స్వప్నను కిడ్నాప్ చేస్తుంది యామిని. బావే నా సర్వస్వం అనుకున్న నా కలను సర్వనాశనం చేసిన మిమ్మల్ని వదిలిపెడతానని ఎలా అనుకున్నావని కావ్యకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుంది యామిని. నన్ను అంత సింపుల్‌గా తీసుకోకూడదు అని తెలియదా అని కావ్యతో అంటుంది.
స్వప్న ఇంట్లో కనిపించడం లేదనే డౌట్ మీకు ఇంకా రాలేదా అని కావ్యతో అంటుంది. స్వప్న హాస్పిటల్‌కు వెళ్లలేదని తానే కిడ్నాప్ చేశానని చెబుతుంది. మా అక్కకు ఏమన్నా జరిగిందో అని యామినికి వార్నింగ్ ఇవ్వబోతుంది కావ్య. నీ పాత చింతకాయ రొటీన్ డైలాగ్స్ ఆపేసి ముందు నీ అక్కను కాపాడుకో అని ఫోన్ కట్ చేస్తుంది యామిని.
స్వప్న ఎక్కడికి వెళ్లిందని రాహుల్‌ను అడుగుతుంది కావ్య. పాపకు పోలియో డ్రాప్స్ వేయించడానికి హాస్పిటల్‌కు వెళ్లిందని క్యాజువల్‌గా సమాధానమిస్తాడు రాహుల్. ఏదో బెడ్ రూమ్‌లోకి వెళ్లింది అన్నంత సింపుల్‌గా చెబుతున్నావు...భార్య బయటకు వెళ్లినప్పుడు తోడుగా వెళ్లాలనే కామెన్స్‌సెన్స్ లేదా అని రాహుల్‌కు క్లాస్ ఇస్తుంది యామిని. నా కొడుకు ఏం తప్పు చేశాడని అతడిని తిడుతున్నావని రుద్రాణి ఫైర్ అవుతుంది. అసలు తప్పంతా మీది...ముందు మిమ్మల్ని అనాలి అని రుద్రాణిపై విరుచుకుపడుతుంది కావ్య.
అర్జెంట్‌గా స్వప్నను కలవాలని కావ్య బయటకు వెళ్లబోతుంది. అప్పుడే రాజ్ ఆమెకు ఎదురుగా వస్తాడు. స్పెషల్‌గా మీ కోసమే వచ్చానని కావ్యతో అంటాడు రాజ్. మీకో ముఖ్యమైన విషయం చెప్పాలని అంటాడు. కావ్యకు ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు. మీతో మాట్లాడేంత టైమ్ లేదని, తాను అర్జెంట్‌గా వెళ్లాలని రాజ్ ఆపిన వినకుండా కావ్య బయటకు వెళుతుంది.
కావ్యకు రాజ్ ప్రపోజ్ చేయకుండా యామిని వేసిన స్కెచ్ ఇదని రుద్రాణి లోలోన సంబరపడుతుంది.
స్వప్నను రాంగ్ రూట్‌లోకి తీసుకెళతాడు డ్రైవర్. స్వప్న ఫోన్‌ను కనిపించకుండా దాచేస్తాడు. స్వప్న అరవబోతే బెదిరిస్తాడు. అరిస్తే చంపేస్తానని అంటాడు.
స్వప్న కోసం హాస్పిటల్‌కు వెళుతుంది కావ్య. అక్కడికి స్వప్న రాలేదని తెలియగానే కంగారు పడుతుంది. ఫోన్ చేస్తే స్విఛాఫ్ అని వస్తుంది. కారుకు ఉన్న జీపీఎస్ ట్రాకర్ ద్వారా స్వప్న లొకేషన్‌ను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది కావ్య.
అప్పుడే కావ్యకు యామిని ఫోన్ చేస్తుంది. ఏంటి హాస్పిటల్‌కు వెళ్లావా...మీ అక్క రాలేదని అన్నారా అని కావ్యను రెచ్చగొడుతుంది యామిని. మీ అక్క ఆచూకీ కనిపెట్టాలంటే ఈ తెలివితేటలు సరిపోవని సెటైర్లు వేస్తుంది. ఐదు నిమిషాల్లో మా అక్క ఎక్కడుందో కనిపెట్టి నీకు హాయ్ చెప్పిస్తానని యామినికి ధీటుగా బదులిస్తుంది కావ్య.
కావ్య బయటకు వెళ్లి చాలా సమయమైన ఇంటికి రాకపోవడంతో రాజ్ అలుగుతాడు. నేనంటే ఇంట్లో ఎవరికి ప్రేమలేదని, నన్ను హర్ట్ చేశారని చిందులు తొక్కుతాడు. కావ్య కోసం యామినితో పెళ్లిని పీటలపై ఆపేశానని, కావ్య మాత్రం నేను రాగానే అర్జెంట్‌గా వర్క్ ఉందని వెళ్లిపోయిందని బాధపడతాడు. కావ్యను కలవడానికి వెళతానంటే యామినినే స్వయంగా తనను పంపించిందని రాజ్ అంటాడు.
యామిని అలా ఎలా ఒప్పుకుంటుందని అపర్ణ, ఇందిరాదేవి డౌట్ పడతారు. తాళి కట్టకపోయినా కావ్య తనలో సగభాగమని, తన ప్రాణమని చెప్పమని చెప్పగానే యామిని కన్వీన్స్ అయిపోయిందని కావ్యకు ప్రపోజ్ చేయమని పంపించిందని రాజ్ అంటాడు. రాజ్ కోపాన్ని పోగొట్టి అతడు భోజనం చేసేలా చేస్తారు అపర్ణ, ఇందిరాదేవి.
చాలా ఆలస్యంగా ఇంటికొచ్చిన కావ్యపై అపర్ణ ఫైర్ అవుతుంది. పెద్దవాళ్లంటే నీకు కొంచెం కూడా గౌరవం లేదా అని చిందులు తొక్కుతుంది. తనను ఎవరో కిడ్నాప్ చేశారని, ఆ కిడ్నాపర్ల బారి నుంచి కావ్యనే కాపాడిందని అసలు నిజం బయటపెడుతుంది స్వప్న. తన అక్కను కిడ్నాప్ చేసిన యామిని చెంపపై గట్టిగా ఒక్కటి పీకుతుంది అప్పు. యామినిని అప్పు కొట్టడం రాజ్ చూస్తాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.