Ekta Kapoor: బాలీవుడ్ ప్రముఖ హీరో జితేంద్ర కూతురు ఏక్తా కపూర్ మొదటి నుంచీ కాస్త వివాదాస్పదమే. ఓ నిర్మాతగా ఆమె ఎంచుకునే సినిమాలు, సిరీస్ చాలా బోల్డ్ గా ఉంటాయి. గతేడాది కూడా థ్యాంక్యూ ఫర్ కమింగ్ అనే ఓ సెక్స్ కామెడీ సినిమా తీసిందామె. ఇక ఇప్పుడు ఎల్ఎస్‌డీ: లవ్ సెక్స్ ఔర్ ధోకా 2 మూవీతో రాబోతోంది. ఈ మూవీపై ఆమె వెరైటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది.
బాలీవుడ్ లో దిబాకర్ బెనర్జీ డైరెక్ట్ చేసిన ఈ లవ్ సెక్స్ ఔర్ ధోకా 2 మూవీ రిలీజ్ అయిన తర్వాత తాను ఎక్కడికైనా వెళ్లి దాక్కోవాల్సిందే అని ఈ ఇంటర్వ్యూలో ఏక్తా అనడం గమనార్హం. గతేడాది రిలీజైన థ్యాంక్యూ ఫర్ కమింగ్ సినిమా రిలీజైనప్పుడే తనపై ఎంతో మంది ఆగ్రహం వ్యక్తం చేశారని, ఇప్పుడీ ఎల్ఎస్‌డీ2 అంతకంటే బోల్డ్ గా ఉండబోతోందని ఆమె చెప్పింది.
"థ్యాంక్యూ ఫర్ కమింగ్ మూవీ నా మనసులో ఓ వింత బాధను మిగిల్చింది. ఈ సినిమాకు ఇండియాతోపాటు ఓవర్సీస్ లోనూ ఒక రకమైన ఆదరణ లభించింది. అయితే ఆ సినిమా రిలీజైన తర్వాత ఎంతో మంది మమ్మల్ని ద్వేషించారు. మా సోషల్ మీడియా వాల్స్ పై ప్రతి రోజూ ఎన్నో విద్వేషకర సందేశాలు వచ్చేవి. ఎందుకంటే మేము ఫిమేల్ సెక్సువాలిటీపై తీసిన సినిమా అది. ఇక ఇప్పుడు ఎల్ఎస్‌డీ 2 వస్తే ఏం జరుగుతుందో నేను ఊహించగలను. నేను మళ్లీ ఎక్కడికైనా వెళ్లి దాక్కోవాలి" అని ఏక్తా కపూర్ చెప్పింది.
లవ్ సెక్స్ ధోకా పేరుతో 2010లో ఓ సినిమా వచ్చిన సంగతి తెలుసు కదా. ఈ మూవీ ద్వారానే రాజ్ కుమార్ రావ్ హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమాను కూడా దిబాకర్ బెనర్జీయే డైరెక్ట్ చేశాడు. బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్ లో ఏక్తా కపూర్ ఆ సినిమాను నిర్మించింది. అప్పట్లో ఈ మూవీ పెద్ద హిట్ అయింది. రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రూ.10 కోట్లు వసూలు చేసింది.
ఇక ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తున్న మూవీ ఎల్ఎస్‌డీ 2. లవ్ సెక్స్ ఔర్ ధోకా 2. ఈ సినిమాను కూడా దిబాకర్ డైరెక్ట్ చేశాడు. అసలు ఈ మూవీ తీయాలన్న ఆలోచన ఏక్తాదే అని దిబాకర్ చెప్పాడు. అప్పటికీ, ఇప్పటికీ సమాజం ఎంతో మారిపోయిందని, ఇక మనం ఈ మూవీ తీయొచ్చని ఆమె చెప్పినట్లు అతడు వెల్లడించాడు. ఈ ఎల్ఎస్‌డీ 2 మూవీ ఏప్రిల్ 19న రిలీజ్ కానుంది.
నిజానికి ఏక్తా కపూర్ ఈ సినిమాలే కాదు ఏఎల్‌టీ బాలాజీ పేరుతో ఉన్న ఓటీటీలోనూ బోల్డ్ కంటెంట్ ఉన్న మూవీస్, సిరీస్ ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వాటితోనే ఏక్తా తరచూ విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది. ఆమె తండ్రి జితేంద్ర ఒకప్పుడు బాలీవుడ్ లో పెద్ద స్టార్. ఆమె తమ్ముడు తుషార్ కపూర్ కూడా కొన్ని సినిమాలు చేశాడు.