Butter Fly Telugu Movie Review: బటర్ ఫ్లై మూవీ రివ్యూ - అనుపమ పరమేశ్వరన్ ఓటీటీలో హిట్ దక్కించుకుందా?
Butter Fly Telugu Movie Review: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన బటర్ ఫ్లై సినిమా గురువారం (నేడు)డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజైంది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే...
Butter Fly Telugu Movie Review: ఈ ఏడాది కార్తికేయ-2, 18 పేజేస్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది అనుపమ పరమేశ్వరన్ (anupama parameswaran). థియేటర్లలో విడుదలైన ఈ రెండు సినిమాలు చక్కటి వసూళ్లను దక్కించుకున్నాయి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన తాజా సినిమా బటర్‌ఫ్లై మాత్రం థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు ఘంటా సతీష్ బాబు దర్శకత్వం వహించాడు. భూమిక, రావురమేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ గురువారం (నేడు)డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో (Disney Plus Hotstar )బటర్ ఫ్లై రిలీజైంది. ఓటీటీలో అనుపమకు హిట్ దక్కిందా లేదా తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే...
ట్రెండింగ్ వార్తలు
Butterfly Movie Story - గీత అన్వేషణ
వైజయంతి (భూమిక). గీత (అనుపమ పరమేశ్వరన్) అక్కాచెల్లెళ్లు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతారు. ఎన్నో కష్టాలు పడి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వైజయంతి సిటీలోనే ఫేమస్ క్రిమినల్ లాయర్‌గా పేరుతెచ్చుకుంటుంది. గీత సీఏగా పనిచేస్తుంటుంది. చిన్నతనం నుంచి తనను ప్రేమగా పెంచిన అక్క వైజయంతిని తన అమ్మగా భావిస్తుంటుంది గీత. అక్క అని కాకుండా అమ్మ అనే పిలుస్తుంటుంది.
వైజయంతి తన భర్త సోమశేఖర్‌కు (రావురమేష్) దూరంగా ఉంటుంది. అతడి వ్యక్తిత్వం నచ్చక విడాకులు తీసుకోవాలని అనుకుంటుంది. వృత్తిలో భాగంగా ఓ రోజు వైజయంతి ఢిల్లీ వెళుతుంది.
ఆ సమయంలో ఆమె పిల్లలు చిన్ను, బన్నులను ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాపర్ గీతకు ఫోన్ చేసి చాలా డిమాండ్స్ పెడతాడు? అవేమిటి? ఆ కిడ్నాపర్ ఎవరు? వైజయంతి పిల్లలను ఎందుకు కిడ్నాప్ చేశాడు? అక్క పిల్లలను కాపాడుకోవడానికి గీత ఏం చేసింది? వారిని గీత కాపాడిందా? లేదా? ఈ ప్రయత్నంలో గీతకు ఆమె లవర్ విశ్వ (నిహాల్) ఎలా అండగా నిలిచాడు అన్నదే బటర్‌ఫ్లై (Butterfly Movie Review)కథ.
కిడ్నాప్ డ్రామా...
బటర్ ఫ్లై కిడ్నాప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మిస్టరీ థ్రిల్లర్ సినిమా. సాధారణంగా కిడ్నాప్ డ్రామాలన్నీ ఒకే రీతిలో సాగుతుంటాయి. హీరోహీరోయిన్ల ఫ్యామిలీ మెంబర్స్, కావాల్సిన వారు ఎవరో ఒకరు కిడ్నాప్ కావడం, విలన్ వేసే ఎత్తులను తమ తెలివితేటలతో చిత్తు చేస్తూ చివరలో నాయకానాయికలు గెలిచినట్లుగా చూపిస్తూ ఈ కథలు ఎండ్ అవుతాయి.
బటర్ ఫ్లై అలాంటి కథే. ఈ రొటీన్ కథలను ఎంగేజింగ్‌గా చెప్పడం అంత ఈజీ కాదు. స్క్రిప్ట్ స్టేజ్‌లోనే దర్శకుడు చాలా వర్క్ చేసుకోవాలి. సీన్స్‌ను కొత్తగా రాసుకుంటేనే ఈ సినిమాలు వర్కవుట్ అవుతాయి. బటర్ ఫ్లైలో మాత్రం ఆ మ్యాజిక్ మిస్సయింది. దర్శకుడు ఘంటా సతీష్‌బాబు రాసుకున్న కథ పేలవంగా ఉంది.
సాగతీత...
చిన్న ట్విస్ట్‌ను నమ్ముకొని దర్శకుడు బటర్‌ఫ్లై సినిమాను తెరకెక్కించాడు. అది కూడా పెద్ద సర్‌ప్రైజింగ్‌గా లేదు. అదేమిటో రివీల్ చేస్తే సినిమా చూడాలన్న క్యూరియాసిటీ పోతుంది. ఆ చిన్న పాయింట్ కోసం రెండు గంటలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు డైరెక్టర్.
కిడ్నాప్ చేసింది ఎవరన్నది గీతతో సంబంధం ఉన్న అందరిపై అనుమానం వచ్చేలా స్క్రీన్‌ప్లే రాసుకుంటే బాగుండేది. అలా కాకుండా కేవలం హీరోయిన్ క్యారెక్టర్‌పై సింపతీ వచ్చేలా ఆ సీన్స్‌ను నడిపించాడు. సమాజంలో ఒంటరి ఆడపిల్లకు ఎదురయ్యే కష్టాల్ని ఆ సన్నివేశాల ద్వారా చూపించాలని అనుకున్నాడు. కానీ అవన్నీ అసహజంగా ఉన్నాయి.
మలుపులు లేవు...
సినిమా ప్రారంభమైన ముప్పై నిమిషాల వరకు వైజయంతి, గీత పాత్రల పరిచయానికే సమయం తీసుకున్నాడు డైరెక్టర్. పిల్లల కిడ్నాప్‌తో అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చే గంటన్నర మొత్తం కిడ్నాపర్ డబ్బులు డిమాండ్ చేయడం, ఆ డబ్బుల కోసం గీత అందరి దగ్గరకు వెళ్లడం ఇదే తంతు చివరి వరకు నడుస్తుంది. ఈ సీన్స్‌లో ఎలాంటి మలుపులు ఉండవు(Butterfly Movie Review. చివరలో కిడ్నాపర్స్ అందరూ గీత ఫ్యామిలీతో సంబంధం ఉన్నట్లుగా చూపించి శుభం కార్డు వేశారు.
అనుపమ పాత్ర ప్రధానంగా…
బటర్ ఫ్లై సినిమా మొత్తం అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. అక్క పిల్లలను కాపాడుకోవడానికి తపన పడే యువతి పాత్రలో చక్కటి భావోద్వేగాలను పలికించింది. నటన పరంగా ఎలాంటి ఛాలెంజెస్ లేని క్యారెక్టర్ కావడంతో పెద్దగా కష్టపడినట్లు అనిపించలేదు.
వైజయంతిగా భూమిక క్యారెక్టర్ పవర్‌ఫుల్ అన్నట్లుగా ఇంట్రాడక్షన్ ఇచ్చారు. సెకండాఫ్‌లో గెస్ట్‌ను చేశారు. రావురమేష్ లాంటి సీనియర్ యాక్టర్‌ను సరిగా వాడుకోలేదు. కానిస్టేబుల్‌గా ప్రవీణ్ క్యారెక్టర్‌లో కొత్తదనం లేదు. అపార్ట్‌మెంట్ సెక్రటరీ కామెడీ నవ్వించలేదు.
Butterfly Movie Review -పేరులో మాత్రమే కొత్తదనం...
బటర్ ఫ్లై పేరులో ఉన్న కొత్తదనం సినిమాలో లేదు. ఎలాంటి సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ లోనే రొటీన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఇది.
రేటింగ్: 2.5/5