Alka Yagnik: అరుదైన వ్యాధితో బాధపడుతున్న టాప్ సింగర్.. అలా చేయొద్దంటూ అభిమానులకు సలహా
Alka Yagnik: బాలీవుడ్ టాప్ సింగర్ అల్కా యాగ్నిక్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఆమెనే మంగళవారం (జూన్ 18) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ అభిమానులకు ఓ సలహా కూడా ఇచ్చింది.
Alka Yagnik: కొన్ని దశాబ్దాలుగా బాలీవుడ్ లో టాప్ ప్లేబ్యాక్ సింగర్స్ లో ఒకరిగా పేరుగాంచిన అల్కా యాగ్నిక్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోందట. దీనివల్ల ఆమెకు చెవుడు రావడం గమనార్హం. ఈ విషయాన్ని అల్కానే తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఓ వైరల్ అటాక్ వల్ల తన చెవులు వినిపించకుండా పోయాయని ఆమె చెప్పింది. తన ఆరోగ్యం కోసం ప్రార్థించమని అభిమానులను కోరింది.
అల్కా యాగ్నిక్‌కు అరుదైన వ్యాధి
1990ల్లో బాలీవుడ్ లోని టాప్ సింగర్స్ లో ఒకరైన అల్కా యాగ్నిక్ ఇప్పుడు ఓ అరుదైన సెన్సోరిన్యూరల్ నెర్వ్ హియరింగ్ లాస్ తో బాధపడుతోంది. ఓ సడెన్ వైరల్ అటాక్ కారణంగా తనకు ఇది సోకినట్లు ఆమె వెల్లడించింది. అసలు ఇది తనకు సోకే వరకు తెలియలేదని ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అల్కా తెలిపింది.
"నా అభిమానులు, స్నేహితులు, ఫాలోవర్లు, శ్రేయోభిలాషులకు.. కొన్ని వారాల కిందట నేను ఓ ఫ్లైట్ దిగి వస్తుంటే.. అసలు ఏమీ వినిపించలేదు. కొన్ని రోజులుగా నేను ఎందుకు కనిపించడం లేదు అని అడుగుతున్న ఫ్రెండ్స్, ఫాలోవర్ల కోసం ఇప్పుడు నేను చెబుతున్నాను. నేను ఓ అరుదైన సోన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ తో బాధపడుతున్నట్లు డాక్టర్లు చెప్పారు. వైరల్ అటాక్ వల్ల ఇలా జరిగింది. ఈ హఠాత్పరిణామాన్ని నేను అసలు ఊహించలేదు" అని అల్కా చెప్పింది.
మీరు ఈ పని చేయొద్దు: అల్కా
తన కోసం ప్రార్థించాలని అభిమానులను కోరింది. అంతేకాదు దయచేసి పెద్దగా మ్యూజిక్ పెట్టుకొని వినడం, హెడ్ ఫోన్స్ వాడటం తగ్గించాలని కూడా సూచించింది. "ఈ వ్యాధితో బాధపడుతున్న నాకోసం మీరు ప్రార్థించండి. నా అభిమానులు, సహచరులకు ఒకటే చెబుతున్నాను. పెద్ద సౌండ్ తో మ్యూజిక్ వినడం, హెడ్ ఫోన్స్ వాడటం తగ్గించుకోండి. నా ప్రొఫెషనల్ జీవితం వల్ల కలిగిన ఆరోగ్య సమస్యల గురించి భవిష్యత్తులో చెబుతాను. మీ మద్దతు, ప్రేమతో నేను త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాను" అని అల్కా తెలిపింది.
అల్కా యాగ్నిక్ 1990ల్లో బాలీవుడ్ లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడింది. తర్వాత ఎన్నో షోలు చేయడంతో పాటు పలు రియాల్టీ షోలలోనూ జడ్జిగా, గెస్ట్ గా వ్యవహరించింది. కెరీర్లో ఇప్పటి వరకూ 25 భాషల్లో 21 వేలకుపైగా పాటలు పాడటం విశేషం. 2022లో మోస్ట్ స్ట్రీమ్‌డ్ ఆర్టిస్ట్ గా గిన్నిస్ రికార్డుల్లో కూడా ఎక్కింది. ఆ ఏడాది 15.3 బిలియన్ వ్యూస్ ఆమె పాటల సొంతం చేసుకోవడం గమనార్హం.