Bubblegum OTT Release: యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చిన బబుల్‌గమ్ మూవీ థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా త్వరలోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. జనవరి 15 లేదా 19 నుంచి బబుల్‌గమ్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు. తొందరలోనే బబుల్‌గమ్ ఓటీటీ రిలీజ్ డేట్‌ఫై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
థియేటర్, ఓటీటీ రిలీజ్‌కు కనీసం మూడు వారాల గ్యాప్ కూడా లేకపోవడం ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 29న బబుల్‌గమ్ మూవీ థియేటర్లలో రిలీజైంది. బబుల్‌గమ్ కోస భారీగా ప్రమోషన్స్ చేశారు. సుమతో ఉన్న అనుబంధం కారణంగా చిరంజీవి, వెంకటేష్, నాని, అడివిశేష్‌తో పాటు పలువురు సీనియర్, యంగ్ హీరోలతో పాటు దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగమయ్యారు. కానీ కంటెంట్ లో బలం లేకపోవడంతో వారి ప్రమోషన్స్ బబుల్‌గమ్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. సినిమా డిజాస్టర్‌గా మిగిలింది.
ఆదిత్యకు (రోషన్ కనకాల) డీజే కావాలన్నది కల. కానీ కుటుంబపరిస్థితుల కారణంగా చాలా ఇబ్బందులు పడుతుంటాడు. ఓ పార్టీలో జాన్వీతో (మానస చౌదరి) ఆదిత్యకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. మొదట్లో ఆదిత్యతో ప్రేమను టైమ్‌పాస్‌గా భావించిన జాన్వీఆ తర్వాత అతడి వ్యక్తిత్వం నచ్చి ఇష్టపడుతుంది. జాన్వీ బర్త్‌డే రోజు జరిగిన ఓ సంఘటన వారి మధ్య దూరాన్ని పెంచుతుంది. ఆదిత్యను పార్టీలో బట్టలు విప్పించి దారుణంగా అవమానిస్తుంది జాన్వీ. ఆ తర్వాత ఏం జరిగింది? జాన్వీ చేసిన అవమానానికి ఆదిత్య ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? జాన్వీ తన తప్పును ఎలా తెలుసుకుంది అన్నదే బబుల్‌గమ్ మూవీ కథ.
బబుల్‌గమ్ మూవీకి క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రోషన్ కనకాలకు జోడీగా తెలుగమ్మాయి మానస చౌదరి హీరోయిన్‌గా నటించింది. రోషన్, మానసలకు ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. వీరిద్దరి స్క్రీన్‌ప్రజెన్స్, కెమిస్ట్రీ బాగుందనే పేరొచ్చింది. కథలో కొత్తదనం మిస్సవ్వడం, హీరోహీరోయిన్లు విడిపోవడం, మళ్లీ కలుసుకునే సీన్స్‌లో కన్వీన్సింగ్‌గా లేకపోవడంతో సినిమా పరాజయం పాలైంది. రొమాంటిక్ సీన్స్, లిప్‌లాక్‌లపైనే దర్శకుడు ఎక్కువగా ఫోకస్ పెట్టాడంటూ విమర్శలొచ్చాయి.
దాదాపు నాలుగు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన బబుల్‌గమ్ మూవీ థియేటర్లలో కోటిన్నర లోపే వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. డెబ్యూ మూవీ రోషన్‌కు నిరాశనే మిగిల్చింది. బబుల్‌గమ్ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతూ జొన్నలగడ్డ...రోషన్ కనకాల తండ్రి పాత్రలో నటించాడు.వైవాహర్ష, మిర్చి కిరణ్ ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. ఈ చిన్న సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేసింది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు.