బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 846వ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగిపోయింది. దుగ్గిరాల కుటుంబంలో చీలిక వచ్చే పరిస్థితి కనిపించింది. ఇంటిపెద్ద సీతారామయ్య రాజ్ చెంప పగలగొట్టడం, ధాన్యలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్లిపోతాననడం, విడాకుల కోసం కావ్య పట్టుబట్టడంలాంటి సీన్లతో ఎపిసోడ్ సాగిపోయింది.
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (అక్టోబర్ 8) ఎపిసోడ్ అప్పును చూపిస్తూ ధాన్యలక్ష్మిని రుద్రాణి రెచ్చగొట్టే సీన్ తో మొదలవుతుంది. అప్పు ఇలా బాధపడుతూ కూర్చుంటే అబార్షన్ కావ్యకు కాదు నీ కోడలికి అవుతుందని చెప్పి వెళ్లిపోతుంది.
దీంతో ధాన్యంలో ఆందోళన మొదలవుతుంది. అప్పుడే కిందికి వస్తున్న కల్యాణ్ దగ్గరికి వెళ్లి అప్పును బయటకు తీసుకెళ్లమని, ఆమెను సంతోషంగా ఉండేలా చూడమని ధాన్యలక్ష్మి చెబుతుంది. అతడు సరే అంటూ అప్పు దగ్గరికి వెళ్లి ఆమెను ఒప్పించి బయటకు తీసుకెళ్తాడు.
అటు బయట కావ్య కొత్త నాటకం మొదలుపెడుతుంది. రాజ్ అక్కడే ఉండటం చూసి కావాలనే తన లాయర్ ఫ్రెండ్ ఝాన్సీకి ఫోన్ చేసినట్లు నాటకమాడుతుంది. తనకు విడాకులు కావాలని, తన భర్త బిడ్డ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నాడో చెబుతుంది. విడాకులు తీసుకుంటే కనీసం తన బిడ్డ అయినా క్షేమంగా ఉంటుందని అంటుంది. ఆ మాటలు వింటున్న రాజ్ లోలోపల బాధపడతాడు తప్ప అసలు ఏమీ అనడు.
అయితే కావ్య మాటలు విన్న అప్పు మరింత బాధపడుతుంది. అక్క అలా బాధపడుతుంటే మనం ఎలా బయటకు వెళ్లి సంతోషంగా ఉంటాం.. నేను రాను అంటూ లోనికి వెళ్లిపోతుంది. బయటకు వెళ్లి మళ్లీ ఎందుకొచ్చావని ధాన్యం అడిగినా చెప్పలేనంటూ అప్పు వెళ్లిపోతుంది.
అప్పుడే రుద్రాణి వచ్చి ధాన్యాన్ని మరింత రెచ్చగొడుతుంది. కావ్య వల్లే ఇదంతా జరుగుతోందని, ఆమె విడాకులంటూ ఫోన్ లో మాట్లాడటం అప్పు విన్నదని, అందుకే తిరిగి వచ్చేసిందని చెబుతుంది. ఇలాగే కొనసాగితే కష్టమే అంటూ ధాన్యం మనసులో విషం నింపుతుంది.
ఇటు కావ్య మరోసారి ఇంట్లో వాళ్లందరి ముందే తనకు విడాకులు కావాలంటూ రాజ్ ను నిలదీస్తుంది. అయినా రాజ్ వెనక్కి తగ్గడు. ఎక్కడ కావాలంటే అక్కడ సంతకాలు పెడతానని అంటాడు. సుభాష్, అపర్ణ, ప్రకాశం, ఇందిరాదేవి.. ఇలా అందరూ మందలించినా రాజ్ మొండిగా తాను విడాకులకు సిద్ధమే అంటాడు. ఇద్దరూ మాటామాటా అనుకుంటారు.
ఇదంతా చూస్తున్న అప్పు మరింత ఒత్తిడికి గురవుతుంది. కళ్లు తిరిగి పడిపోతుంది. అందరూ ఆమె దగ్గరికి వెళ్తారు. కావ్య ఆమెను పట్టుకోవడానికి వెళ్లగా ధాన్యం అడ్డుకొని ఇదంతా నీ వల్లే అని ఆమెను తిడుతుంది. మీ గొడవల వల్లే అప్పుకి ఇలా జరిగిందని కావ్యను నిందిస్తుంది. చేసిందంతా చేసి ఇప్పుడేమీ జరగనట్లు మాట్లాడకు అని నానా మాటలు అంటుంది. వెంటనే డాక్టర్ కు ఫోన్ చేయాలని కల్యాణ్ కు చెబుతుంది. దీంతో కావ్య, రాజ్ మరింత బాధపడతారు.
అప్పుని చూసిన డాక్టర్ కల్యాణ్, ధాన్యలక్ష్మిలకు వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు ప్రమాదం లేకపోయినా ఇలాగే కొనసాగితే కష్టం అని అంటుంది. ఆమె మానసికంగా చాలా ఒత్తిడి అనుభవింస్తోందని, ఇలాగే ఉంటే హార్ట్ ఎటాక్ కూడా వస్తుందని అనడంతో కల్యాణ్, ధాన్యం షాక్ తింటారు.
ఈ సమయంలో ఆమె ఇలా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా యాక్టివ్ గా ఉండదని డాక్టర్ స్పష్టం చేస్తుంది. సమయానికి తినేలా చూసుకోవాలనీ చెబుతుంది. డాక్టర్ వెళ్లిపోయిన తర్వాత అప్పు దగ్గరికి వెళ్లిన కల్యాణ్ ఆమె తలపై నిమురుతూ ఇదంతా తన వల్లే జరిగిందని లోలోపల అనుకుంటాడు.
అటు కల్యాణ్ ను బయటకు పిలిచిన రాజ్ క్షమాపణ అడుగుతాడు. అప్పుకు ఈ పరిస్థితి రావడానికి తానే కారణమని అంటాడు. కల్యాణ్ మాత్రం రాజ్ కు అడ్డుపడతాడు. ఓ భార్యగా వదిన విషయంలో నువ్వెలా బాధపడుతున్నావో అక్క కోసం అప్పు అలాగే బాధపడుతోందని అంటాడు. అదే సమయంలో డాక్టర్ రాజ్ కు ఫోన్ చేస్తుంది. కావ్యకు అసలు విషయం మీరు చెప్పరు.. నన్ను చెప్పనీయరు ఎందుకు అని నిలదీస్తుంది.
ఇంట్లో ధాన్యలక్ష్మి మరోసారి రచ్చ చేస్తుంది. కావ్య, రాజ్ లను నిలదీస్తూ మీ నిర్ణయాలేంటో ఇప్పటికిప్పుడు చెప్పకపోతే మా నిర్ణయం తీసుకుంటామని అంటుంది. ఏంటని అడిగితే ఇంట్లో నుంచి వెళ్లిపోతామంటుంది. అదే మీ నిర్ణయమైతే సరే అని రాజ్ అనడంతో సీతారామయ్య అని చెంప చెళ్లుమనిపిస్తాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం