Brahmamudi April 30th Episode: కావ్య విశ్వరూపం - అనామిక తల్లిదండ్రులకు మాస్ వార్నింగ్ - దుగ్గిరాల ఇంట్లో కనకం రచ్చ
Brahmamudi April 30th Episode: నేటి బ్రహ్మముడి సీరియల్‌లో అనామిక తల్లిదండ్రులకు కావ్య మాస్ వార్నింగ్ ఇస్తుంది. అనామిక చేత కేసు వాపస్ తీసుకోకపోతే తన భర్త దగ్గర మీరు అప్పు తీసుకున్న సంగతి మొత్తం బయటపెట్టేస్తానని, మిమ్మల్ని జైలుకు పంపిస్తానని చెబుతుంది.
Brahmamudi April 30th Episode: కళ్యాణ్‌తో పాటు అప్పుపై అనామిక పోలీస్ కేసు పెట్టడం కనకం సహించలేకపోతుంది. దుగ్గిరాల ఇంటికి వచ్చి గొడవ చేస్తుంది. ఇంకోసారి కళ్యాణ్‌తో అప్పు తిరగనని రాసిస్తేనే తాను కేసును వాపస్ తీసుకుంటానని అనామిక అంటుంది. అలా రాసిస్తే తన కూతురు నిజంగానే తప్పుడు ఉద్దేశంతో నీ మొగుడితో తిరుగుతున్నట్లు తానే ఒప్పకున్నట్లు అవుతుందని, అప్పు తల్లిగా తాను ఎప్పటికీ అలా రాసివ్వనని కనకం బదులిస్తుంది.
కనకం దీక్ష...
దుగ్గిరాల కుటుంబం తన కూతురుకి ఏ న్యాయం చెబుతుందో, ఈ తల్లి గుండెల్లో రగిలే చిచ్చుకు ఏమని సమాధానం చెబుతుందో తేలే వరకు ఇళ్లు వదిలిపెట్టనని, ఇక్కడే కూర్చుంటానని దుగ్గిరాల ఇంట్లోనే మెట్లపై కూర్చుండిపోతుంది కనకం . ఈ రాత్రి గడిచేలోపు అప్పు క్షేమంగా ఇంటికిరావాలని అంటుంది. తనను వెళ్లగొట్టాలని చూస్తే ఊరుకోనని ఖబడ్డార్ అంటూ ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది కనకం. దుగ్గిరాల ఇంట్లోనే కనకం దీక్ష చేస్తుంది.
అనామిక తల్లిదండ్రుల నింద..
కళ్యాణ్, అప్పుల బంధాన్ని అనామిక తల్లిదండ్రులు కూడా తప్పు పడతారు. అప్పు మీద మోజుతో కళ్యాణ్ తన కూతురిని వదిలించుకోవాలని చూస్తున్నాడని, దుగ్గిరాల ఇంట్లో అనామిక సుఖంగా లేదని నిందలు వేస్తారు. కోర్టుకు వెళితేనే అప్పు పీడ విరగడైపోతుందని, అప్పుడే కళ్యాణ్ దారిలోకి వస్తాడని చెబుతారు.
కళ్యాణ్ జైలుకు...
మీరు కోర్టుకు వెళితే కళ్యాణ్ జైలుకు వెళ్లాల్సివస్తుందని, జైలు నుంచి విడుదలైన తర్వాత అనామికతో కళ్యాణ్ ఎలా కాపురం చేస్తాడు? కళ్యాణ్ జైలుకు వెళితే మీ అమ్మాయిని మా ఇంట్లో ఉండనిస్తారా అని అనామిక తల్లిదండ్రులను కావ్య నిలదీస్తుంది.
మీ చెల్లెలితో కలిసి నువ్వు ఆడుతోన్న నాటకం ఇదని, అనామికను దూరం చేసి అప్పును కళ్యాణ్‌కు ఇచ్చి పెళ్లిచేయలని అనుకుంటే ఊరుకోనని కావ్యను తప్పుపడతారు అనామిక తల్లిదండ్రులు. అప్పటివరకు అనామిక తల్లిదండ్రులకు సర్ధిచెప్పాలని ప్రయత్నించిన కావ్య తనతో పాటు అప్పు వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడటం సహించలేకపోతుంది.
బండారం బయటపెడతా...
