Malla Reddy: మంత్రి మల్లారెడ్డి కామెంట్లపై బాలీవుడ్ జనాల గుస్సా-bollywood people unhappy with minister malla reddy comments at animal pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bollywood People Unhappy With Minister Malla Reddy Comments At Animal Pre Release Event

Malla Reddy: మంత్రి మల్లారెడ్డి కామెంట్లపై బాలీవుడ్ జనాల గుస్సా

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 28, 2023 02:50 PM IST

Malla Reddy: యానిమల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన కొన్ని కామెంట్లపై బాలీవుడ్ జనాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఈవెంట్‍లో హీరో రణ్‍బీర్ కపూర్‌కు ఆయన కొన్ని సూచనలు చేశారు.

మంత్రి మల్లారెడ్డి
మంత్రి మల్లారెడ్డి

Malla Reddy: యానిమల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‍లో గ్రాండ్‍గా జరిగింది. బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‍లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో సోమవారం జరిగింది. ఈ ఈవెంట్‍కు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ మంత్రి, మల్లా రెడ్డి విద్యాసంస్థల అధినేత, బీఆర్ఎస్ నాయకుడు మల్లారెడ్డి కూడా ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో తన శైలిలో మాట్లాడారు. అయితే, మల్లారెడ్డి చేసిన కొన్ని కామెంట్లపై బాలీవుడ్ జనాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

బాలీవుడ్ హీరో రణ్‍బీర్ కపూర్‌కు మంత్రి మల్లారెడ్డి కొన్ని సూచనలు చేశారు. ముంబై నగరం పాతదైపోయిందని, బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువైందని.. అందుకే ఒక్క సంవత్సరంలో మీరు (రణ్‍బీర్) హైదరాబాద్‍కు మారాల్సి వస్తుందనేలా మల్లారెడ్డి కామెంట్లు చేశారు. ఐదేళ్లలో భారత దేశాన్ని, బాలీవుడ్, హాలీవుడ్‍ను తెలుగు జనాలు ఏలుతారని తన స్టైల్‍లో వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి.

“రణ్‍బీర్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. రానున్న ఐదేళ్లలో మొత్తం భారత్‍ను, బాలీవుడ్.. హాలీవుడ్‍ను మా తెలుగు ప్రజలు ఏలబోతున్నారు. మీరు కూడా ఒక సంవత్సరం తర్వాత హైదరాబాద్‍కు మారాల్సి ఉంటుంది. ఎందుకంటే ముంబై పాతదైపోయింది. బెంగళూరు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. హిందుస్థాన్‍లో ఒకే సిటీ ఉంది. అదే హైదరాబాద్. మా హైదరాబాద్ టాప్. మా తెలుగు ప్రజలు చాలాచాలా తెలివైనవారు” అని మల్లారెడ్డి అన్నారు.

అయితే, మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ అభిమానులు కొందరు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‍ను తెలుగు ప్రజలు ఏలుతారనడంపై అసంతృప్తి చెందుతున్నారు. అలాగే, హైదరాబాద్ నగరాన్ని గొప్పగా చెప్పుకోవడంలో అభ్యంతరం లేదని.. అయితే ముంబై, బెంగళూరు నగరాలను అలా అనడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపించడంతో ఆయన అలా మాట్లాడారని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. అలాగే, మల్లారెడ్డి కామెంట్లకు చిన్నబుచ్చుకోకుండా నవ్వుతూ ఉన్న రణ్‍బీర్‌ను కొందరు ప్రశంసిస్తున్నారు.

ఇక, సూపర్ స్టార్ మహేశ్ బాబును ప్రశంసలతో ముంచెత్తారు మంత్రి మల్లారెడ్డి. మహేశ్ హీరోగా చేసిన బిజినెస్‍మ్యాన్ సినిమా చూసే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. దీంతో మహేశ్ పడిపడి నవ్వారు. మొత్తంగా మల్లారెడ్డి స్పీచ్ మరోసారి వైరల్ అవుతోంది.

యానిమల్ సినిమా డిసెంబర్ 1వ తేదీన హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‍గా నటించగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, త్రిప్తి దిమ్రి కీలకపాత్రలు పోషించారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్‍, హైవోల్టేజ్ యాక్షన్ మేళవింపుతో ఈ చిత్రాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.