Boycott Bollywood: బాయ్‌కాట్ బాలీవుడ్ అంటున్న నెటిజన్లు.. మళ్లీ టాప్ ట్రెండింగ్‌లోకి.. ఇదీ కారణం
Boycott Bollywood: బాయ్‌కాట్ బాలీవుడ్ నినాదం మరోసారి తెరపైకి వచ్చింది. పాలస్తీనాకు మద్దతుగా పలువురు స్టార్లు గళం విప్పడంతో ఇది మరోసారి సోషల్ మీడియా టాప్ ట్రెండింగ్స్ లోకి వెళ్లిపోయింది.
Boycott Bollywood: బాయ్‌కాట్ బాలీవుడ్.. బుధవారం (మే 29) ఉదయం నుంచి సోషల్ మీడియా ఎక్స్ టాప్ ట్రెండింగ్స్ లో ఇదీ ఒకటి. కొన్ని వేల మంది నెటిజన్లు ఈ హ్యాష్‌ట్యాగ్ తో పోస్టులు చేస్తున్నారు. బాలీవుడ్ తారలపై తీవ్రంగా మండిపడుతున్నారు. దీనికి కారణం ఆలియా భట్, కరీనా కపూర్, వరుణ్ ధావన్ లాంటి వాళ్లు పాలస్తీనాకు మద్దతుగా పోస్టులు చేయడమే.

టాప్ ట్రెండింగ్స్‌లో బాయ్‌కాట్ బాలీవుడ్
పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను ఖండిస్తూ ఆ దేశానికి బాలీవుడ్ సెలబ్రిటీలు అండగా నిలుస్తున్నారు. బుధవారం (మే 29) పలువురు స్టార్లు తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఇవే పోస్టులు చేశారు. అవి చూసిన పలువురు నెటిజన్లు ఈ బాయ్‌కాట్ బాలీవుడ్ హ్యాష్‌ట్యాగ్ ను తెరపైకి తీసుకొచ్చారు. ఈ హ్యాష్‌ట్యాగ్ (#BoycottBollywood)తో వేల పోస్టులు రావడంతో ఇది కాస్తా టాప్ ట్రెండింగ్స్ లోకి వెళ్లిపోయింది.
దీనిపై బాలీవుడ్ సీనియర్ పూజా భట్ తీవ్రంగా స్పందించింది. ఇండస్ట్రీ మొత్తం కలిసికట్టుగా ఏదైనా జరుగుతున్న అన్యాయంపై గళం విప్పితే చాలు ఇలా బాయ్‌కాట్ అనడం సాధారణమైపోయిందని ఆమె మండిపడింది. తన ఎక్స్ అకౌంట్ ద్వారా పూజా భట్ తమ అసహనాన్ని వెల్లగక్కింది. "ఇది మళ్లీ మొదలైంది. పాలస్తీనాలో జరుగుతున్న అకృత్యాలపై కలిసికట్టుగా నినదించినందుకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ చెల్లిస్తున్న మూల్యం ఇది" అని పూజా ట్వీట్ చేసింది. ఈ పోస్టుకు కామెంట్స్ లో జరుగుతున్న గ్యాస్‌లైటింగ్ కూడా ఊహించిందే అంటూ పూజా మరో పోస్ట్ చేసింది.
పాలస్తీనాకు మద్దతుగా బాలీవుడ్ స్టార్లు
అంతకుముందు పూజా భట్ సవతి సోదరి ఆలియా భట్ పాలస్తీనాకు మద్దతుగా ఓ పోస్ట్ చేసింది. మంగళవారం (మే 28) తన ఇన్‌స్టా స్టోరీలో స్పందిస్తూ.. "పిల్లలందరూ ప్రేమకు అర్హులు. పిల్లలందరూ భద్రతకు అర్హులు. పిల్లలందరూ శాంతిగా బతకడానికి అర్హులు. పిల్లలందరూ జీవించడానికి అర్హులు. తమ పిల్లలకు అవన్నీ ఇవ్వడానికి తల్లులందరూ అర్హులు" అంటూ ఆలియా రాసుకొచ్చింది.
బాలీవుడ్ సెలబ్రిటీలు #AllEyesOnRafah అనే హ్యాష్‌ట్యాగ్ ను తమ పోస్టులకు జత చేశారు. అటు కరీనా కపూర్ కూడా పాలస్తీనాకు మద్దతుగా నిలిచింది. వీళ్లే కాదు సమంత, తృప్తి దిమ్రి, మాధురి దీక్షిత్, ఫాతిమా సనా షేక్, దియా మీర్జా, స్వర భాస్కర్ లాంటి వాళ్లు కూడా పాలస్తీనాకు మద్దతు పోస్టులు చేశారు.
రఫాలో ఏం జరుగుతోంది?
దక్షిణ గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 37 మంది మృత్యువాత పడ్డారు. సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం కూడా ఈ దాడులు కొనసాగాయి. ఈ యుద్ధం తలదాచుకుంటున్న పాలస్తానీయుల క్యాంప్ పై కొన్ని రోజుల కిందట ఫైరింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడదే ప్రాంతంలో ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులు జరిపింది.
ఈ దాడులకు వ్యతిరేకంగానే బాలీవుడ్ స్టార్లు గళమెత్తారు. వెంటనే కాల్పుల విరమణ జరగాలంటూ టాలీవుడ్ నటి సమంత కూడా ట్వీట్ చేసింది. రఫా గురించి బాలీవుడ్ స్టార్ల పోస్టులు పెరగడంతో ఇప్పుడు బాయ్‌కాట్ బాలీవుడ్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది.
టాపిక్