Naga Vamsi: ఎవరీ చండాలమైన వ్యక్తి అంటూ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌పై మండిపడిన బాలీవుడ్ డైరెక్టర్
Naga Vamsi: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ నాగ వంశీపై మండిపడ్డాడు బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా. సీనియర్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ తో అతడు మాట్లాడిన విధానాన్ని తప్పుబడుతూ సంజయ్ ట్వీట్ చేశాడు. ఎవరీ చండాలమైన వ్యక్తి అంటూ తీవ్రంగా స్పందించాడు.
Naga Vamsi: టాలీవుడ్ లో గుంటూరు కారం, టిల్కూ స్క్వేర్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు రూపొందించిన ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ. అతడు ఈ మధ్య గలాటా ప్లస్ రౌండ్ టేబుల్లో బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమాపై మాట్లాడుతూ.. సీనియర్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ తో కాస్త ఘాటుగానే మాట్లాడాడు. బాలీవుడ్ బాంద్రా, జుహు కోసమే సినిమాలు తీస్తోందని, తెలుగు సినిమాలు మాత్రం ఎక్కడికో వెళ్లిపోయాయన్నట్లుగా నాగ వంశీ మాట్లాడిన తీరుపై బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా తీవ్రంగా స్పందించాడు.
ఏంటా ఆటిట్యూడ్: సంజయ్ గుప్తా
ఈ రౌండ్ టేబుల్ టాక్ లో టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగ వంశీతోపాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్, పలు ఇతర ఇండస్ట్రీలకు చెందిన వ్యక్తులు కూడా పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ను తలదన్నేలా సౌత్ నుంచి పలు సినిమాలు రావడంతో హిందీ సినిమాల గురించి కాస్త కఠినంగానే నాగ వంశీ మాట్లాడాడు. ఆ సమయంలో అతడు కాస్త నిర్లక్ష్యపు వ్యవహార శైలి ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తాకు ఆగ్రహం తెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ లో షేర్ చేస్తూ ఎవరీ చండాలమైన వ్యక్తి అని అతడు అనడం గమనార్హం.
"సీనియర్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ గారి పక్కన కూర్చున్న ఈ చండాలమైన (obnoxious) వ్యక్తి ఎవరు? తన నకిలీ ఘనతలను చెప్పుకుంటూ ఆయనను అవహేళన చేస్తున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్, దారుణమైన ఆటిట్యూడ్ చూడండి. ఏదో నాలుగైదు హిట్స్ ఇస్తే బాలీవుడ్ బాప్ అయిపోతారా" అంటూ సంజయ్ గుప్తా కాస్త ఘాటుగానే ట్వీట్ చేశాడు. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్, సురేష్ బాబులతోనూ ఇలాగే మాట్లాడగలడా అంటూ కూడా ప్రశ్నించాడు.
"సీనియర్ ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్ సర్, సురేష్ బాబు సర్ లతో ఇలాగే వాళ్ల ముఖాలపైకి వేలెత్తి చూపుతూ మాట్లాడేంత దమ్ము అతనికి ఉందా? విజయం కంటే ముందు గౌరవానికి విలువ ఇవ్వడం నేర్చుకో. మేము గొప్ప సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ల నుంచి వినయం, క్రమశిక్షణనే నేర్చుకున్నాం. ఇలాంటి చండాలమైన ప్రవర్తన వాళ్ల నుంచి ఎప్పుడూ ఊహించలేదు" అని సంజయ్ అన్నాడు.
నాగ వంశీ వర్సెస్ బోనీ కపూర్
గలాటా ప్లస్ రౌండ్ టేబుల్ లో బాలీవుడ్ పనైపోయిందన్నట్లుగా టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ మాట్లాడాడు. "మీరు ఒక విషయం మాత్రం అంగీకరించాలి. ఇది మీకు కాస్త కఠినంగానే అనిపిస్తుండొచ్చు. మా సౌత్ ఇండియన్స్ మీరు సినిమా చూసే విధానాన్ని మార్చేలా చేశాం. ఎందుకంటే మీరు బాంద్రా, జుహు కోసమే సినిమాలు తీస్తూ ఉండిపోయారు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్, యానిమల్, జవాన్ లాంటి వాటితో మార్పేంటో చూశారు" అని నాగ వంశీ అన్నాడు. అతని వ్యాఖ్యలతో బోనీ కపూర్ విభేదించాడు. తెలుగు సినిమానే అందరికీ ఎలా సినిమాలు తీయాలో నేర్పించిందనేలా మాట్లాడటం సరి కాదని బోనీ అన్నాడు. పుష్ప 2 హీరో అల్లు అర్జున్ కూడా తాను అమితాబ్ బచ్చన్ కు అభిమానిని అని చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు.