బ్రహ్మముడి ఈరోజు అంటే 823వ ఎపిసోడ్ ఆసక్తికరమైన ట్విస్టులతో సాగింది. ఎంతో సంతోషంగా ఉన్న కావ్య జీవితంలో మరో కల్లోలం రావడానికి సిద్ధంగా ఉండగా.. అటు రేవతిని అందరి ముందు ముసుగు తీసిన నిలబెడుతుంది రుద్రాణి. అది చూసి అపర్ణ కోపం కట్టలు తెంచుకుంటుంది. ఈ ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం.
బ్రహ్మముడి సీరియల్ గురువారం (సెప్టెంబర్ 11) ఎపిసోడ్ వంటింట్లో కావ్య, ఇందిరాదేవి సీన్ తో మొదలవుతుంది. కావ్య చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని, ఆ రుద్రాణి కళ్లు పడకుండా ఉంటే చాలని కావ్య అంటుంది.
ఆ తర్వాత హాల్లో కూర్చొని ఫోన్ చూస్తూ కావ్య తనలో తనే నవ్వుకుంటూ ఉండగా అప్పు, ఇందిర వస్తారు. అంతలా నవ్వుతున్నావేంటని అడిగితే.. చిన్న పిల్లల వీడియో గేమ్స్ చూస్తూ నవ్వుతున్నట్లు చెబుతుంది. తనకూ ఓ కొడుకు పుట్టి అమ్మ అని పిలిస్తే వినాలని ఆశగా ఉందని కావ్య అంటుంది.
ఆ మాట వినగానే అప్పు కంటతడి పెడుతుంది. ఆ అదృష్టం నీకు ఆ దేవుడు ఇచ్చాడో లేడో అని తనలో తాను అనుకుంటుంది. ఇంతలో కావ్య ఫోన్ మోగుతుంది. తాను వెళ్లి చూస్తానని అప్పు అంటుంది. డాక్టర్ కాల్ చేయడం చూసి కావ్య ప్రెగ్నెన్సీ క్యారీ చేయొచ్చని చెప్పడానికి చేసిందేమో అని ఆనందంగ కాల్ లిప్ట్ చేస్తుంది.
కానీ డాక్టర్ మాత్రం తన సీనియర్లతో మాట్లాడానని, కావ్యకు అబార్షన్ తప్పదని స్పష్టం చేస్తుంది. దీంతో అప్పు మరింత బాధపడుతుంది. ఈ విషయం తాను అక్కకు చెబుతానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. కావ్య వచ్చి ఫోన్ ఎవరు చేశారని అడిగితే.. ఏదో కంపెనీ కాల్ అని చెబుతుంది.
అటు రేవతికి జగదీశ్ ఫోన్ చేస్తాడు. ఆమె బయటకు వెళ్లి కాసేపు ముసుగు తీసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్లు తమ కొడుకుపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో అతనికి చెబుతుంది. అలాగే నిన్ను కూడా వాళ్లు దగ్గరకు తీసుకుంటారని జగదీశ్ ఆమెతో అంటాడు.
అప్పుడే రుద్రాణి ఆమెను చూస్తుంది. రేవతియే ఇలా ముసుగు వేసుకొని ఇంట్లోకి వచ్చినట్లు గుర్తిస్తుంది. అయితే ఈ విషయం నేరుగా చెబితే రాజ్ కు కోపం వస్తుందని రాహుల్ అంటాడు. అందుకే ఈ విషయం ఆ రాజ్ తోనే చెప్పించే ప్లాన్ చేస్తున్నట్లు రుద్రాణి అంటుంది.
అలా జరగాలంటే రేవతిపై దొంగతనం నింద వేయాలని ప్లాన్ చేస్తుంది. అందరూ హాల్లో ఉండగా కావ్య గదిలోకి రుద్రాణి వెళ్తుంది. అక్కడ కప్ బోర్డులో ఉన్న నెక్లెస్ తీస్తుంది. దీనిని రేవతి బ్యాగులో వేస్తే ఆమె దొరికిపోతుంది అని అనుకుంటుంది. ఇటు తనకు ఆకలిగా ఉందన్న స్వరాజ్ తో పైన తన బ్యాగులో చాక్లెట్ ఉంది.. వెళ్లి తీసుకో అని రేవతి చెప్పడం రుద్రాణి వింటుంది. పైకి వెళ్లి ఆమె బ్యాగులో నెక్లెస్ వేస్తుంది.
అప్పుడే గదిలోకి కనకం, రేవతి, స్వరాజ్ వస్తారు. రుద్రాణి గారు మీ గది అక్కడైతే ఇక్కడేం చేస్తున్నారు అని కనకం నిలదీస్తుంది. దీంతో ఆమె కంగారు పడుతూ రేవతితో మాట్లాడటానికి వచ్చానని కవర్ చేస్తుంది. ఇంతలో స్వరాజ్ కలగజేసుకుంటూ.. ఆమె ఎందుకు వచ్చిందో నాకు తెలుసు.. నా చాక్లెట్లు కొట్టేయడానికి వచ్చింది..
ఇందాక ఆ బ్యాగులో చాక్లెట్లు ఉండటం ఆమె చూసింది.. అసలు బ్యాగులో అవి ఉన్నాయో లేదో చూస్తానంటూ వెళ్తాడు. ఇప్పుడు బ్యాగు తెరిస్తే నెక్లెస్ బయటపడుతుందని కంగారు పడుతూ మీ పిల్లాడికి బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండాలో చెప్పరా అంటూ రేవతిపై రుద్రాణి మండిపడుతుంది. దీంతో స్వరాజ్ తో ఆమె సారీ చెప్పిస్తుంది.
ఇటు కింద హాల్లో భోజనాల కోసం అందరూ రెడీగా ఉంటారు. పండగ రోజు ఎక్కువ ఆకలి అవుతుందంటూ ప్రకాశం అంటే.. ఏం పని లేకపోతే అలాగే అవుతుందని ధాన్యం దెప్పిపొడుస్తుంది. తామేమీ పని చేయలేదా అంటూ ప్రకాశం, సుభాష్ అంటారు. ధాన్యానికి అపర్ణ మద్దతుగా వస్తుంది. ఇద్దరి మధ్యా క్రెడిట్ వార్ జరుగుతుండగా కావ్య వచ్చి భోజనాలు రెడీ అని చెబుతుంది.
ఇంతలో కావ్య మెడలో నెక్లెస్ లేకపోవడంతో ధాన్యం అడుగుతుంది. రుద్రాణి ఇదే అదునుగా నెక్లెస్ ఏమైంది.. మీ అత్తయ్య ఇచ్చింది నచ్చలేదా అంటూ మళ్లీ గొడవ పెట్టడానికి సిద్ధమవుతుండగా.. కావ్య ఆమెను ఆపి నెక్లెస్ కోసం వెళ్తుంది.
దుగ్గిరాల ఇంట్లో రుద్రాణి సంబరాలు ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేస్తుంది. ఓ సీసాలో చిట్టీలు వేసి ఎవరు ఏం చేయాలో అందులో రాసి ఉందంటుంది. వరుసగా ఒక్కొక్కరు తమకు వచ్చినవి చేస్తూ వెళ్తారు. చివరిగా రేవతికి డ్యాన్స్ చేయాలని రావడంతో రుద్రాణి ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తూ కావాలని ముసుగు తొలగిపోయేలా చేస్తుంది. ఆమె రేవతి అని తేలడంతో అపర్ణ కోపం కట్టలు తెంచుకుంటుంది. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం