Brahmamudi August 26th Episode: బ్రహ్మముడి- కొడుకును వెళ్లిపోమన్న ప్రకాశం- బయటపడిన ధాన్యలక్ష్మీ కుట్ర-మందలించిన తాతయ్య
Brahmamudi Serial August 26th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 26వ తేది ఎపిసోడ్‌లో ఇక కల్యాణ్, అప్పు వెళ్లిపోతామని చెబుతారు. రాజ్ ఇంట్లో వాళ్లు వద్దని అడ్డుకుంటారు. ఇంతలో ధాన్యలక్ష్మీ ప్లాన్ బయటపడుతుంది. దాంతో కొడుకుని వెళ్లిపోమ్మని తండ్రి ప్రకాశం చెబుతాడు. దాంతో కల్యాణ్, అప్పు వెళ్లిపోతారు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో వరలక్ష్మీ వ్రతంలో అమ్మవారికి దుగ్గిరాల కోడళ్లు కావ్య, స్వప్న, అప్పు కలిసి హారతి ఇస్తారు. తర్వాత అందరికి పంతులు హారతి ఇస్తాడు. భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మని చెబుతాడు పంతులు. కావ్య, స్వప్న, అప్పు తమ భర్తల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. వారిపై రాజ్, రాహుల్, కల్యాణ్ అక్షింతలు వేసి ఆశీర్వాదిస్తారు.
తర్వాత అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు. కావ్య, అప్పు వాళ్లు వడ్డిస్తారు. ఇంతలో ఏంటమ్మా ఇది. శుభానికి పిలిచారా అశుభానికి పిలిచారా అని ఓ ముత్తదైవు అంటుంది. నీకు అసలు బుద్ధుందా. వ్రతానికి పిలిచి అన్నం పెడుతున్నావా.. పిండకూడు పెడుతున్నావా. విస్తట్లో ముందు పప్పు, పచ్చడో పెట్టకుండా ముందు అన్నం పెట్టావేంటీ. ఇంటికి వచ్చినవాళ్లను ఇలాగేనా అవమానించేది. మీ అమ్మ నిన్ను ఇలాగేనా పెంచింది అని ధాన్యలక్ష్మీ నానా మాటలు అంటుంది.
పిండాలు, కూడు ఏంటీ
ఎందుకు అలా అరుస్తున్నావ్ ధాన్యలక్ష్మీ అని అపర్ణ అంటుంది. మన అతిథులను ఇలా అవమానించడం తప్పు కాదా వదినా అని రుద్రాణి అంటుంది. ఏదో చిన్నపిల్లా. ఇలాంటివి తెలియదు. పొరపాటున వడ్డించింది. దానికే ఇంట్లో వాళ్లమీద దుమ్మెత్తిపోయాలా. శుభమా అని వ్రతం జరుగుతుంటే పిండాలు, కూడు అని అంటావేంటీ అని ఇందిరాదేవి అంటుంది. నేను అన్నదే కనిపిస్తుంది కానీ, తను చేసింది కనిపించట్లేదా. ఇలా వడ్డిస్తే ఎంత అరిష్టం అని ధాన్యలక్ష్మీ అంటుంది.
ఇలా వడ్డిస్తే లేచి వెళ్లిపోతామని కూడా ఈ పిల్లకు తెలియదా అని ముత్తదైవు అంటుంది. మీరు మా అత్త రిక్రూట్ చేసినవాళ్లలా మాట్లాడుతున్నారేంటీ అని స్వప్న అంటుంది. అప్పుకు చిన్నప్పటి నుంచి తన చదువు ఆటలు తప్పా ఇలాంటివి చేసింది లేదు. అందరికి ఆకలి వేస్తుంది కదా. హడావిడిగా వడ్డించింది. అంతేకానీ కావాలని చేయలేదు. మీరే పెద్దమనసు చేసుకుని అర్థం చేసుకోండి అని కావ్య చెబుతుంది. వేరే విస్తరాకులో ముత్తైదువుకు అన్నం వడ్డిస్తుంది కావ్య.
కర్రీ వడ్డించమని అప్పుకు అపర్ణ చెబుతుంది. దారిలో ఉన్న ధాన్యలక్ష్మీని స్వప్న తాకుతూ వెళ్తుంది. సారీ ఆంటీ.. అయినా ఎందుకు దారిలో నిల్చున్నారు. పక్కకు వెళ్లి నిల్చోవచ్చు కదా అని స్వప్న అంటుంది. తర్వాత చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు. మన్నించి మా ఇంటి కోడళ్లను ఆశీర్వదించి వెళ్లండి అని అపర్ణ అంటుంది అంతా భోజనం చేస్తారు. ముత్తదైవులకు బొట్టు పెట్టే వాయినాలు ఇవ్వాలి. బొమ్మలు అమ్ముకునే వాళ్ల ఇంట్లో వాయినాలు ఇచ్చే పద్ధతి ఉంటే కదా అని మళ్లీ అవమానిస్తుంది ధాన్యలక్ష్మీ.
ఇంటి కోడలిగా పనికిరాదు
వాళ్లకు అది తెలుసు. కాసేపు సైలెంట్‌గా ఉండు అని అపర్ణ అంటుంది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు బొట్టు పెట్టి వాయినాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత అందులో ఒకామే వెళ్లొస్తా ధాన్యలక్ష్మీ. నేను మాత్రం ఉన్నది ఉన్నట్లు మాట్లడతాను. ఈ పిల్ల మాత్రం దుగ్గిరాల ఇంటికి కొడలిగా పనికిరాదు అని చెబుతుంది. తర్వాత ముత్తైదువులు వెళ్లిపోతారు. అనంతరం మేము బయలుదేరుతాం అని కల్యాణ్ అంటాడు. ఎందుకురా అని రాజ్ అంటాడు.
మా ప్రపంచంలోకి మేము వెళ్లిపోతున్నాం. ఈ స్వప్న సౌధం అద్దాల మేడల ఉంది. ఎవరు రాయి వేసిన పగిలిపోయేలా ఉంది. తాతయ్య వాళ్ల గౌరవాన్నికాపాడేందుకు వచ్చాం. ఇక్కడే ఉండిపోదామని కాదు. అందుకే మీరు తొడిగిన ఆస్తిని పక్కన పెట్టి వెళ్లిపోతున్నాం అని కల్యాణ్ అంటాడు. ఎక్కడో ఉండి కష్టపడటం ఎందుకురా అని రాజ్ అంటాడు. కష్టమంటే ఏంటీ అన్నయ్య డబ్బు లేకపోవడమా. కాదు సంస్కారం లేని ఇంటికి రావడం, ఇష్టం లేని చోట ఉండటం అని కల్యాణ్ అంటాడు.
ఇక్కడ అడుగడుగునా కష్టపడుతూనే ఉన్నాం అని కల్యాణ్ అంటే పిన్ని అత్త గురించి తెలిసిందే కదరా అని రాజ్ అంటాడు. అందుకే అన్నయ్య రానన్నది. ఇలా జరుగుతుందనే ఇన్నాళ్లు నువ్ పిలిచినా రాలేదు అని కల్యాణ్ అంటాడు. నీకు ఏం తక్కువ చేశానురా అని ధాన్యం అంటే.. అది నువ్ అంటున్నావా. వాళ్లను తక్కువ చేశాను. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అవమానించావ్. నీ ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం వచ్చారా. నచ్చజెబితే, బతిమిలాడుకుంటే వచ్చారు అని ఇందిరాదేవి అంటుంది.
వాళ్లకు ఎంతిచ్చారు
కానీ, నువ్ ఆ మందిరతో చేరి వాళ్ల మనసు కష్టపెట్టావ్ అని ఇందిరాదేవి అంటుంది. వాళ్లు చేసిందే అన్నాను. అయినా వాళ్లు కూడా అన్నారు. ఈ ఇంటికి తను తగదు అని ధాన్యలక్ష్మీ అంటుంది. అసలు వాళ్లను ఎవరు పిలిచారు. అమ్మమ్మ.. అపర్ణ అంటీ అని స్వప్న అడిగితే.. వాళ్లు లేదని అంటారు. అంటే మీరే పిలిచారు. అప్పును అవమానించడానికి వాళ్లకు ఎంత ఇచ్చారు. పూజ పేరుతో అవమానించాలని చూశారంటే మీరెంత ప్లాన్‌డ్‌గా ఉన్నారో అర్థమైంది అని స్వప్న అంటుంది.
నాకు ముందే అర్థమైంది స్వప్న అని కల్యాణ్ అంటాడు. వాళ్లు అలా అంటుంటే మొద్దులా ఉన్నావేంటే. ఎవరైనా ఏమైనా అంటే తల పగలగొట్టేదానివి కదా అని స్వప్న అడుగుతుంది. ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో నేను ముందే ఊహించాను. వదినల తలదించుకోవడం, నీలా మాటలతో అని సరిపెట్టుకోవడం చేయదు అప్పు. అందుకే నాకు మాట ఇచ్చింది. ఇక్కడ ఏం జరిగినా తాను ఏం చేయనని మాట ఇచ్చింది. దానికే ఇప్పటిదాకా కట్టుబడి ఉంది. పూటకే ఇలా ఉంటే ఈ ఇంట్లో ఉంటే అప్పును బతకనిస్తారా అని కల్యాణ్ అంటాడు.
అంటే ఏంట్రా నీ భార్య తల పగులగొట్టేదా అని రుద్రాణి అంటుంది. ఎవరిదేమో గానీ ముందు నీ తల రెండు ముక్కలయ్యేది అని స్వప్న అంటుంది. ఏం ధాన్యం కడుపులో ఇంత కుళ్లు పెట్టుకుని వ్రతానికి ఒప్పుకున్నావా. వాళ్లు ఇంట్లోకి ఇంకోసారి రాకుండా ఉండేందుకే ఇంత కథ నడిపావా. నువ్ అసలు కన్నతల్లివేనా అని అపర్ణ అంటుంది. నువ్ ఇంత మాట్లాడుతున్నావ్ కానీ, ఒకప్పుడు కావ్యను రాజ్ పెళ్లి చేసుకుని వస్తా దూరం పెట్టావ్ కదా అని ధాన్యలక్ష్మీ అంటుంది.
తలెత్తుకోలేని పరిస్థితి
నేను దూరం పెట్టాను. ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేయలేదు. ఇంట్లో ఉండనిచ్చాను. అయినా సరే నేను తప్పులు చేశాను. చేయలేదని అనట్లేదు. చేసిన తప్పులు సరిదిద్దుకుంటున్నాను. తప్పులు చేసినట్లు తెలిసినప్పుడు నరకంగా ఉంటుందో నీకు తెలియదు. పిల్లల ముందు కూడా తలెత్తుకోలేని పరిస్థితి తెచ్చుకున్నాను. ఇప్పుడు నువ్ అదే చేస్తున్నావ్ అని అపర్ణ అంటే.. శాపం పెడుతున్నావా అక్క అని ధాన్యం అంటుంది.
నేనా. ఎదురుగా అమ్మవారు ఉంది. అమ్మవారి సమక్షంలోనే నువ్వు పాపాలు చేశావ్. నీకు తోడు ఈ శిఖండి చేరింది. మీ పాపాలకు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. కొత్త కోడలు నట్టింటికి వస్తే అవమానించినందుకు ఆ పాపమే తగులుతుంది అని అపర్ణ అంటుంది. మా వయసుకు గౌరవం ఇచ్చి వచ్చారు. పంతానికి పోకుండా వచ్చారు. నీకెందుకు అమ్మా అంత పంత. నీ కన్నకొడుకే కదా. వాడి మనసు ఇరిగేలా చేశావ్. నిన్ను మందలిస్తే నా ఇంటి కోడలిని నలుగురిలో నేను అవమానించినట్లు అవుతుందని ఊరుకున్నాను అని సీతారామయ్య అంటాడు.
కానీ, నువ్ మాత్రం అందరిముందు ఆ అమ్మాయిని అవమానిస్తూనే ఉన్నావ్ అని సీతారామయ్య మందలిస్తాడు. ఎందుకు వాడి మీద కక్ష. ఇదివరకు వాడి జీవితాన్ని బజారుకు తీసుకొచ్చావ్. ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టావ్. ఇక్కడ వాళ్లు ఉండాలి అని ఇందిరాదేవి అంటుంది. ఎందుకమ్మా. ఎందుకు వాళ్లిద్దరు ఇక్కడ ఉండాలి. అంటే ఈ అవమానాలు ఇంతటితో ఆగిపోకూడద. నా కోడలు రోజు అవమానం పడాల. వాళ్ల తల్లిదండ్రులు, అక్కలు మాటలు పడాల్సిందేనా అని ప్రకాశం అంటాడు.
పస్తులున్నా సంతోషంగానే
అక్కర్లేదు అమ్మ. తన భార్యను పోషించుకోలేనంత అసమర్థుడు కాదు నా కల్యాణ్. వీళ్లు ఇన్ని మాటలు అంటున్నా ఒక్క మాట అనట్లేదు అంటే భర్తగా తను ఎంత గౌరవం ఇస్తుందో తెలుస్తోంది. భార్యకు జరిగే అవమానానికి ఎంత బాధపడుతున్నాడో తెలుస్తోంది. ఎందుకమ్మ ఈ ఆస్తులు. ఒకరిమీద ఒకరికి గౌరవం ఉంటే ఎక్కడున్నా, పస్తులున్నా సంతోషంగానే ఉంటారు. నువ్ వెళ్లు నాన్న. వీళ్ల గురించి నువ్ వదిలిసేయ్. వెళ్లి ప్రశాంతంగా బతకండి మీరు అని ప్రకాశం అంటాడు.
వెళ్లు. మీ ఇద్దరు మళ్లీ తలెత్తుకుని ఈ ఇంటికి వచ్చే రోజు వస్తుంది. ఆరోజు నిన్ను అన్నవాళ్లు తలదించుకుంటారు వెళ్లు అని కావ్య అంటుంది. వెళ్లొస్తాం తాతయ్య అని కల్యాణ్ చెప్పి అప్పును తీసుకెళ్లిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో కావ్య వెళ్తానంటే ఇక్కడే ఉండు, నాతో ఉండు అని రాజ్ అంటాడు. అయినా కావ్య వెళ్లిపోతుంటే చీర కొంగుపట్టుకుని లాగి వెనకనుంచి గట్టిగా హగ్ చేసుకుంటాడు రాజ్. మళ్లీ వెళ్లిపోతున్నా కావ్యను లాక్కుంటాడు రాజ్. ఇదంతా రొమాంటిక్‌గా సాగుతుంది.