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పుష్ప 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అభిమానుల్ని ఉద్దేశించి అల్లు అర్జున్ ‘ఆర్మీ’ పదం ఉపయోగించినందుకు కూడా ఇప్పటికే ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే.