బిగ్‌బాస్ సీజన్ 8 రన్నరప్ గౌతమ్ కృష్ణ సోలో బాయ్ మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో రమ్య పసుపులేటి, శ్వేత అవస్థి హీరోయిన్లుగా నటించారు. నవీన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని సెవెన్‌హిల్స్ సతీష్ నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే.…
కృష్ణమూర్తిది (గౌతమ్ కృష్ణ) మధ్య తరగతి కుటుంబం. తల్లిదండ్రులు కష్టపడి అతడిని ఇంజినీరింగ్ చదివిస్తుంటారు. కాలేజీలో ప్రియ (రమ్య పసుపులేటి) అనే అమ్మాయిని కృష్ణమూర్తి ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లిచేసుకోవాలని అనుకుంటాడు. గొప్పింటి అమ్మాయి అయిన ప్రియ... కృష్ణమూర్తి అవమానిస్తుంది.
అతడికి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ప్రియ దూరమైన బాధలో తాగుడుకు బానిసగా మారిపోతాడు కృష్ణమూర్తి. శృతి (శ్వేతా అవస్థి) అనే అమ్మాయి కారణంగా ఆ విఫల ప్రేమ బాధ నుంచి బయటపడతాడు. శృతితో కృష్ణమూర్తి జీవితం ఎలా సాగింది? కృష్ణమూర్తిని ప్రాణంగా ప్రేమించిన శృతి అతడికి ఎందుకు విడాకులు ఇచ్చింది? ఈ కష్టాలను దాటుకుంటూ తన లక్ష్యాన్ని కృష్ణమూర్తి ఎలా చేరుకున్నాడు అన్నదే సోలో బాయ్ మూవీ కథ.
మిడిల్‌క్లాస్ నుంచి మిలియనీర్స్‌గా మారిన వారి కథలు అప్పుడప్పుడు పేపర్లలో, టీవీల్లో కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి వారి జీవితాల నుంచి స్ఫూర్తి పొంది తీసిన సినిమానే సోలో బాయ్. విఫల ప్రేమలు, కష్టాలను, కన్నీళ్లను దాటుకుంటూ ఓ మిడిల్ క్లాస్ యువకుడు కోటీశ్వరుడిగా ఎలా మారాడు అన్నదే ఈ సినిమా కథ.
యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే అంశాలతో దర్శకుడు నవీన్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. గౌతమ్ కృష్ణ, రమ్య పసుపులేటి ట్రాక్ కంప్లీట్ యూత్ కోసమే రాసినట్లుగా అనిపిస్తుంది.
మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే బాధల్ని, సంఘర్షణ సినిమాలో చూపించిన విధానం బాగుంది. ఆ సీన్స్ రాతలోనే కాదు తీతలో దర్శకుడు మంచి పట్టు కనబరిచాడు.
కృష్ణమూర్తి ప్రేమ, పెళ్లి, విడాకుల చుట్టూ ఫస్ట్ హాఫ్‌ను నడిపించాడు డైరెక్టర్. రెండు ప్రేమ కథలను డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లలో రాసుకోవడం బాగుంది. సెకండాఫ్‌లో మిలియనీర్‌గా ఎలా మారాడు? లక్ష్యసాధనలతో ఎదురైన అవరోధాలను ఎలా దాటాడు అన్నది చూపించాడు. సెకండాఫ్‌లో డైరెక్టర్ చాలా వరకు సినిమాటిక్ లిబర్జీ తీసుకొన్నాడు. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఎమోషన్ సెకండాఫ్‌లో మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి కథలతో తెలుగు తెరపై గతంలో చాలా సినిమాలు వచ్చాయి.
కృష్ణమూర్తి పాత్రకు పర్‌ఫెక్ట్‌గా ఫిట్టయ్యాడు గౌతమ్ కృష్ణ. పాత్రకు తగ్గట్లుగా నటించాడు. రమ్య పసుపులేటి గ్లామర్‌తో మెప్పించింది. పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో శ్వేతా అవస్థి కనిపించింది. పోసాని కృష్ణమురళి, అనితా చౌదరి నటన ఈ సినిమాకు ప్లస్సయింది. జుడా సాండీ సాంగ్స్, బీజీఎమ్ పెద్ద సినిమా స్థాయిలో ఉన్నాయి.
సోలో బాయ్ గౌతమ్ కృష్ణకు మంచి డెబ్యూ మూవీగా చెప్పొచ్చు. పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే నచ్చుతుంది.
రేటింగ్: 2.75/5