Pankaj Udhas death: దిగ్గజ సింగర్ పంకజ్ ఉధాస్ కన్నుమూత
Pankaj Udhas death: దిగ్గజ సింగర్ పంకజ్ ఉధాస్ కన్నుమూశారు. చిట్టీ అయీ హై సహా చాలా సూపర్ హిట్ పాటలను ఆయన పాడారు. 72 ఏళ్ల వయసులో ఇప్పుడు కన్నుమూశారు.
Pankaj Udhas: హిందీ దిగ్గజ గాయకుడు, గజల్ సింగర్ పంకజ్ ఉధాస్ (72) కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు (ఫిబ్రవరి 26) తుది శ్వాస విడిచారు. ‘చిట్టీ ఆయీ హై’తో పాటు అనేక చిరస్మరణీయమైన పాటలు పాడిన ఆయన మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు నేడు వెల్లడించారు.
పంకజ్ ఉధాస్ మరణించారని ఆయన కూతురు నయాబ్ వెల్లడించారు. ఈ విషయంపై ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. “సుదీర్ఘ కాల ఆనారోగ్యంతో పద్మశ్రీ పంకజ్ ఉధాస్ 2024 ఫిబ్రవరి 24న చనిపోయారని భారమైన మనసు, బాధతో తెలియజేస్తున్నాం” అని నయాబ్ పోస్ట్ చేశారు.
ముంబైలోని బీచ్ కాండీ ఆసుపత్రిలో నేటి ఉదయం 11 గంటలకు పంకజ్ ఉధాస్ తుదిశ్వాస విడిచారని తెలుస్తోంది. మంగళవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. భార్య ఫరిదా ఉధాస్, కూతుళ్లు రేవా ఉధాస్, సోదరులు నిర్మల్, మన్హర్ ఉధాస్‍తో ఆయన జీవిస్తూ ఉండేవారు.
పంకజ్ ఉధాస్ మరణ వార్త తెలుసుకొని చాలా మంది ప్రముఖులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివాళులు తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
పంకజ్ ఉదాస్ కెరీర్
1986లో వచ్చిన నామ్ చిత్రంలో చిట్టీ ఆయీ హై అనే పాటతో గాయకుడు పంకజ్ ఉధాస్ బాగా ఫేమస్ అయ్యారు. ఆ పాటలో ఆయన గాత్రం అందరినీ మైమరపించింది. ఏకే హీ మక్సద్ (1988) మూవీలో ‘చాందీ జైసా రంగ్ హై’, దేవన్ మూవీలో ‘ఆజ్ ఫిర్ తుంపే’ సహా ఆయన పాడిన చాలా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. క్లాసిక్ పాటలుగా నిలిచాయి. ఆహాత్ (1980) సహా తన కెరీర్లో చాలా గజల్స్ పాడారు పంకజ్ ఉధాస్.
కరోనా మహమ్మారి తర్వాత మళ్లీ స్టేజీలపై కాన్సెర్ట్‌లను నిర్వహించడం గురించి హిందుస్థాన్ టైమ్స్‌కు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో పంకజ్ ఉధాస్. రెండేళ్ల విరామం తర్వాత కాన్సెర్ట్ నిర్వహించినా అద్భుతమైన స్పందన వచ్చిందంటూ ఎమోషనల్ అయ్యారు.
“పాండమిక్ (కరోనా) ముందు, ఏ కాన్సెర్ట్‌లో అయినా ప్రదర్శన ఇవ్వడానికి చాలా ఆత్మవిశ్వాసంతో ఉండేవాడిని. అయితే, ప్యాండమిక్ చాలా కఠినమైన సమయం. శారీరకంగా కూడా కష్టమైన సమయమే. ప్రతీ రోజు రియాజ్ చేసే వాడిని. ఎక్కువ విశ్రాంతి తీసుకోకుండా ప్రయత్నించే వాడిని. అయితే, స్టేజీ, ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అవకాశం రాలేదు. అయితే, రెండేళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్‍లోని రామ్‍పూర్‌లో కాన్సెర్ట్ నిర్వహించాం. చాలా టెన్షన్ అనిపించింది. కానీ స్టేజీ మీదికి వెళ్లాకా.. నా కోసం ఆరు వేల మంది ప్రేక్షకులు హర్షధ్వానాలు చేయడం చూశాక నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అది చాలా భావోద్వేగమైన సందర్భం. దాని కోసం చాలా కాలం ఎదురుచూశా” అని పంకజ్ ఉధాస్ గతంలో అన్నారు.