Malayalam OTT: ఓటీటీలోకి మలయాళం కేరాఫ్ కంచెరపాలెం - స్ట్రీమింగ్ ఎప్పుడు...ఎందులో అంటే?
Malayalam OTT: అయ్యప్పనుమ్ కోషియమ్ ఫేమ్ బిజు మీనన్ హీరోగా నటించిన మలయాళం మూవీ కధ ఇన్నువరే ఓటీటీలోకి రాబోతోంది.మనోరమా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన కేరాఫ్ కంచెరపాలెం రీమేక్‌గా కధ ఇన్నువరే తెరకెక్కడం గమనార్హం.
Malayalam OTT: బిజు మీనన్ హీరోగా నటించిన మలయాళం మూవీ కధ ఇన్నువరే ఓటీటీలోకి రాబోతోంది. మనోరమా మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియల్‌గా ప్రకటించింది. డిసెంబర్ 20న ఈ ఆంథాలజీ లవ్‌స్టోరీ మూవీ మనోరమా మ్యాక్స్‌లో రిలీజ్ కానున్నట్లు చెబుతోన్నారు.
కేరాఫ్ కంచెరపాలెం...
కధ ఇన్నువరే తెలుగు మూవీ కేరాఫ్ కంచెరపాలెంకు రీమేక్ కావడం గమనార్హం. వెంకటేష్ మహా దర్శకత్వంలో కొత్త నటీనటులతో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన కేరాఫ్ కంచెరపాలెం కమర్షియల్ హిట్‌గా నిలిచింది. కేవలం యాభై లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ తెలుగు మూవీ ఏడు కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది.
మ్యాజిక్ రిపీట్...
ఈ సూపర్ హిట్ మూవీని కధ ఇన్నువరే పేరుతో మలయాళంలో బిజు మీనన్ రీమేక్ చేశాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో బిజు మీనన్ తన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. కమర్షియల్‌గా మాత్రం తెలుగు వెర్షన్ స్థాయిలో సక్సెస్‌ను అందుకోలేకపోయింది. ఆ మ్యాజిక్ రిపీట్ కాలేకపోయింది. ఐఎమ్‌డీబీలో మాత్రం 8.4 రేటింగ్ వచ్చింది.
నిఖిలా విమల్...
కధ ఇన్నువరే మూవీలో నిఖిలా విమల్, మేథిల్ దేవిక, అనుశ్రీ హీరోయిన్లుగా నటించారు. సిద్ధిఖీ కీలక పాత్రను పోషించాడు. ఈ సినిమాకు విష్ణుమోహన్ దర్శకత్వం వహించాడు. ఓ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించాడు.
నాలుగు కథలతో...
నాలుగు ఉపకథలతో సాగే ఆంథాలజీ మూవీ ఇది. రామచంద్రన్ (బిజు మీనన్) ఓ ప్రభుత్వ ఆఫీస్‌లో ప్యూన్‌గా పనిచేస్తుంటాడు. 49 ఏళ్లు వచ్చినా పెళ్లికాదు. పెళ్లి టాపిక్ ఎత్తుతూ అందరూ అతడిని ఆటపట్టిస్తుంటారు. రామచంద్రన్ ఆఫీస్‌కు హెడ్‌గా లక్ష్మి ట్రాన్స్‌ఫర్ మీద కొత్తగా వస్తుంది. ఆఫీసర్, ప్యూన్ అనే భేదాలతో సంబంధం లేకుండా లక్ష్మి, రామచంద్రన్ మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇద్దరు పెళ్లిచేసుకోవాలని అనుకుంటారు..
.మరో యువకుడు సెక్స్ వర్కర్‌కు ప్రాణంగా ప్రేమిస్తాడు. ఆమెతో ఏడడుగులు వేయాలని అనుకుంటాడు. సరిగ్గా పెళ్లిరోజే ఆమె చనిపోతుంది. .ఓ టీనేజ్ కుర్రాడు డ్యాన్సర్‌ను ఇష్టపడతాడు. ఆమె ప్రేమ కోసం తన సరదాల్ని పక్కనపెట్టి ఉద్యోగంలో చేరుతాడు. కానీ ఆ డ్యాన్సర్ మాత్రం అతడిని కాకుండా మరొకరిని పెళ్లిచేసుకుంటుంది.
స్కూల్ డేస్‌లో తన క్లాస్‌కే చెందిన అమ్మాయికి ఆకర్షితుడవుతాడు ఓ స్టూడెంట్. కానీ ఆమె అతడిని వదిలిపెట్టి మరో స్కూల్‌లో జాయిన్ అవుతుంది. ప్రేమలో విఫలమైన ఈ ముగ్గురికి రామచంద్రన్‌కు ఉన్న సంబంధం ఏమిటి? లక్ష్మి రామచంద్రన్ పెళ్లిచేసుకున్నారా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
తెలుగులో...
బిజు మీనన్ తెలుగులో రణం, ఖతర్నాక్ సినిమాలు చేశాడు. మలయాళంలో అయప్పనుమ్ కోషియమ్, తలవన్, తుండుతో పాటు పలు సూపర్ హిట్ సినిమాలు చేశాడు. నిఖిలా విమల్ తెలుగులో మేడమీద అబ్బాయి, గాయత్రి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.