Nawazuddin: నా అంత అందవికారంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ ఉండరు: సైంధవ్ విలన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Nawazuddin: బాలీవుడ్ ఇండస్ట్రీలోనే తన అంత అందవికారంగా ఎవరూ ఉండరని సైంధవ్ మూవీలో విలన్ గా నటించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ అన్నాడు. అసలు ఆ మొఖంతో ఎలా సినిమాల్లోకి వచ్చానో అర్థం కావడం లేదని చెప్పడం విశేషం.
Nawazuddin: బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరుగాంచాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఎలాంటి పాత్రలో అయిన ఒదిగిపోయే ఈ నటుడు చూడటానికి మాత్రం అంత బాగుండడు. ఈ విషయంలోనే ఇండస్ట్రీలో అతడు ఎంతో వివక్ష ఎదుర్కొన్నాడు. వెక్కిరింపులూ ఎదురయ్యాయి. ఇప్పటికీ శారీరకంగా బాలీవుడ్ లో తానే అత్యంత అందవికారమైన నటుడిని తానే అని నవాజ్ చెప్పడం గమనార్హం.
సినిమాల్లోకి ఎలా వచ్చానో..: నవాజ్
నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ ఏడాదే తెలుగులో వెంకటేశ్ తో కలిసి సైంధవ్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. అతడు ఈ మధ్య న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లుక్స్ పై వచ్చే ట్రోల్స్ కు స్పందించాడు. "నా మొఖం చూసి కొంతమంది ఎందుకంత ద్వేషిస్తారో అర్థం కాదు. ఎందుకంటే నా మొఖమే అంత. చాలా చెండాలంగా ఉంటుంది. నన్ను నేను అద్దంలో చూసుకుంటే అదే అనిపిస్తుంది" అని నవాజుద్దీన్ అన్నాడు.
అంతేకాదు అసలు తనలాంటి మొఖానికి సినిమాల్లో ఎలా అవకాశం ఇచ్చారో అని కూడా అతడు అనడం విశేషం. "శారీరకంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను అత్యంత అందవికారమైన నటుడిని. అది నేను కూడా అంగీకరిస్తాను. ఎందుకంటే మొదటి నుంచీ నేను ఇదే వింటూ వస్తున్నాను. ఇప్పుడు నిజమే అనుకుంటున్నాను" అని నవాజ్ అన్నాడు.
అయితే తాను ఇలా ఉన్నా కూడా కెరీర్లో ఎన్నో భిన్నమైన పాత్రలను తనకు ఇచ్చిన ఫిల్మ్ మేకర్స్ కు నవాజుద్దీన్ కృతజ్ఞతలు చెప్పాడు. నవాజ్ ఈ మధ్యే జీ5 ఓటీటీలో వచ్చిన రౌతు కా రాజ్ మూవీలో నటించాడు. ఆనంద్ సూరాపూర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఓ మర్డర్ మిస్టరీ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాకు ఆ ఓటీటీలో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
రౌతు కా రాజ్ రికార్డు
నవాజుద్దీన్ నటించిన ఈ రౌతు కా రాజ్ మూవీ గత శుక్రవారం (జూన్ 28) జీ5 ఓటీటీలోకి వచ్చింది. నేరుగా ఓటీటీలోనే రిలీజైన ఈ సినిమాను ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఈ మర్డర్ మిస్టరీలోని ట్విస్టులు ఆకట్టుకున్నాయి. దీంతో కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా 10 కోట్ల వాచ్ మినట్స్ ను నమోదు చేయడం విశేషం. ఇప్పటికీ ఈ సినిమా ఇంకా దూసుకెళ్తూనే ఉంది.
ఇక ఏడాది సంక్రాంతి సినిమాగా రిలీజైన సైంధవ్ మూవీలోనూ నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇందులోనూ తన నటన,వచ్చీ రాని తెలుగులో అతడు చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఆకర్షించాయి.