Stree 2 OTT: శ్రద్ధా కపూర్ హారర్ కామెడీ సినిమాకు ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు
Stree 2 OTT Partner: స్త్రీ 2 సినిమాకు భారీ హైప్ ఉంది. శ్రద్ధా కపూర్, రాజ్‍కుమార్ రావ్ లీడ్ రోల్స్ చేసిన ఈ సీక్వెల్ కామెడీ హారర్ చిత్రం భారీ అంచనాలతో థియేటర్లలోకి వస్తోంది. అయితే, ఈలోగానే ఈ చిత్రం ఓటీటీ పార్ట్‌నర్‌ను ఫిక్స్ చేసుకుంది.
2018లో వచ్చిన స్త్రీ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. తక్కువ బడ్జెట్‍తో వచ్చిన ఈ హారర్ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. శ్రద్ధా కపూర్, రాజ్‍కుమార్ రావ్ లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీ బ్లాక్‍బస్టర్ అయింది. ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‍గా స్త్రీ 2 చిత్రం వస్తోంది. రేపు (ఆగస్టు 15) థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ మూవీకి హైప్ వీపరితంగా ఉంది. ఈ సీక్వెల్‍లోనూ శ్రద్ధ, రాజ్‍కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా, ఈ చిత్రానికి ఓటీటీ డీల్ కూడా పూర్తయినట్టు సమాచారం బయటికి వచ్చింది.
ఓటీటీ పార్ట్‌నర్ ఇదే
స్త్రీ 2 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రానికి ఫుల్ క్రేజ్ ఉండటంతో అదే రేంజ్‍లో మంచి ధరకు హక్కులను ప్రైమ్ వీడియో తీసుకుందని తెలుస్తోంది.
థియేట్రికల్ రన్ తర్వాత స్త్రీ 2 సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వస్తుంది. సాధారణంగా బాలీవుడ్ సినిమాలు థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీల్లోకి వస్తున్నాయి. స్త్రీ 2 కూడా అదే ఫాలో అయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ మూడో వారంలో ఈ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. అంతకంటే ముందే రెంటల్ పద్ధతిలోనూ ప్రైమ్ వీడియో అందుబాటులోకి తెచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
స్త్రీ 2 గురించి..
స్త్రీ 2 చిత్రంలో శ్రద్ధా కపూర్, రాజ్‍కుమార్ రావ్‍తో పాటు పంకజ్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ కీలకపాత్రలు పోషించారు. తమన్నా భాటియా స్పెషల్ సాంగ్ చేశారు. ఈ మూవీకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. మాడ్‍డాక్ సూపర్ నేచురల్ యూనివర్స్‌లో భాగంగా ఈ చిత్రం రూపొందింది. స్త్రీ సూపర్ హిట్ కావటంతో ఈ సీక్వెల్ మూవీని కాస్త ఎక్కువ బడ్జెట్‍నే నిర్మాతలు కేటాయించారని తెలుస్తోంది.
స్త్రీ 2 సినిమా కూడా మధ్యప్రదేశ్‍లోని చందేరీ గ్రామంలోనే సాగుతుంది. మహిళలను అపహరించే దుష్టశక్తిని నిలువరించడం చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది. స్త్రీ 2 ట్రైలర్ హారర్, సస్పెన్స్, కామెడీతో ఆకట్టుకుంది. విజువల్స్ కూడా భారీతనంతో కనిపించాయి. దీంతో ఈ మూవీపై అంచనాలు కూడా అదే రేంజ్‍లో ఉన్నాయి.
స్త్రీ 2 మూవీని మాడ్‍డాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ పతాకాలపై దినేశ్ విజన్, జ్యోతి దేశ్‍పాండే నిర్మించారు. సచిన్ - జిగర్, జస్టిన్ వర్గీస్ సంగీత దర్శకులుగా పని చేశారు. జిషూ భట్టాచార్జీ సినిమాటోగ్రఫీ చేసిన ఈ మూవీకి హేమంత్ సర్కార్ ఎడిటింగ్ చేశారు.
2018 ఆగస్టులో రిలీజైన స్త్రీ సినిమా సుమారు రూ.25కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఆ చిత్రం అప్పట్లో సుమారు రూ.180కోట్ల భారీ వసూళ్లను సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి వసూళ్ల వర్షంతో భారీ బ్లాక్‍బస్టర్‌గా నిలిచింది. లాంగ్ రన్ సాధించింది. ఇప్పుడు, ఆరేళ్ల తర్వాత ఆగస్టులోనే సీక్వెల్‍గా స్త్రీ 2 వస్తోంది. ఈసారి భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ ఎంత వసూళ్లను సాధిస్తుందో చూడాలి. ఆగస్టు 15న స్త్రీ 2 రిలీజ్ కానుండగా.. 14వ తేదీ రాత్రే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు ఉండనున్నాయి.