Munawar Faruqui: స‌చిన్‌కు షాకిచ్చిన బిగ్‌బాస్ విన్న‌ర్ - 2024లో ఇదే అతి పెద్ద‌ ట్విస్ట్ - నెటిజ‌న్ల ఫ‌న్నీ కామెంట్స్‌-bigg boss winner munawar faruqui dismisses sachin tendulkar in ipl friendly match ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Munawar Faruqui: స‌చిన్‌కు షాకిచ్చిన బిగ్‌బాస్ విన్న‌ర్ - 2024లో ఇదే అతి పెద్ద‌ ట్విస్ట్ - నెటిజ‌న్ల ఫ‌న్నీ కామెంట్స్‌

Munawar Faruqui: స‌చిన్‌కు షాకిచ్చిన బిగ్‌బాస్ విన్న‌ర్ - 2024లో ఇదే అతి పెద్ద‌ ట్విస్ట్ - నెటిజ‌న్ల ఫ‌న్నీ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 07, 2024 09:58 AM IST

Munawar Faruqui: ఇండియ‌న్ స్ట్రీట్ ప్రీమియ‌ర్ లీగ్ ఆరంభ వేడుక‌ల్లో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌ల చోటుచేసుకున్న‌ది. టీమ్ మాస్ట‌ర్స్‌, టీమ్ ఖిలాడీ మ‌ధ్య జ‌రిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో స‌చిన్ టెండూల్క‌ర్‌కు బిగ్‌బాస్ విన్న‌ర్ మునావ‌ర్ ఫ‌రూఖీ షాకిచ్చాడు.

స‌చిన్ టెండూల్క‌ర్‌, మునావ‌ర్ ఫ‌రూఖీ
స‌చిన్ టెండూల్క‌ర్‌, మునావ‌ర్ ఫ‌రూఖీ

Munawar Faruqui: క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్‌కు బిగ్‌బాస్ విన్న‌ర్ మునావ‌ర్ ఫ‌రూఖీ షాకిచ్చాడు. స‌చిన్‌ను బిగ్‌బాస్ విన్న‌ర్ పెవిలియ‌న్ పంపించాడు. ఇండియ‌న్ స్ట్రీట్ ప్రీమియ‌ర్ లీగ్ పోటీలు బుధ‌వారం మొద‌ల‌య్యాయి. థానే స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ క్రికెట‌ర్లు, బాలీవుడ్‌, సౌత్ సినిమా స్టార్లు సంద‌డి చేశారు. స‌చిన్ టెండూల్క‌ర్‌, సురేష్ రైనా, ఇర్ఫాన్ ప‌ఠాన్ వంటి టీమిండియా మాజీ క్రికెట‌ర్ల‌తో పాటు రామ్‌చ‌ర‌ణ్, అక్ష‌య్‌కుమార్‌, సూర్య‌తో ప‌లువురు సినిమా హీరోలు ఈ వేడుక‌లో పాల్గొని అభిమానుల‌ను అల‌రించారు.

టీమ్ మాస్ట‌ర్స్ ఎలెవెన్‌...

ఇండియ‌న్ స్ట్రీట్ ప్రీమియ‌ర్ లీగ్ ఆరంభ వేడుక‌ల సంద‌ర్భంగా ఫ్రెండ్లీ మ్యాచ్‌ను నిర్వ‌హించారు. స‌చిన్ సార‌థ్యంలో టీమ్ మాస్ట‌ర్స్ ఎలెవెన్ జ‌ట్టుతో టీమ్ ఖిలాడీ జ‌ట్టు త‌ల‌ప‌డింది. టీమ్ ఖిలాడీ జ‌ట్టుకు బాలీవుడ్ అగ్ర హీరో అక్ష‌య్ కుమార్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

స‌చిన్ క్లాస్ బ్యాటింగ్‌...

