చాలా రోజు నుంచి ఎంతగానో ఊరిస్తున్న బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ (Bigg Boss 7 Telugu) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ గురించి అనౌన్స్ చేసినప్పటినుంచి మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ అట్టర్ ప్లాప్ కావడంతో బిగ్ బాస్ 7 తెలుగుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీన్ని ఎలాగైనా హిట్ చేయాలని బిగ్ బాస్ నిర్వహాకులు సరికొత్త స్ట్రాటజీస్‍తో వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ప్రోమోల్లో ఉల్టా పుల్టా అంటూ హోస్ట్ నాగార్జున చెబుతూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.
స్ట్రాటజీస్‍తో, ప్లాన్స్ తో వచ్చే ఇంటి సభ్యుల పప్పులు ఉడకవు, ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది అని నాగార్జున ముందే హెచ్చరించారు. ఇక శనివారం నాడు బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ హౌజ్ ఎలా ఉంటుందో ప్రోమో ద్వారా చూపించారు. నేడు అంటే సెప్టెంబర్ 3న బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ లాంచ్ చేయనున్నారు. దీనికి స్పెషల్ గెస్టులుగా యంగ్ అండ్ క్రేజీ హీరోలు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) విచ్చేయనున్నారు అని టాక్ వస్తోంది. ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ ఫిల్మ్ ఖుషి (Kushi 2023) ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ తెలుగు 7 స్టేజీపై సందడి చేయనున్నాడు. అలాగే జాతి రత్నం నవీన్ పోలిశెట్టి కూడా తన మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్స్ ను ఈ ఈవెంట్‍లో చేయనున్నాడు. తన మాటలతో ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ 7 తెలుగు గ్రాండ్ లాంచ్ ఈవెంట్‍లో పాల్గొననున్నాడు. ఇక బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‍లో మొత్తంగా 20 మంది సభ్యులు పార్టిస్‍పేట్ చేయనున్నారట. కాగా ఈ ఇద్దరు హీరోలు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.