Biggest Flop Movie: 800 కోట్ల నష్టం.. బడ్జెట్ రూ.950 కోట్లు.. బాక్సాఫీస్ వసూళ్లు రూ.130 కోట్లు.. ఈ ఏడాది తొలి డిజాస్టర్
Biggest Flop Movie: ఈ ఏడాది అప్పుడే అతిపెద్ద డిజాస్టర్ వచ్చేసింది. ఏకంగా రూ.800 కోట్ల నష్టంతో ఈ సినిమా మేకర్స్ కు గట్టి షాకే ఇచ్చింది. తన అన్ని ఆల్బమ్స్ నంబర్ 1గా నిలిచిన ఓ మ్యూజికల్ ఆర్టిస్ట్ బయోపిక్ ఇంత దారుణమైన నష్టాలను చవిచూస్తుందని ఎవరైనా ఊహించగలరా?
Biggest Flop Movie: కొత్త ఏడాదిలో అతిపెద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది బెటర్ మ్యాన్ (Better Man). డైరెక్టర్ మైఖేల్ గ్రేసీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఏకంగా రూ.950 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.130 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రూ.800 కోట్ల నష్టాలను మిగిల్చిన ఈ సినిమా ఓ నంబర్ వన్ మ్యూజికల్ ఆర్టిస్ట్ బయోపిక్ కావడమే ఇక్కడ అసలు విషాదం.
బెటర్ మ్యాన్.. అతిపెద్ద డిజాస్టర్
బెటర్ మ్యాన్ బ్రిటిష్ సింగర్ రాబీ విలియమ్స్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా. 30 ఏళ్ల కిందటే ఒకరోజులో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేసిన ఆర్టిస్టు అతడు. అతని అన్ని ఆల్బమ్స్ నంబర్ 1 ర్యాంకు అందుకున్నాయి.
అలాంటి ఆర్టిస్ట్ బయోపిక్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అవుతుందని భావించడంలో తప్పులేదు. కానీ బెటర్ మ్యాన్ మూవీ మాత్రం ఓ పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. జనవరి మొదట్లో రిలీజైన ఈ సినిమా 2025లో తొలి డిజాస్టర్ ట్యాగ్ మూటగట్టుకుంది. ఈ బెటర్ మ్యాన్ మూవీలో రాబీ విలియమ్స్ పాత్రను ఓ నటుడు పోషించలేదు. గ్రాఫిక్స్ తో రూపొందించిన ఓ కోతి పోషించడం గమనార్హం.
గతేడాది చివర్లో పరిమిత స్థాయిలో రిలీజైన ఈ సినిమాకు మంచి రివ్యూలే వచ్చాయి. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఆస్కార్స్ కు కూడా నామినేట్ అయింది. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. కానీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. 110 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ.. కేవలం 15 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. నార్త్ అమెరికాలో అయితే మరీ దారుణంగా నాలుగు వారాల్లో కేవలం 1.9 మిలియన్ డాలర్లే వచ్చాయి.
బెటర్ మ్యాన్.. ఎందుకిలా?
రాబీ విలియమ్స్ యూకేలో చాలా పాపులర్ అయినా యూఎస్ లో మాత్రం పెద్దగా తెలియదు. దీంతో ఆ దేశంలో బెటర్ మ్యాన్ కలెక్షన్లు మరీ దారుణంగా ఉన్నాయి. అసలు ఎవరికీ తెలియని వ్యక్తి గురించి మూవీ ఎవరు చూస్తారంటూ మూవీ రిలీజ్ సందర్భంగా మీమ్స్ వైరల్ అయ్యాయి. అయితే విచిత్రంగా విలియమ్స్ ఎంతో పాపులర్ అయిన యూకేలోనూ ఈ మూవీకి అంతంతమాత్రం ఆదరణే లభించింది.
యూకేలో కేవలం 6 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. మూవీలో విలియమ్స్ స్థానంలో ఓ నటుడు కాకుండా సీజీఐ చింపాంజీని పెట్టడం ప్రేక్షకులకు నచ్చకపోవడం వల్లే ఇలా జరిగి ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు థియేటర్లలో బెటర్ మ్యాన్ మూవీ నడుస్తున్నా.. వసూళ్లు మాత్రం దాదాపు నిల్ అని చెప్పొచ్చు.