Brahmamudi August 19th Episode: బ్రహ్మముడి- రాహుల్‌కు కంపెనీ బాధ్యతలు- మొదటి జీతం అందుకున్న కల్యాణ్- అప్పుతో వ్రతం
Brahmamudi Serial August 19th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 19వ తేది ఎపిసోడ్‌లో రాజ్‌ను కంపెనీ బాధ్యతల నుంచి తప్పించి వాటిని రాహుల్‌కు కట్టబెడతాడు సీతారామయ్య. స్వప్న కోసమే ఇలా చేస్తున్నట్లు సీతారామయ్య చెబుతాడు. మరోవైపు కల్యాణ్ తన మొదటి జీతం అందుకుంటాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో సీతారామయ్య నిర్ణయానికి కావ్య అడ్డు చెబుతుంది. కేవలం చిన్నత్తయ్య అహం తగ్గించడానికే తాతయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుసా. పైగా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అని కావ్య అంటుంది.
నా కొడుకు ఉన్నాడు కదా
కావ్య చెప్పింది కూడా నిజమే కదా బావ. అప్పటివరకు కంపెనీ ఎవరు చూసుకుంటారు అని ఇందిరాదేవి అంటుంది. నా కొడుకులు ఉన్నారుగా. ఇంతకుముందు వాళ్లే కదా చూసుకుంటున్నారు అని సీతారామయ్య అంటాడు. కానీ, ఇప్పుడు కావాల్సింది నేటితరం, యువకులు కదా నాన్నా. ఈతరం మోడల్స్ మేము చేయలేం. ఎవరినైనా అపాయింట్ చేసుకుందామా అని సుభాష్ అంటాడు. నా కొడుకు ఉన్నాడు కదా అని రుద్రాణి అంటుంది.
దాంతో అంతా షాక్ అయి అలాగే చూస్తుంటారు. ఏంటీ అలా చూస్తున్నారు. నా కొడుకు బిజినెస్ మ్యానెజ్‌మెంట్ చేశాడు. ఆఫీస్ విషయాలు కూడా చూసుకున్నాడు. దీనికంటే బయటవాళ్లు ఎందుకు అని రుద్రాణి అంటుంది. అది అసలు విషయం. చిన్నత్తయ్యకు కీ ఇచ్చి పెద్దింటి తాళాలు తెరవాలని అనుకుంది. నీ కొడుకుకు ఆఫీస్ విషయాలకంటే వేరే వాటి మీదే ద్యాస ఎక్కువ. రాహుల్‌కు అప్పజెపితే ఎవరు లేనిదానికంటే ఎక్కువ పతనం అవుతుందని కావ్య అంటుంది.
అంతా అణగదొక్కుతున్నారు
ఇది నీ అసలు స్వరూపం. నీ భర్తకు మాత్రమే అధికారం ఉండాలనేది నీ కోరిక. రాహుల్‌కు ఇస్తే మీకు పవర్ పోతుంది కదా. ధాన్యలక్ష్మీ ఊరికే అందా. మీరిద్దరు కలిసి రాజ్యాన్ని ఏలుదామని అన్నారు అని రుద్రాణి అంటుంది. రుద్రాణి ఇంకోసారి నా కొడుకు కోడలిని అంటే నీకు నిలవనీడ లేకుండా చేస్తాను అని అపర్ణ వార్నింగ్ ఇస్తుంది. నాన్న నా కొడుకు కూడా సమర్ధుడే. అందరూ కలిసి అణగదొక్కుతున్నారు. తల్లిగా భరించలేకపోతున్నాను. రాహుల్‌ను నియమించండి నాన్న అని రుద్రాణి వేడుకుంటుంది.
సరే చూద్దాం. నీ కొడుకు సామర్థ్యం ఏంటో బయటపడుతుంది కదా. అన్ని మానేసి బుద్ధిగా బాధ్యతగా పనిచేసుకుంటే వాడు బాగుపడతాడు. స్వప్నకు మనశ్శాంతిగా ఉంటుంది. కానీ, ఇది నేను నీకోసం ఒప్పుకోవట్లేదు. స్వప్న భవిష్యత్ కోసం ఒప్పుకుంటున్నాను అని సీతారామయ్య అంటాడు. ఇది చాలు. వాన్ని వాడు నిరూపించుకుంటాడు అని రుద్రాణి అంటుంది. నీ కడుపు చల్లబడిందా. నీ కొడుకు కోసం కన్నకొడుకులా చూసుకున్న రాజ్‌ను తప్పిస్తావా. నీ కొడుకు ఇకనుంచి నిన్ను ఎలా చూస్తాడో అది కూడా చూస్తాను అని ఇందిరాదేవి అంటుంది.
కథలు ఎందుకు రాయకూడదు
మరోవైపు ఓ పబ్లికేషన్ ఆఫీస్‌కు వెళ్లి వాళ్ల వద్ద తన బుక్ పబ్లిష్ అయిందని చెబుతాడు. వారి దగ్గర రచయితగా ఉద్యోగం ఉందా అని అడుగుతాడు. లేదు సార్. మేము కవితలు పబ్లిష్ చేయట్లేదు. కథలు, సెలబ్రిటీల ఆటో బయోగ్రఫీలే చదువుతున్నారు. ఒక బిజినెస్ మ్యాన్‌గా పాఠకులు ఏది చదువుతున్నారో ప్రింట్ చేయడం ముఖ్యం. మీ రచనా శైలీ బాగుంది. వాడే తెలుగు పదాలు చాలా బాగున్నాయి. మీరెందుకు కథలు రాయకూడదు అని పబ్లిషర్ అంటాడు.
సరే ట్రై చేస్తాను అని కల్యాణ్ అంటాడు. మాదాంట్లో కవితలు అయినా కథలు రాసేవారికి అయినా ముందుగానే పేమెంట్ చెల్లిస్తాం. అది మా కంపెనీ పాలసీ. ఇదివరకు మీరు రాసిన బుక్‌కు ఆరు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంది అని చెప్పి కల్యాణ్‌కు రూ. 6 వేలు ఇస్తాడు పబ్లిషర్. అది తీసుకున్న కల్యాణ్ ఎమోషనల్ అవుతాడు. ఎలాంటి సమయంలో మీరు నాకు సాయం చేస్తున్నారో మీకు తెలియదు. ఇది ఇప్పుడు నాకు చాలా అవసరం సార్. థ్యాంక్యూ అని కల్యాణ్ అంటాడు.
బంధాలకు లొంగిపోయాను
మీలాంటివాళ్లు యంగ్‌స్టర్స్ మాకు చాలా అవసరం. ఓ మంచి కథ రాసుకోండి. నచ్చితే కచ్చితంగా పబ్లిష్ చేస్తాం అని పబ్లిషర్ అంటాడు. మరోవైపు సీతారామయ్య దగ్గరికి ఇందిరాదేవి వెళ్తుంది. ఇచ్చిన మాట గురించి ఆలోచిస్తున్నావా. మాటిచ్చి తప్పు చేశానని ఆలోచిస్తున్నావా. తొందరపడి మాటిచ్చావనిపిస్తుంది బావా అని ఇందిరాదేవి అంటుంది. తప్పలేదు. ఇంతకన్న దారుణంగా పరిస్థితి అవుతుందని, బంధాలకు లొంగిపోయాను అని సీతారామయ్య అంటాడు.
రాజ్‌ను ఆఫీస్‌కు పంపకుండా ఆపకపోతే ధాన్యలక్ష్మీ ఆస్తు ముక్కలు చేసి వేరు కాపురం పెట్టేది. తన వైపు కూడా న్యాయం ఉంది. కల్యాణ్ రోడ్డుపడ్డాడని బాధపడుతుంది. విడిపోవడం అంటే కేవలం ఇంట్లో నుంచి వెళ్లిపోవడం అనుకుంటారు. కానీ, మళ్లీ కలవాలంటే ఎంతో ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి రావాలి. అది తెలిసాకా ఇంట్లోకి ఎవరు రారు. దూరంగా ఉండిపోవాల్సి వస్తుంది. అందుకే ఆపాను. కంపెనీకు నష్టమొచ్చిన పర్వాలేదు. నేను బతికి ఉన్నంతకాలం ఇలా ఒక్కటిగా ఉంచుతాను అని సీతారామయ్య అంటాడు.
వందలమంది ఆధారపడతారు
ఏది ఏమైనా ఇల్లు ముక్కలు కాకుండా నేను చూసుకుంటాను అని ఇందిరాదేవి హామీ ఇస్తుంది. మరోవైపు రాజ్, కావ్య గొడవ పడుతుంటారు. తాతయ్య అంటే ఇల్లు ముక్కలు అవ్వడం ఇష్టంలేక కుటుంబమంతా ఉమ్మడిగా కలిసి ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి చిన్నత్తయ్యకు మాట ఇచ్చారు. కల్యాణ్ ఇంటికి వచ్చేవరకు మిమ్మల్ని తప్పించారు. కానీ, మీకు తెలియదా.. కవిగారు వచ్చేవారే అయితే మీరు కాల్ చేసిన రోజే వచ్చేవారు. ఆయనకు రావాలని లేదు. అప్పటివరకు కంపెనీ ఏం కాను అని కావ్య అంటుంది.
నీకెందుకు అని రాజ్ అంటాడు. నేనేమైన జీతం తీసుకునే ఉద్యోగినా. నేను మీ భార్యను. అడిగే హక్కు నాకుంది అని కావ్య అంటుంది. నన్ను అనే హక్కుంది. కానీ, తాతయ్యకు ఎదురుతిరిగే హక్కు లేదని రాజ్ అంటే.. నేను నా అభిప్రాయం మాత్రమే చెప్పాను. వంటింటి రాజకీయాలకు కంపెనీ బాధ్యతలను ముడిపెట్టడం కరెక్ట్ కాదండి. ఎన్నో వందలమంది కంపెనీపై ఆధారపడి బతుకుంటారు. వాళ్లు రోడ్డున పడతారు అని కావ్య అంటుంది.
రాజ్‌ను తాతయ్య అన్న కావ్య
అలా పడుతుంటే చూస్తారా. తాతయ్యకు నువ్ అడ్డు చెప్పడం నాకు నచ్చలేదు అసలు అని రాజ్ అంటే.. అది తాతయ్య గారు చెప్పాలి. మీరు నాకు తాతయ్యా అని కావ్య అంటుంది. ఇంటి గౌరవాన్ని కాపాడే హక్కు, అర్హత అధికారం నాకుంది అని రాజ్ అంటాడు. మరి మీ నాన్నగారు ఎక్కడికి వెళ్లారు తాతయ్య, మీకంటే ఇంటి పెద్ద ఒకరున్నారని మర్చిపోయారా తాతయ్యా అని కావ్య వెటకారంగా అంటుంది. తాతయ్య నా దగ్గర ఓ మాట తీసుకున్నారు అని రాజ్ చెబుతాడు.
ఇంట్లో ఏం జరిగినా, ఆఫీస్‌లో ఏం జరిగినా అది కుటుంబంపై ప్రభావం చూపించకూడదన్నారు. కుటుంబం ముక్కలు కాకుండా చూసుకునే బాధ్యత నామీద ఉందన్నారు అని రాజ్ అంటాడు. అలా చేయాలనుకుంది మీ పిన్నిగారు. ఆవిడకు జోల పాడటానికి కంపెనీని మాత్రం ముక్కలు చేయొచ్చా. వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది. వ్యక్తిగత సమస్యల కంటే సంస్థ గొప్పది. ముందు సంస్థను నిలబెట్టండి అని కావ్య చెబుతుంది. తాతయ్యకు అడ్డు చెప్పకూడదు అని రాజ్ అంటాడు.
చెప్పలేదు కాబట్టే ఓ అసమర్థుడుని తీసుకెళ్లి అందలం ఎక్కించారు. రాహుల్‌ను మీ స్థానంలో ఉంచారు అని కావ్య అంటుంది. అసలు నీ బాధేంటే. ఎందుకు ఇప్పుడు ఇంత ఆర్గ్యూ చేస్తున్నావ్. కొంపదీసి మా పిన్ని అన్నట్లు నీకు ఆస్తులమీద ఐశ్వర్యం మీద మోజు ఏమైనా పెరిగిపోయిందా. నా ప్లేసులో ఇంకొకరు ఉంటే నా వాటా తన్నుకుపోతారని భయపడుతున్నావా. అందుకేనా కల్యాణ్ ఇంటికి రాకూడదను కోరుకుంటున్నావ్ అని రాజ్ అంటాడు.
కావ్య ఛాలెంజ్
దాంతో నవ్వినా కావ్య.. మీకు తెలిసిపోయిందా. మీకు అర్థమైపోయిందా. అయ్యయ్యో.. మీకేంటి కర్ణ పిశాచీలాగా మనసులో అనుకున్నవన్ని అలా తెలిసిపోతున్నాయి. మీరు అలాగే అనుకోండి. అది మంచిదే. రేపటి నుంచి నేను మీ ఆస్తి దోచుకోవాలని చూస్తున్నానా.. మీరంతా నా కష్టం దోచుకోవాలని చూస్తున్నారా తెలిసేలా చేస్తాను అని కావ్య ఛాలెంజ్ చేస్తుంది. అంటే ఏం చేయాలని అనుకుంటున్నావ్ అని రాజ్ అడిగితే.. చూస్తూ ఉండండి రేపటి నుంచి తెలుస్తుంది కదా అని కావ్య వెళ్లిపోతుంది.
మరోవైపు అప్పు వంట చేయడానికి కష్టపడుతుంది. వంట అంటే ఇన్ని చేయాలా. ఇందులో సగం లేనేలేవు. కవిగాడు ఎలా తింటాడో ఏమో అని అప్పు అనుకుంటుంది. ఇంతలో కల్యాణ్ వస్తాడు. నువ్ ఇంకా రావట్లేదని టెన్షన్ పడుతున్నాను. నన్ను ఎత్తుకుపోయినట్లు నిన్ను కూడా అనామిక ఎత్తికెళ్లిపోయిందేమో అని అప్పు అంటుంది. దాంతో కల్యాణ్ నవ్వుతాడు. ఇద్దరూ భోజనానికి కూర్చుంటారు. ఉద్యోగం దొరికిందా అని అప్పు అడిగితే.. జాబ్ దొరకలేదు గానీ, జీతం దొరికిందని కల్యాణ్ చెబుతాడు.
వరలక్ష్మీ వ్రతం
జీతం ఎవరిచ్చారని అప్పు అడిగితే.. మా అమ్మ సరస్వతి. ఆరు వేల జీతం అని జరిగింది చెబుతాడు కల్యాణ్. మీ ఇంట్లో రోజుకో బాగోతం జరుగుతుంది కదా. అవే కథలుగా రాయి. నువ్ ఏదైనా రాస్తావ్. సరే తిను. ఎలా ఉన్న అడ్జస్ట్ చేసుకో అని అప్పు అంటుంది. ఇక్కడ ఇదైన దొరికింది. ఇంట్లో ఉన్నప్పుడు చాలాసార్లు లేచి వెళ్లిపోయేవాడిని. అన్నం విలువ అప్పుడు తెలియలేదు. ఇప్పుడు తెలిసింది అని కల్యాణ్ అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
తర్వాతి ఎపిసోడ్‌లో కల్యాణ్‌కు పెళ్లి అయింది. ముగ్గురితో కలిపి వరలక్ష్మీ వ్రతం చేయించాలని అనుకుంటున్నట్లు ఇందిరాదేవి అంటుంది. నేను చిట్టి వెళ్లి కల్యాణ్‌ను తీసుకొస్తాం అని సీతారామయ్య అంటాడు. కట్ చేస్తే పూజకు ఒప్పుకునేసరికి దాన్ని కోడలిగా ఒప్పుకున్నాను అనుకుంటున్నావా. ఇప్పుడే కాదు ఎప్పటికీ అప్పును కోడలిగా ఒప్పుకోను. రేపు వస్తుంది. వెళ్లేలోపు అప్పు కోడలిగా పనికిరాదని ఇంట్లో అందరికీ రుజువు చేసి పంపిస్తాను అని రుద్రాణితో ధాన్యలక్ష్మీ అంటుంది.