Cannes Film Festival 2024: రెండు డ్రెస్సులు.. రూ.105 కోట్లు.. కేన్స్‌లో అగ్గి పుట్టించిన ఈ ఇండియన్ నటి ఎవరో తెలుసా?
Cannes Film Festival 2024: ఓ ఇండియన్ నటి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అగ్గి పుట్టించింది. కేవలం రెండే రెండు డ్రెస్సులు వేసుకుంది. కానీ వీటి విలువ ఏకంగా రూ.105 కోట్లు కావడం విశేషం.
Cannes Film Festival 2024: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రపంచవ్యాప్తంగా సినీ తారల తళుకు బెళుకులు సహజమే. ఎన్నో రకాల డ్రెస్సులు.. వాటి గురించి వింతలు, విశేషాలు కూడా ఎన్నో. కానీ ఓ ఇండియన్ నటి మాత్రం అందరినీ షాక్ కు గురి చేసింది. ఆమె వేసుకుంది రెండే రెండు డ్రెస్సులు అయినా.. వాటి విలువ ఏకంగా రూ.105 కోట్ల అని తెలిసి అందరూ నోరెళ్లబెట్టారు.
ఊర్వశి రౌతేలానా మజాకా?
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు ఈ ఘనత దక్కుతుంది. ఈసారి కేన్స్ రెడ్ కార్పెట్ పై ఎంతోమంది ఇండియన్ తారలు మెరిశారు. ఐశ్వర్య రాయ్ తోపాటు కియారా అద్వానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, శోభితా దూళిపాళ్ల, అదితి రావ్ హైదరీ, 11 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రీతి జింటాలాంటి వాళ్లు అక్కడికి వెళ్లారు. ఇక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సెర్ నాన్సీ త్యాగి అయితే స్వయంగా తాను డిజైన్ చేసిన చీరలోనే హాజరైంది.
వీళ్లందరూ ఒకెత్తయితే.. ఊర్వశి రౌతేలా మరో ఎత్తు. ఆమె రెండు రోజుల పాటు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై మెరిసింది. తొలిరోజు ఆమె ఓ పింక్ గౌన్ లో కనిపించింది. ఆ గౌను ఖరీదెంతో తెలుసా? అక్షరాలా రూ.47 కోట్ల అని డీఎన్ఏ ఇండియా రిపోర్టు వెల్లడించింది. ఈ కస్టమ్ మేడ్ గౌన్ ధర తెలిసి అందరూ షాక్ తింటున్నారు. ఓపెనింగ్ సెర్మనీలో ఆమె ఈ గౌన్ వేసుకుంది.
అయితే ఈ గౌను ధరపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ డ్రెస్ ఖరీదు రూ.7 కోట్లే అని కూడా అంటున్నారు.
మరో గౌను రూ.58 కోట్లు..
ఇక అదే కేన్స్ లో నాలుగో రోజు ఊర్వశి రౌతేలా మరింత ఖరీదైన డ్రెస్ లో వెళ్లి ఆశ్చర్యపరిచింది. ఈసారి బ్లాక్ అండ్ వైట్ కస్టమ్ మేడ్ డ్రెస్ ధర ఏకంగా రూ.58 కోట్లు అని కూడా అదే డీఎన్ఏ రిపోర్టు తెలిపింది. అయితే ఈ డ్రెస్ ధరపైనా ఇంకా స్పష్టత లేదు. ఆ లెక్కన రెండు డ్రెస్సులు కలిపి రూ.105 కోట్లు అయ్యాయి. మామూలుగా లక్షల్లో డ్రెస్సులు చూస్తేనే కళ్లు బైర్లు కమ్ముతాయి. అలాంటిది ఊర్వశి ఇలా కోట్లలో డ్రెస్సులు వేసుకెళ్లడం అసలు ఊహకు కూడా అందనిదే.
ఆ మధ్య తన బర్త్ డే సందర్భంగా ఏకంగా రూ.3.5 కోట్ల విలువైన కేక్ కట్ చేసి ఆశ్చర్య పరిచిన ఆమె.. ఇప్పుడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కోట్ల డ్రెస్సులతో షాక్ కు గురి చేసింది. ఇక ఇదే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించిన కియారా అద్వానీ కూడా పింక్, బ్లాక్ డ్రెస్ లో కనిపించింది. ఆ డ్రెస్ కంటే ఆమె ధరించిన రూ.30 కోట్ల విలువైన నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇక 11 ఏళ్ల తర్వాత మళ్లీ కేన్స్ లో అడుగుపెట్టిన బాలీవుడ్ నటి ప్రీతి జింటా కూడా లక్షల ఖరీదైన డ్రెస్సే వేసుకుంది. ఆమె డ్రెస్ ఖరీదు రూ.5.5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐశ్వర్య రాయ్ సింపుల్ గా రూ1.8 లక్షల విలువైన కార్డెలియా జంప్‌సూట్ లో వచ్చింది. ఆమె డ్రెస్సింగ్, చేతికి కట్టుపై ఈసారి భారీగానే ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.