Saif Ali Khan: ‘ఆదిపురుష్’పై ఎట్టకేలకు స్పందించిన సైఫ్ అలీ ఖాన్
Saif Ali Khan on Adipurush Movie: ఆదిపురుష్ సినిమాపై ఎట్టకేలకు స్పందించారు సైఫ్ అలీఖాన్. ఆ చిత్రంలో రావణుడి పాత్రను ఆయన పోషించారు. చాలాకాలం తర్వాత ఈ చిత్రంపై ఆయన పెదవి విప్పారు.

Saif Ali Khan: ఆదిపురుష్ సినిమా భారీ అంచనాల మధ్య గతేడాది జూన్‍లో రిలీజై.. నిరాశపరిచింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటంతో పాటు విమర్శలను కూడా ఎదుర్కొంది. రామాయణం ఆధారంగా ఆదిపురుష్‍ను ఆయన రూపొందించారు. ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. రాఘవుడిగా నటించారు. రావణుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ ఖాన్ పోషించారు. అయితే, ఈ చిత్రంపై ఇంతకాలం మౌనంగా ఉన్న సైఫ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
తాను అన్ని రకాల చిత్రాలను చేసేందుకు ఇష్టపడతానని సైఫ్ అలీ ఖాన్ చెప్పారు. ఏదైనా విభిన్నంగా ప్రయత్నించే క్రమంలో వైఫల్యం ఎదురైనా తాను రిస్క్ అనుకోకని చెప్పారు. పరాజయాలు ఎదురైనా బాగా ప్రయత్నించానని అనుకుంటూ ముందుకు సాగుతుండాలని చెప్పారు. ఫిల్మ్ కాంపానియన్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిపురుష్ గురించి స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రిస్క్ కాదు
చిత్రాల విషయంలో సాహసోపేతమైన నిర్ణయాలను ఎంపిక చేసుకునే విషయంలో సైఫ్ మాట్లాడారు. ఇందుకు ఆదిపురుష్‍ను ఉదాహణగా చెబుతూ స్పందించారు. “రిస్క్‌ల గురించి జనాలు మాట్లాడుతుంటారు. అయితే, ఏదైనా కొత్తగా ప్రయత్నించే క్రమంలో వైఫల్యం ఎదురైతే.. అది నిజంగా రిస్క్ కాదు. అలాంటివి కూడా కొన్ని ఉండాలి. ఇది మన విధానంలో ఓ భాగమే. మీరు దాన్ని గుర్తించాలి. కాస్త బాధపడాలి. ప్రయత్నం బాగుందని, కానీ దురదృష్టమని భావించాలి. ఆ తర్వాతి దాని కోసం ముందుకు సాగాలి” అని సైఫ్ అలీ ఖాన్ చెప్పారు.
స్టార్ అనుకోను
తనను తాను ఎప్పటికీ స్టార్ అనుకోనని సైఫ్ అలీ ఖాన్ చెప్పారు. సాధారణంగా ఉండేందుకు ఇష్టపడతానని అన్నారు. “సాధారణంగా ఉండడం చాలా బాగుంటుంది. నా గురించి నేను స్టార్ అని ఎప్పటికీ భావించను. అలా ఉండాలని నాకు కూడా ఉండదు. నా తల్లిదండ్రులు చాలా పెద్ద స్టార్స్. కానీ చాలా నార్మల్‍గా వాస్తవికతతో ఉంటారు” అని సైఫ్ చెప్పారు.
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో టాలీవుడ్‍లోకి వచ్చేస్తున్నారు సైఫ్ అలీ ఖాన్. ఈ మూవీలో విలన్‍గా నటిస్తున్నారు.
ఆదిపురుష్ గురించి..
ఆదిపురుష్ సినిమా గతేడాది జూన్ 16వ తేదీన రిలీజ్ అయింది. ఈ చిత్రంలో రాఘవుడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో వీఎఫ్‍ఎక్స్, కొన్ని డైలాగ్‍లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ చిత్రానికి మాటలు రాసిన మనోజ్ ముంతాషిర్ శుక్లాపై విమర్శలు వచ్చాయి. మనోభావాలను దెబ్బ తీసేలా కొన్ని మాటలు ఉన్నాయని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయంపై మనోజ్ క్షమాపణలు కూడా చెప్పారు.
ఆదిపురుష్ మూవీ సుమారు రూ.500 కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. అయితే, రూ.450కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. భూషణ్ కుమార్, కృషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సూతర్, రాజేశ్ నాయర్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.