Box Office: మూడు సినిమాలు.. రూ.1900 కోట్లు.. అదృష్టమంటే ఈ తమిళ నటుడిదే..
Box Office: మూడు సినిమాలు.. రూ.1900 కోట్లు.. నిజంగా ఈ తమిళ నటుడి అదృష్టం మామూలుగా లేదు. జాఫర్ సాదిఖ్ అనే ఈ నటుడు రెండు తమిళ సినిమాలు, ఓ హిందీ సినిమాలో నటించాడు.
Box Office: ఏడాదిన్నర కాలంగా బాక్సాఫీస్ బద్ధలైపోయే సినిమాలు ఎన్నో వస్తున్నాయి. ఇటు సౌత్ లో, అటు బాలీవుడ్ లో వచ్చిన కొన్ని సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. కమల్ హాసన్, షారుక్ ఖాన్, రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు నటించిన సినిమాలు కోట్లు కొల్లగొట్టాయి. అయితే మూడు సినిమాల్లో రూ.1900 కోట్లు వసూలు చేసిన ఈ తమిళ నటుడి గురించి మీకు తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
గతేడాది సూపర్ డూపర్ హిట్ అయిన విక్రమ్, ఈ ఏడాది బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన జైలర్, జవాన్ మూవీల్లో నటించిన ఆ తమిళ నటుడి పేరు జాఫర్ సాదిఖ్. అతని అదృష్టం బాగుండి.. ఈ టాప్ కలెక్షన్లు రాబట్టిన మూడు సినిమాల్లోనూ నటించాడు. ఈ మూడూ కలిపి ఏకంగా రూ.1900 కోట్లు వసూలు చేయడం విశేషం. షారుక్, రజనీ, కమల్, అక్షయ్ కుమార్ లాంటి నటులకు కూడా సాధ్యం కాని విషయం ఇది.
ఈ 27 ఏళ్ల సాదిఖ్ ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సరసన నిలిచాడు. షారుక్ నటించిన చివరి రెండు సినిమాలు పఠాన్, జవాన్ కలిపి సుమారు రూ.2 వేల కోట్ల వరకూ వసూలు చేయడం విశేషం. సాదిఖ్ కూడా భారీ వసూళ్లు సాధించిన ఈ మూడు సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకొని కలెక్షన్ల వర్షంలో తడిసి ముద్దయ్యాడు.
జాఫర్ సాదిఖ్ తమిళనాడుకు చెందిన నటుడు. నిజానికి అతనో డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. తర్వాత నటుడిగా మారాడు. గ్యాంగ్‌స్టర్స్, విలన్ పాత్రల్లో నటిస్తున్నాడు. 2020లో పావా కదైగల్ అనే తమిళ వెబ్ సిరీస్ తో పేరు సంపాదించుకున్నాడు. కేవలం 4 అడుగుల 8 అంగుళాల ఎత్తుతో అతడు అందరి దృష్టిలో పడ్డాడు. 2022లో కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీతో సినిమాల్లోకి అడుగుపెట్టాడు.
ఆ సినిమాలో విజయ్ సేతుపతి పాత్రకు అనుచరుడిగా ఈ జాఫర్ సాదిఖ్ కనిపించాడు. ఈ విక్రమ్ మూవీ రూ.414 కోట్లు వసూలు చేసింది. తెలుగు వెబ్ సిరీస్ సైతాన్ లోనూ అతడు నటించాడు. ఇక ఈ ఏడాది సూపర్ డూపర్ హిట్ అయిన జవాన్, జైలర్ మూవీల్లోనూ ఈ సాదిఖ్ కనిపించాడు.