కాగా ఈ మ్యాచ్‌లో స‌చిన్ టెండూల్క‌ర్ త‌న క్లాస్ బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానుల‌ను అల‌రించాడు. చాలా రోజుల త‌ర్వాత స‌చిన్‌ను మైదానంలో చూసిన అభిమానులు ఖుషి అయ్యారు. ఈ మ్యాచ్‌లో స‌చిన్ 16 బాల్స్‌లోనే 30 ప‌రుగులు చేసి అభిమానుల‌ను అల‌రించారు. దూకుడుగా ఆడుతోన్న స‌చిన్‌కు బిగ్‌బాస్ విన్న‌ర్ మునావ‌ర్ ఫ‌రూఖీ షాకిచ్చాడు. స‌చిన్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు అభిమానుల కేరింత‌ల‌తో స్టేడియం ద‌ద్ద‌రిల్లింది.

మునావ‌ర్ ఫ‌రూఖీ...

మునావ‌ర్ ఫ‌రూఖీ బౌలింగ్‌లో స‌చిన్ షాట్ కొట్ట‌బోయాడు. కానీ బ్యాట్ అంచుల‌కు తాకిన బాల్ గాల్లోకి పైకి లేచింది. కీప‌ర్ న‌మ‌న్ ఓజా సింపుల్ క్యాచ్ ప‌ట్ట‌డంతో స‌చిన్ ఔట్ అయ్యాడు. స‌చిన్ వికెట్ ద‌క్క‌డంతో మునావ‌ర్ ఆనందానికి అవ‌ధులు లేకుండాపోయాయి. స‌హ‌చ‌రుల‌తో క‌లిసి సంబ‌రాలు చేసుకున్నాడు.

స‌చిన్ ఔట్ కావ‌డంతో స్టేడియం ఒక్క‌సారిగా సైలెంట్‌గా మారింది. మునావ‌ర్ ఫ‌రూఖీ బౌలింగ్‌లో స‌చిన్ ఔట‌వ్వ‌డం అభిమానులు జీర్ణించుకోలేక‌పోయారు. స‌చిన్‌ను మునావ‌ర్ ఔట్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను ఉద్దేశించి అభిమానులు ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తుంది. ఇది ఏఐ వీడియో అయితే బాగుండున‌ని ఓ అభిమాని పేర్కొన్నాడు. 2024లో ఇలాంటి విచిత్రాలు ఎన్ని చూడాల్సివ‌స్తుందో అని మ‌రో నెటిజ‌న్ ఫ‌న్నీగా కామెంట్ చేశాడు.

అక్ష‌య్ వ‌ర్సెస్ అమితాబ్‌....

ఇండియ‌న్ స్ట్రీట్ ప్రీమియ‌ర్ లీగ్ గురువారం నుంచి మొద‌లుకానుంది. ఈ తొలి ఎడిష‌న్‌లో మొత్తం ఆరు జ‌ట్లు పోటీప‌డ‌బోతున్నాయి. ఈ లీగ్‌లో హైద‌రాబాద్ టీమ్ ఫాల్క‌న్ రైజ‌ర్స్‌ను రామ్‌చ‌ర‌ణ్, స‌ల్మాన్ ఖాన్ ఓన‌ర్స్ కొనుగులు చేశారు. శ్రీన‌గ‌ర్ వీర్ టీమ్‌కు అక్ష‌య్‌కుమార్‌, మ‌ఝీముంబై జ‌ట్టుకు అమితాబ్‌బ‌చ్చ‌న్‌,

బెంగ‌ళూరు స్ట్రైక‌ర్స్‌కు హృతిక్ రోష‌న్‌, చెన్నై సింగమ్స్ టీమ్‌కు సూర్య ఓన‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నారు. తొలి మ్యాచ్ నేడు అక్ష‌య్‌కుమార్‌, అమితాబ్ బ‌చ్చ‌న్ జ‌ట్ట మ‌ధ్య జ‌రుగ‌నుంది. ఇండియ‌న్ స్ట్రీట్ ప్రీమియ‌ర్ లీగ్ పోటీలు సోలీ లివ్ ఓటీటీలో పాటు సోనీ స్పోర్ట్స్ టెన్ 2 టీవీ ఛానెల్‌లో లైవ్ లో చూడొచ్చు. ఈ లీగ్ పోటీల‌కు ర‌విశాస్త్రి మెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు.