Brahmastra: రణ్‌బీర్, ఆలియా జంటకు షాక్.. ఉజ్జయిని ఆలయంలోకి వెళ్లకుండా నిలిపివేత-brahmastra actors stopped from entering ujjain temple over ranbir s beef comment ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmastra Actors Stopped From Entering Ujjain Temple Over Ranbir's Beef Comment

Brahmastra: రణ్‌బీర్, ఆలియా జంటకు షాక్.. ఉజ్జయిని ఆలయంలోకి వెళ్లకుండా నిలిపివేత

HT Telugu Desk HT Telugu
Sep 07, 2022 04:56 PM IST

Brahmastra: రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా జంటకు ఉజ్జయిని ఆలయం వద్ద నిరసనలు ఎదురయ్యాయి. ఆలయంలోకి వెళ్లకుండా కొందరు అడ్డుకున్నారు.

బ్రహ్మాస్త్ర మూవీ నటులను ఉజ్జయిని ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్న భజరంగ్‌దళ్ కార్యకర్తలు.. ఫోటోలో బ్రహ్మాస్త్ర పోస్టర్)
బ్రహ్మాస్త్ర మూవీ నటులను ఉజ్జయిని ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్న భజరంగ్‌దళ్ కార్యకర్తలు.. ఫోటోలో బ్రహ్మాస్త్ర పోస్టర్)

Brahmastra team at Ujjain: బ్రహ్మాస్త్ర విడుదల నేపథ్యంలో అలియా భట్, రణబీర్ కపూర్ మంగళవారం ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. అయితే నటీనటులిద్దరినీ మంగళవారం రాత్రి ఆలయంలోకి రాకుండా భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు.

రణ్‌బీర్‌ కపూర్‌కు చెందిన ఓ పాత ఇంటర్వ్యూలో తాను బీఫ్‌ ప్రేమికుడనని చెప్పడంతో ఈ నిరసన వెల్లువెత్తింది. 2011లో తన సినిమా రాక్‌స్టార్‌ను ప్రమోట్ చేస్తున్నప్పుడు రణ్‌బీర్ కపూర్ ‘నా కుటుంబం పెషావర్‌కు చెందినది. కాబట్టి వారితో పాటు పెషావరీ ఫుడ్ వచ్చింది. నేను మటన్, పాయ, బీఫ్ అభిమానిని. అవును, నేను బీఫ్‌కు పెద్ద అభిమానిని..’ అని చెప్పుకొచ్చారు.

రణ్‌బీర్, అలియా దర్శనం కోసం అక్కడికి చేరుకోగానే భజరంగ్ దళ్ కార్యకర్తలు 'జై శ్రీరామ్' నినాదాలు చేశారు. ‘నాన్ వెజ్ ఫుడ్‌లో మటన్, చికెన్, గొడ్డు మాంసం తినడానికి ఇష్టపడతానని రణబీర్ కొద్ది రోజుల క్రితం చెప్పినందున మేం వారిని పవిత్ర మహాకాళేశ్వర్ ఆలయంలో పూజించడానికి అనుమతించం’ అని భజరంగ్ దళ్ నాయకుడు విలేకరులతో అన్నారు. తన 'బ్రహ్మాస్త్ర' చిత్రాన్ని చూడాలనుకునే వారు చూడాలని, ఆసక్తి లేని వారు చూడకూడదని ఆలియా కూడా చెప్పిందని ఆయన పేర్కొన్నారు.

ఘటనను ధృవీకరిస్తూ.. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశామని మహకాల్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. లాఠీచార్జి చేసినప్పటికీ నిరసనకారులు రణబీర్, అలియాలను ఆలయ ప్రాంగణంలోకి అనుమతించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఒక కార్యకర్తపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసు అధికారి తెలిపారు.

ఈ సంఘటన గురించి పోలీసు అధికారి ఓపీ మిశ్రా మాట్లాడుతూ, ‘దేవాలయంలో వీఐపీ కదలిక కారణంగా, మేం భద్రతా చర్యలు తీసుకుంటున్నాం. నిరసనకారులను బారికేడింగ్ వెనుక ఉండమని చెప్పాం. భజరంగ్ దళ్ సభ్యుడు వచ్చి భద్రతను ఉల్లంఘించడం ప్రారంభించాడు..’ అని వివరించారు.

నిరసనల మధ్య దర్శకుడు అయాన్ ముఖర్జీ మాత్రమే దేవుడి దర్శనం చేసుకున్నారని ఆలయ పూజారి ఆశిష్ పూజారి తెలిపారు.

ఉజ్జయినికి బయలుదేరే ముందు అలియా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌‌లో ‘హలో, మేం మరికొంత సమాచారంతో మరోసారి తిరిగి వచ్చాం. మేం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయానికి వెళ్తున్నాం’ అని ఓ క్లిప్‌ షేర్ చేశారు. ‘విడుదల సందర్భంగా నేను చాలా ఎగ్జైట్‌గా ఉన్నాను. మేం వెళ్ళడానికి సమయం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని దర్శకుడు కామెంట్ చేశారు.

ఈ నిరసనతో పాటు, ట్విట్టర్‌లో #BoycottBrahmastra ట్రెండింగ్‌లో ఉంది. సినిమాను చూడవద్దని నెటిజన్లు ప్రజలను కోరారు. బీఫ్ లవర్ స్టేట్‌మెంట్‌తో పాటు, అమీర్ ఖాన్ 'పీకే'లో గ్రహాంతర వాసిగా రణబీర్ కపూర్ గెస్ట్ అప్పియరెన్స్, ఆత్మరక్షణ కోసం రణబీర్ చెంపలపై హిందూ దేవుళ్ల స్టిక్కర్లను అమీర్ ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలియా ఒక ఇంటర్వ్యూలో ‘మీకు నచ్చకపోతే నన్ను చూడకండి’ అని చెప్పడం నెటిజన్లలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, చాలా మంది ట్విట్టర్ ఖాతాదారులు ఆమె రాబోయే చిత్రం 'బ్రహ్మాస్త్ర'ని బహిష్కరిస్తామని చెప్పారు.

ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర పార్ట్ -1: శివ' సెప్టెంబర్ 9, 2022న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

IPL_Entry_Point