Biggest Flop Movie: ఇప్పుడంటే ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ మూవీ అంటే రూ.వెయ్యి కోట్ల వరకూ ఉంటుంది. కానీ మూడు దశాబ్దాల కిందట రూ.పది కోట్లయినా చాలా ఎక్కువే. అలాంటి సినిమాకు ఆ రోజుల్లోనే పెట్టిన బడ్జెట్ డబ్బులు కూడా రాకపోతే ఎలా ఉంటుంది. అందులోనూ నాగార్జున, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలు నటించిన సినిమా అంటే నమ్మగలరా?
1991లో వచ్చిన మూవీ శాంతి క్రాంతి. తెలుగులో నాగార్జున, జూహీ చావ్లా జంటగా నటించిన సినిమా ఇది. అప్పట్లో నాలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ మూవీగా కూడా నిలిచింది. నిజానికి 1980వ దశకం చివర్లో రజియా సుల్తాన్ లాంటి సినిమాలు రూ.7 కోట్ల బడ్జెట్ తో రూపొందాయి. ఆ తర్వాత 1991లో శశి కపూర్ రూ.8 కోట్ల బడ్జెట్ తో ఆ రికార్డు బ్రేక్ చేశాడు.
ఆ సినిమా పేరు అజూబా. ఇదొక సూపర్ హీరో మూవీ. అయితే అదే ఏడాది ఈ సినిమా రికార్డును ఓ తమిళ దర్శక, నిర్మాత బ్రేక్ చేశాడు. అతని పేరు వి రవిచంద్రన్. తానే నిర్మించి, దర్శకత్వం వహించిన సినిమా శాంతి క్రాంతి. 1991లోనే రూ.10 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించారు. అప్పట్లో ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలిచింది.
ఈ శాంతి క్రాంతి మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కింది. మూవీ కన్నడ వెర్షన్ లో రవిచంద్రనే లీడ్ రోల్ పోషించాడు. బాలీవుడ్ నటి జూహీ చావ్లా హీరోయిన్. తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి నాగార్జున లీడ్ రోల్లో కనిపించాడు. ఇక తమిళ, హిందీ వెర్షన్లలో రజనీకాంత్ హీరో. జూహీ చావ్లా, ఖుష్బూ, అనంత్ నాగ్ మాత్రం నాలుగు వెర్షన్లలోనూ ఉన్నారు.
1991లో ఈ శాంతి క్రాంతి అత్యంత భారీ బడ్జెట్ మూవీ. నాలుగేళ్ల తర్వాత వచ్చిన త్రిమూర్తి ఈ రికార్డును బ్రేక్ చేసింది. అయితే ఇంత బడ్జెట్ పెట్టి, నాగార్జున, రజనీకాంత్, జూహీ చావ్లాలాంటి స్టార్లతో తీసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. భారీ నష్టాలను మిగిల్చింది.
అప్పట్లో ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ అయిన శాంతి క్రాంతి బిగ్గెస్ట్ ఫ్లాప్ గానూ రికార్డులకెక్కింది. ఈ సినిమాను రూ.10 కోట్లు పెట్టి తీస్తే.. బాక్సాఫీస్ దగ్గర రూ. 8 కోట్లే వచ్చాయి. కనీసం బడ్జెట్ కూడా రికవరీ చేయలేకపోయింది. దీంతో నిర్మాత రవిచంద్రన్ దివాళా తీశాడు. ఈ నష్టాలను అధిగమించడానికి అతడు కొన్నేళ్ల పాటు ఇతర చిన్న చిన్న సినిమాల్లో నటించాల్సి వచ్చింది.
ఈ కాలంలో అయితే భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీయడమే కాదు.. ఆ సినిమాను అదే స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు కూడా. దీంతో సినిమా ఎలా ఉన్నా.. రిలీజ్ కాగానే భారీ ఓపెనింగ్స్ తో చాలా వరకు బడ్జెట్ ను రికవర్ చేస్తున్నాయి. దీనికితోడు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలోనూ భారీగానే వస్తున్నాయి. దీంతో నష్టాలు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ ఆ కాలంలో ఈ స్థాయి మార్కెటింగ్, బడ్జెట్ రికవరీ చేసే మార్గాలు లేకపోవడం కూడా ఓ కారణమని చెప్పొచ్చు.