Bigg Boss OTT 2: 15 నిమిషాల్లోనే 28 కోట్ల ఓట్లు: బిగ్ బాస్ ఓటీటీ 2 విన్నర్ ఎల్విష్
Bigg Boss OTT 2: 15 నిమిషాల్లోనే 28 కోట్ల ఓట్లు వచ్చాయట బిగ్ బాస్ ఓటీటీ 2 విన్నర్ ఎల్విష్ యాదవ్‌కి. ఈ విషయాన్ని మంగళవారం (ఆగస్ట్ 15) ఓ వీడియో ద్వారా అతడు వెల్లడించాడు.

Bigg Boss OTT 2: బిగ్ బాస్ ఓటీటీ 2 విజేతగా నిలిచాడు ఎల్విష్ యాదవ్. సోమవారం (ఆగస్ట్ 14) జరిగిన గ్రాండ్ ఫినాలేలో అభిషేక్ మల్హాన్ ను వెనక్కి నెట్టి ఎల్విష్ ట్రోఫీ గెలుచుకున్నాడు. అతనికి ఏకంగా రూ.25 లక్షల ప్రైజ్ మనీ రావడం విశేషం. అయితే ఈ ట్రోఫీ గెలిచిన తర్వాత అతడు చెప్పిన మరో విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
తన హోటల్ రూమ్ లో ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్న ఎల్విష్.. తనకు 15 నిమిషాల లైవ్ ఓటింగ్ లో ఏకంగా 28 కోట్ల ఓట్లు వచ్చినట్లు చెప్పడం విశేషం. ఈ విషయాన్ని జియో సినిమా అధికారి ఒకరు తనతో చెప్పినట్లు ఎల్విష్ వెల్లడించాడు. అది విని అక్కడున్న వాళ్లంతా షాక్ తిన్నారు. బిగ్ బాస్ ఓటీటీ 2 ఫినాలే సందర్భంగా చివరి 15 నిమిషాల పాటు ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేశారు.
ఈ సందర్భంగా ఎల్విష్ కు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఓట్లు వచ్చాయి. విజేతగా నిలిచిన తర్వాత తాను లోపలికి వెళ్లినప్పుడు అక్కడి అధికారి ఒకరు తనకు ఆ 15 నిమిషాల్లో 280 మిలియన్ ఓట్లు వచ్చినట్లు చెప్పారని ఎల్విష్ అన్నాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి ఏకంగా టైటిల్ గెలిచిన అతనిపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
నిజానికి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి అతడే. అయితే చివర్లో అతనికి 28 కోట్ల ఓట్లు వచ్చాయన్న విషయం మాత్రం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. అది చాలా చాలా ఎక్కువ అంటూ కామెంట్స్ చేశారు. అసలు అది సాధ్యమేనా అంటూ మరికొందరు సందేహం వ్యక్తం చేశారు. అసలు షోనే 78 లక్షల మంది చూస్తుంటే.. నీకు 28 కోట్ల ఓట్లు ఎలా వచ్చాయంటూ మరో యూజర్ ప్రశ్నించాడు.
బిగ్ బాస్ ఓటీటీ 2 విజేత ఎల్విష్ కాగా.. అభిషేక్ మల్హాన్ తొలి రన్నరప్, మనీషా రాణి రెండో రన్నరప్ గా నిలిచారు. తొలి రన్నరప్ అభిషేక్ ఈ షో పూర్తవగానే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.