Biggest Hit Movie: ఈ సినిమా మూడు భాగాలకు రూ.1.36 లక్షల కోట్ల వసూళ్లు.. నటీనటులకు ఒక్క రూపాయీ ఇవ్వలేదట
Biggest Hit Movie: ఒక బ్లాక్‌బస్టర్ మూవీ ఫ్రాంఛైజీ ఉంది. ఆ సినిమా మూడు భాగాలు ఏకంగా రూ.1.36 లక్షల కోట్లు వసూలు చేశాయి. కానీ అందులోని నటీనటులకు మాత్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదంటే నమ్మగలరా?
Biggest Hit Movie: మన దగ్గర అయితే వందల కోట్లు, హాలీవుడ్ లో అయితే వేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే సినిమాల్లో చాలా వరకు బడ్జెట్ నటీనటుల రెమ్యునరేషన్లకే సరిపోతాయి. కానీ ప్రపంచమంతా సంచలనం సృష్టించిన మూవీ ఫ్రాంఛైజీ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ మూడు భాగాల్లో నటించిన వారికి మాత్రం ఏమీ దక్కలేదట. ఈ సినిమాలు ఏకంగా రూ.1.36 లక్షలు కోట్లు వసూలు చేసింది.
లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఫ్రాంఛైజీ
హాలీవుడ్ లో ఆల్ టైమ్ హిట్ ఫ్రాంఛైజీల్లో ఈ ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్ కూడా ఒకటి. ఈ ఫ్రాంఛైజీ నుంచి 2001లో లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ది ఫెలోషిప్ ఆఫ్ ద రింగ్, 2002లో ది టూ టవర్స్, 2003లో ది రిటర్న్ ఆఫ్ ద కింగ్ అనే మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలకు కలిపి మేకర్స్ 28.1 కోట్ల డాలర్లు ఖర్చు చేశారు. కానీ బాక్సాఫీస్ దగ్గర వచ్చింది ఎంతో తెలుసా? ఏకంగా 2.9 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో ఏకంగా రూ.1.36 లక్షల కోట్లు.
ఇంత భారీ బడ్జెట్, ఈ స్థాయి వసూళ్లు సాధించిన సినిమాలో నటించిన వారికి కూడా అదే స్థాయిలో రెమ్యునరేషన్లు అందాయని అనుకోవడం సహజమే. కానీ ఈ మూవీస్ లో నటించిన ఎవరికీ ఏమీ ఇవ్వలేదని ఈ మూడు సినిమాల్లోనూ నటించిన నటి కేట్ బ్లాన్షెట్ చెప్పడం విశేషం. ఇది నిజంగా అసలు ఎవరూ ఊహించని విషయమే.
యాక్టర్స్‌కు దక్కిందేమీ లేదా?
లార్డ్ ఆఫ్ ద రింగ్స్ మూడు భాగాల్లోనూ నటించిన నటి కేట్ బ్లాన్షెట్. ఆమె ఆ మధ్య వాచ్ వాట్ హ్యాపెన్స్ లైవ్ షోలో మాట్లాడుతూ ఈ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. మీ కెరీర్లో లార్డ్ ఆఫ్ ద రింగ్స్ కోసమే అతిపెద్ద పేచెక్ అందుకుని ఉంటారని అని ఇంటర్వ్యూయర్ అడిగినప్పుడు జోక్ చేస్తున్నారా అని అంటూ ఆమె అసలు విషయం చెప్పింది.
"జోక్ చేస్తున్నారా? ఆ సినిమా చేసినందుకు ఎవరికీ ఏమీ దక్కలేదు" అని బ్లాన్షెట్ తెలిపింది. మరి కనీసం లాభాల్లో వాటా అయినా ఇచ్చారా అని అడిగితే అది కూడా లేదంటూ ఆమె సమాధానం ఇవ్వడం విశేషం. ఈ సినిమాలో ఆమె ఎన్నో మంత్రశక్తులు ఉండే గాలాడ్రియెల్ అనే పాత్ర పోషించింది. బ్రెయిన్ డెడ్ సినిమా తీసిన పీటర్ జాక్సనే ఈ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ మూడు భాగాలను డైరెక్ట్ చేశాడు.
కేవలం అతనితో కలిసి పని చేయాలన్న ఉద్దేశంతోనే తాను ఒక్క రూపాయి కూడా ఇవ్వకున్నా ఈ సినిమాలు చేసినట్లు ఆమె వెల్లడించింది. "నాకు కేవలం ఫ్రీగా శాండ్‌విచ్‌లు మాత్రమే దక్కాయి. మీరు అనుకున్న స్థాయిలో ఇండస్ట్రీలో మహిళలకు డబ్బులు ఇవ్వరు" అని ఆస్ట్రేలియాకు చెందిన బ్లాన్షెట్ చెప్పింది.
ఈ సినిమాల్లోనే నటించిన మరో నటుడు ఆర్లాండో బ్లూమ్ కూడా ఇలాంటి కామెంట్సే చేశాడు. అతనికి కూడా ఈ మూడు సినిమాల్లో నటించినందుకు పెద్దగా దక్కిందేమీ లేదట. కేవలం లక్షా 75 వేల డాలర్లు అంటే రూ.80 లక్షలు మాత్రమే దక్కినట్లు అతడు చెప్పడం విశేషం.