బిగ్ బాస్ కన్నడ 12వ సీజన్‌కు ఆతిథ్యం ఇస్తున్న వెల్స్ స్టూడియోస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ హౌస్ మళ్లీ తెరుచుకుంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జోక్యంతో గురువారం (అక్టోబర్ 9) తెల్లవారుజామున తిరిగి తెరిచారు. ఈ హౌస్ తిరిగి తెరిచినట్లు శివకుమారే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించడం గమనార్హం.
బిడదిలో ఉన్న బిగ్ బాస్ కన్నడ స్టూడియోను పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ మంగళవారం (అక్టోబర్ 7) సీల్ చేసిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల్లోపే మళ్లీ తెరిచారు. దీనికి సంబంధించి కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. "బిడదిలోని జాలీవుడ్ ప్రాంగణంలో బిగ్ బాస్ కన్నడ షూటింగ్ జరుగుతోంది. దానిపై సీల్‌ను తొలగించాలని నేను బెంగళూరు సౌత్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించాను" అని పేర్కొన్నారు.
"పర్యావరణ నిబంధనలకు కట్టుబడి ఉండటం మా ప్రధాన ప్రాధాన్యత అయినప్పటికీ, కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (KSPCB) నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉల్లంఘనలను పరిష్కరించడానికి స్టూడియోకు సమయం ఇస్తాము" అని ఆయన తెలిపారు.
ఈ విషయంలో తన నిబద్ధతను నొక్కి చెబుతూ శివకుమార్ ఇలా అన్నారు. "నేను కన్నడ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాను. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ పట్ల మా బాధ్యతను కూడా సమర్థిస్తాను" అని స్పష్టం చేశారు.
కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది, పోలీసులతో కలిసి జిల్లా అధికారులు అక్టోబర్ 9న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సీల్‌ను తొలగించారు. రెండు రోజుల కిందట హౌస్ కు సీల్ వేయడం బీబీకే 12 కొనసాగింపుపై ఆందోళనలను పెంచింది. అంతేకాదు ఈ షోలో పాల్గొనే వారందరినీ తాత్కాలికంగా బిడదిలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌కు తరలించారు.
ఈ షో హోస్ట్ అయిన నటుడు కిచ్చా సుదీప ఈ జోక్యం పట్ల కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ.. స్టూడియోను తిరిగి తెరవడానికి కృషి చేసిన శివకుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. నిజానికి, స్టూడియోకు అవసరమైన లైసెన్సులు లేవని, సుప్రీంకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించిన పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మొదట ఈ స్టూడియోను మూసివేయాలని ఆదేశించింది.
శివకుమార్ జోక్యంపై జేడీ(ఎస్) పార్టీ స్పందిస్తూ.. "బిగ్ బాస్ కన్నడ మూసివేతను శివకుమారే చేయించారని" వ్యాఖ్యానించింది.
సంబంధిత కథనం