BTS Comeback: బీటీఎస్ బ్యాండ్ మళ్లీ వచ్చేస్తోంది.. కొరియా మిలిటరీ నుంచి ఆ ఏడుగురు రిలీజ్ అయ్యే తేదీలు ఇవే
BTS Comeback: తమ పాప్ మ్యూజిక్ తో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న బీటీఎస్ బ్యాండ్ రానున్న రోజుల్లో మళ్లీ మ్యూజిక్ లవర్స్ ముందుకు రానుంది. ఈ బ్యాండ్ లోని ఏడుగురు సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో తేదీన మిలిటరీ సేవల నుంచి బయటకు రానున్నారు.
BTS Comeback: బీటీఎస్ బ్యాండ్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఈ బ్యాండ్ లోని ఏడుగురు సభ్యులు సౌత్ కొరియా మిలిటరీ నుంచి బయటకు వచ్చే తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడుగురు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి మళ్లీ కలవనున్నారు. ఈ గ్రూపులో పెద్దవాడైన జిన్ మొదట మిలిటరీ నుంచి బయటకు రానుండగా.. ఆ తర్వాత మిగిలిన ఆరుగురు ఒక్కో తేదీలో వస్తారు.
బీటీఎస్ మిలిటరీ రిలీజ్ డేట్లు ఇవే
ప్రస్తుతం బీటీఎస్ గ్రూప్ సౌత్ కొరియాలో తప్పనిసరి అయిన మిలిటరీ సేవలో ఉన్నారు. అక్కడ పూర్తి ఫిట్ గా ఉన్న ఏ పౌరుడైనా కచ్చితంగా కనీసం రెండేళ్లు మిలిటరీలో పని చేయాలన్న నిబంధన ఉంది. బీటీఎస్ గ్రూపుతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఇందులోని ఏడుగురు సభ్యులకు కూడా ఇందులో మినహాయింపు లేదు. దీంతో వాళ్లంతా ప్రస్తుతం మిలిటరీలో ఉండగా.. తాజాగా వాళ్ల రిలీజ్ డేట్లు బయటకు వచ్చాయి.
బీటీఎస్ గ్రూప్ మొత్తం 2025లో మళ్లీ ఏకం కానుంది. దీనికోసం ఇప్పటికే కౌంట్ డౌన్ మొదలైంది. వీళ్లు మళ్లీ బయటకు వచ్చి తమను వాళ్ల మ్యూజిక్ మ్యాజిక్ తో అలరించాలని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నిజానికి గ్రూపులోని ఆరుగురు సభ్యులు మిలిటరీలో ఉండగా.. సుగా మాత్రం భుజం గాయం కారణంగా సామాజిక సేవలో ఉన్నాడు.
బీటీఎస్ జిన్ బయకు వచ్చే తేదీ ఇదే..
బీటీఎస్ గ్రూపులో పెద్దవాడైన జిన్ డిసెంబర్, 2022లో మిలిటరీలోకి వెళ్లాడు. అతడు ఈ ఏడాది జూన్ 10 నుంచి 15 మధ్య బయటకు రానున్నాడు. ఆస్ట్రోనాట్ సాంగ్ తో తన సోలో కెరీర్ మొదలు పెట్టిన జిన్.. మిలిటరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించనున్నాడు.
బీటీఎస్ జే-హోప్..
జే-హోప్ అలియాస్ జంగ్ హొసియోక్ గతేడాది ఏప్రిల్ 18న మిలిటరీలోకి వెళ్లాడు. అతడు ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి 20 మధ్య బయటకు రానున్నాడు.
బీటీఎస్ సుగా..
బీటీఎస్ గ్రూపులో సుగా భుజం గాయం కారణంగా మిలిటరీకి బదులు ప్రభుత్వ రంగంలో సేవలు అందిస్తున్నాడు. అతడు గతేడాది సెప్టెంబర్ 22న ఈ సర్వీసులోకి వెళ్లాడు. సుగా వచ్చే ఏడాది జూన్ 21న బయటకు రానున్నాడు.
బీటీఎస్ ఆర్ఎం..
ఆర్ఎంగా పేరుగాంచిన బీటీఎస్ సభ్యుడు కిమ్ నంజూన్ గతేడాది డిసెంబర్ 11న మిలిటరీలోకి వెళ్లాడు. అతడు జూన్ 10, 2025న బయటకు వస్తాడు. ఆర్ఎం ఈ బీటీఎస్ గ్రూప్ లీడర్.
బీటీఎస్ వి..
కిమ్ తైహ్యుంగ్ అలియాస్ వి.. కూడా ఆర్ఎంతో కలిసి ఒకే రోజు మిలిటరీలోకి వెళ్లాడు. దీంతో అతడు కూడా జూన్ 10, 2025న బయటకు రానున్నాడు.
బీటీఎస్ జిమిన్..
మరో బీటీఎస్ సభ్యుడు జిమిన్ గతేడాది డిసెంబర్ 12న మిలిటరీలోకి వెళ్లాడు. అతడు వచ్చే ఏడాది జూన్ లో బయటకు వస్తాడు. జూన్ 11న వచ్చే అవకాశాలు ఉన్నాయి.
బీటీఎస్ జంగ్‌కూక్..
జంగ్‌కూక్ కూడా జిమిన్ తోపాటే మిలిటరీలోకి వెళ్లాడు. దీంతో అతడు కూడా అదే సమయంలో బయటకు రానున్నాడు.