అప్పుల వాళ్లు వచ్చి రెండు కోట్లు ఇవ్వనిదే అనామిక పెళ్లి జరగనివ్వమని గొడవ చేస్తే నా భర్తను కన్వీన్స్ చేసి మీ అప్పును నేనే తీర్చిన విషయం మర్చిపోయారా? నా చెల్లెలినే కళ్యాణ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటే ఆ రోజు అప్పుల వాళ్లను రెచ్చగొట్టి మీ కూతురి పెళ్లి ఆపించే దానిని అని కావ్య అంటుంది.
అనామికకు సర్ధిచెప్పి కేసును వాపస్ తీసుకోకపోతే మీ బతుకులు మొత్తం బయటపెట్టేస్తానని, ఎవరికి తెలియకుండా నా భర్త వద్ద తీసుకున్న రెండు కోట్ల అప్పు విషయం అందరికి చెప్పేస్తానని అంటుంది.
మీ వాలకం చూస్తుంటే కూతురు కాపురం చెడిపోవడం వెనుక మీ హస్తం కూడా ఉందని అర్థమవుతుందని, మీ ముఖాలు చూస్తే అలాగే అనిపిస్తుందని అంటుంది.
భర్త తలచుకుంటే...
రాజ్ తలచుకుంటే ఒక్క ఫోన్ కాల్‌తో మీరు జైలుకు వెళతారు..కళ్యాణ్... అప్పు బయటకువస్తారు. అయినా ఓపికతో కళ్యాణ్ , అనామిక సంతోషం కలిసి ఉండటం కోసమే మిమ్మల్నినా భర్త బతిమిలాడుతున్నాడు. మా ఆయన గనక మిమ్మల్ని లెక్కచేయకపోతే మీ బతుకులు రోడ్డున పడటానికి ఒక్క నిమిషం కూడా పట్టదు. బీ కేర్ ఫుల్ అని వార్నింగ్ ఇస్తుంది. మీ సంగతి తేలుస్తానంటూ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లబోతుంది.
కాళ్లబేరానికి వచ్చిన అనామిక తండ్రి...
కావ్య నిజాలు బయటపెడితే తమ బండారం మొత్తం బయటపడుతుందని అనామిక తల్లిదండ్రులు భయపడిపోతారు. కాళ్లబేరానికివస్తారు. అనామికనే తప్పు చేసిందని, ఆమె మాటలు విని తొందరపడ్డామని అంటారు. అనామికను పిలిపించి కేసు వాపస్ తీసుకునేలా చేస్తామని చెబుతారు.
అనామిక తల్లిదండ్రులకు తన ముందే కావ్య వార్నింగ్ ఇవ్వడం రాజ్ కంగారుపడతారు. నీలో కనపడని రౌడీ ఉంది అంటూ కావ్యతో అంటాడు. తాను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని, తన భర్త తలచుకుంటే ఏదైనా చేయగలడు అన్నది నిజమని చెబుతుంది.
అనామిక ఆవేశం...
అనామికకు ఫోన్ చేసి కేసు వాపసు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తారు ఆమె తల్లిదండ్రులు. కానీ చచ్చినా తాను ఆ పనిచేయనని, కళ్యాణ్ తనకు క్షమాపణలు చెబితేనే కేసు వాపస్ తీసుకుంటానని అంటుంది. నువ్వు గనక కేసు వాపస్ తీసుకోకపోతే మన బతుకులు రోడ్డున పడతాయని, అందరం జైలుకు వెళతామని భయపడిపోతారు.
అనామికకు రివర్స్ వార్నింగ్...
అనామికను బతిమిలాడి వాపస్ తీసుకోవడానికి ఒప్పించి పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకొస్తారు ఆమె తల్లిదండ్రులు. స్టేషన్ లోపల కళ్యాణ్, అప్పు కలిసి టీ తాగడం చూసి అనామిక కోపం మరింత పెరుగుతుంది. స్టేషన్ అని కూడా చూడకుండా వీళ్లు రొమాన్స్ చేసుకుంటున్నారంటూ ఇద్దరిపై కోపంతో ఊగిపోతుంది.
స్టేషన్ నుంచి బయటకు వెళ్తబోతుంది. కానీ బయట కావ్య, రాజ్ ఉండటంతో ఏం చేయాలో తెలియక చివరకు కేసు వాపస్ తీసుకుంటుంది. ఇంకోసారి సాక్ష్యాలు లేకుండా పోలీస్ కేసు పెడితే నిన్నే జైలుకు పంపిస్తామని అనామికకు పోలీస్ ఆఫీసర్ వార్నింగ్ ఇస్తాడు. కళ్యాణ్, అప్పులను వదిలేస్తారు పోలీసులు.
రుద్రాణిపై సెటైర్...
కనకానికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక దుగ్గిరాల కుటుంబ సభ్యులు మౌనంగా ఉండిపోతారు. మేము పరువుగా బతకాలా లేదా అంటూ కనకంపై రుద్రాణి ఫైర్ అవుతుంది. పరువు గురించి మీ దగ్గర క్లాస్ తీసుకోవాలి అంటూ అత్తపై స్వప్న సెటైర్ వేస్తుంది. రాహుల్ కూడా నోరు జారుతాడు. ఎక్కువ మాట్లాడకు రాహుల్. నేను మా అమ్మ కంటే ఊర మాస్ అని భర్తకు వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే అప్పు, కళ్యాణ్‌ను తీసుకొని రాజ్, కావ్య ఇంట్లోకి వస్తారు.
కావ్య మాస్ వార్నింగ్...
అప్పును చూడగానే ఇప్పటివరకు మీ అమ్మ ఇంట్లో చేసిన గొడవ చాలు ఇక వెళ్లమని చెప్పు అని కావ్యతో అంటుంది ధాన్యలక్ష్మి. ఇంకోసారి అప్పు జోలికి మీరు, అనామిక, రుద్రాణి ఎవరు వచ్చిన మా అమ్మ చూస్తూ ఊరుకున్న నేను ఊరుకోనని అందరికి కలిపి కావ్య వార్నింగ్ ఇస్తుంది. ఈ నిందను ఇక్కడితో ఆపితే మంచిదని లేదంటే నా విశ్వరూపాన్ని చూపిస్తానని కనకం కూడా వార్నింగ్ ఇస్తుంది. స్వప్న కూడా తన చెల్లెలి జోలికి వస్తే తాటతిస్తానని అంటుంది.
అనామిక మొదటితప్పు...
అనామిక మొదటి తప్పుగా భావించిన ఇందిరాదేవి ఆమెను క్షమిస్తున్నామని అంటుంది. ఇక ముందు ఇటువంటివి జరిగితే భరించే శక్తి తమకు లేదని, ఇలాంటివి సహించమని అంటుంది. ఏ కష్టం వచ్చిన నీ భర్తతోనే చెప్పుకోవాలి. నీ భర్తకు నువ్వు కష్టంగా మారితే చెప్పుకోవడానికి ఎవరికి మిగలరని అనామికకు క్లాస్ ఇస్తుంది ఇందిరాదేవి.
అనామిక ప్రశ్నలు...
రాజ్ మరో ఆడదానితో కలిసి బిడ్డను కన్న ఇంట్లోవాళ్లు ఏం చేయలేకపోయారని, భవిష్యత్తులో కళ్యాణ్‌తో అప్పు తోఎ బిడ్డను కని తీసుకురాడని గ్యారెంటీ ఏంటి అని ప్రశ్నిస్తుంది. అనామిక మాటలతో కావ్య ఫైర్ అవుతుంది.
అపార్థాలు, అనుమానాలతో నీ కాపురం నువ్వు కూల్చుకుంటే ఎవరూ ఏం చేయలేరని, నీ ఏడుపు నువ్వు ఏడువు...అంతేకానీ మధ్యలోకి నా భర్త ప్రస్తావన తీసుకొస్తే నాలో అమ్మను కాదు అమ్మవారిని చూస్తావని వార్నింగ్ ఇస్తుంది. నువ్వు అమ్మవారికి అయితే నేను అపరకాళిని అవుతా...అనామికను అనామకురాలని చేస్తా అని స్వప్న కూడా అంటుంది.
అనామికకు అపర్ణ సపోర్ట్...
అనామిక మాటలను అపర్ణ సపోర్ట్ చేస్తుంది. అన్నింటిలో అన్నను అనుసరించే తమ్ముడు ఈ విషయంలో రాజ్‌ను ఫాలో కాడని గ్యారెంటీ ఏంటి అని అంటుంది. నా చెల్లెలిని అరెస్ట్ చేసి నువ్వు ఏం సాధించలేని అనామికతో అంటుంది స్వప్న. పోలీస్ స్టేషన్‌లో కూడా అప్పుకు కళ్యాణ్ టీ...కాఫీ అంటూ సేవలు చేశాడంటా కదా అని అనామిక కోపాన్ని మరింత పెంచుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.