Zwigato OTT: థియేటర్లలో రిలీజైన రెండేళ్లకు ఓటీటీలోకి కపిల్ శర్మ అవార్డ్ విన్నింగ్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Zwigato OTT: బాలీవుడ్ టీవీ హోస్ట్ కపిల్ శర్మ హీరోగా నటించిన జ్విగాటో మూవీ థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?
Zwigato OTT: బాలీవుడ్ టాప్ టీవీ హోస్ట్, కమెడియన్ కపిల్ శర్మ హీరోగా నటించిన జ్విగాటో మూవీ థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. జ్విగాటో మూవీకి నందితా దాస్ దర్శకత్వం వహించింది. 2022లో థియేటర్ల విడుదలైన ఈ మూవీ ఫిలింఫేర్‌తో పాటు పలు అవార్డులను అందుకున్నది. టొరంటోతో పాటు అనేక ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్స్‌లో ఈ మూవీ స్ట్రీనింగ్‌కు ఎంపికైంది. ఆస్కార్ లైబ్రరీలో స్థానం దక్కించుకున్నది.
ఫుడ్ డెలివరీ బాయ్‌గా...
ఈ సినిమాలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా కపిల్ శర్మ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఫుడ్ డెలివరీ బాయ్ సంస్థలకు వ్యతిరేకంగా సినిమాలో కొన్ని సీన్స్ ఉండటంతో జ్విగాటో మూవీ డిజిటల్ హక్కులకు కొనుగోలు చేసేందుకు ఓటీటీ సంస్థలేవి ముందుకు రాలేదు.
ఈ సినిమా స్క్రీనింగ్‌కు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ముందుకు రాకపోవడంపై నందితాదాస్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్విగాటో ఆస్కార్ లైబ్రరీకి సెలెక్ట్ అయ్యిందనే న్యూస్ చూసి అయినా తమ సినిమాను కొనేందుకు ఓటీటీ సంస్థలు ముందుకు వస్తాయని అనుకుంటున్నట్లు ట్వీట్ చేసింది. అప్పట్లో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్..
ఎట్టకేలకు జ్విగాటో మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. మే నెలలో జ్విగాటో మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు చెబుతోన్నారు. మే 3 లేదా మే 10 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
జొమాటో టైటిల్ అనుకున్నారు కానీ...
జ్విగాటో సినిమాకు తొలుత జొమాటో అని పేరు పెట్టారు. తమ సంస్థ పేరుతో సినిమా తీయడానికి జొమాటో అంగీకరించకపోవడంతో జ్విగాటోగా టైటిల్ మార్చారు. టైటిల్ మార్పు కూడా ఈ సినిమా ఆశించినత సక్సెస్ కాకపోవడానికి కారణమని సమాచారం. జ్విగాటో సినిమాలో సహానా గోస్వామి హీరోయిన్‌గా నటించింది.
జ్విగాటో కథ ఇదే...
మానస్ ఓ కంపెనీలో ఫ్లోర్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. కొన్ని కారణాల వల్ల ఉద్యోగం కోల్పోతాడు. కుటుంబం గడవడానికి మరోదారి లేక ఫుడ్ డెలివరీ బాయ్‌గా ఉద్యోగంలో చేరుతాడు. రేటింగ్స్ ప్రకారం జీతం అందే ఈ ఉద్యోగంలో ఇమడలేక మానస్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? గృహిణిగా ఉన్న మాసస్ భార్య ప్రతిమ ఉద్యోగం కోసం తొలిసారి ఇళ్లు దాటి బయట అడుగుపెట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? కష్టాలతో వారి జీవితాలు ఎలా ముందుకు సాగాయనే కథాంశంతో నందితాదాస్ ఈ మూవీని తెరకెక్కించింది.
టాప్ టీవీ హోస్ట్…
స్టాండప్ కమెడియన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన కపిల్ శర్మ ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ టెలివిజన్ హోస్ట్‌గా కొనసాగుతోన్నాడు. అతడు హోస్ట్‌గా వ్యవహరించిన ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో, ది కపిల్ శర్మ షో ఇండియాలో అత్యధిక మంది వీక్షించిన రియాలిటీ షోస్‌గా రికార్డ్ క్రియేట్ చేశాయి.
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కసిల్ శర్మ షో 2016 నుంచి 2023 వరకు సోనీ టీవీలో టెలికాస్ట్ అయ్యింది. ఓ వైపు టెలివిజన్ హోస్ట్‌గా కొనసాగుతూనే ఫిరంగి, సన్ ఆఫ్ మంజిత్ సింగ్, ఇట్స్ మై లైఫ్ సినిమాల్లో కపిల్ శర్మ హీరోగా నటించాడు. నందితాదాస్ కూడా తెలుగు దర్శకురాలిగా, నటిగా బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో పలు సినిమాలు చేసింది.