Bigg Boss 8 Telugu Venu Swamy: బిగ్ బాస్ 8 తెలుగులో వేణు స్వామి ఉంటాడా? ఇదీ లేటెస్ట్ అప్డేట్
Bigg Boss 8 Telugu Venu Swamy: బిగ్ బాస్ 8 తెలుగులో వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి ఉండబోతున్నాడా? కొన్నాళ్లుగా ఈ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై తాజాగా ఓ కీలకమైన అప్డేట్ వచ్చింది. బిగ్ బాస్ కొత్త సీజన్ వచ్చే నెలలోనే ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
Bigg Boss 8 Telugu Venu Swamy: బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ కు టైమ్ దగ్గర పడుతోంది. దీంతో ఎప్పటిలాగే ఈసారి కూడా హౌజ్ లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్లపై చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే తెరపైకి ఎన్నో పేర్లు వచ్చాయి. అందులో మొదట్లోనే వచ్చిన పేరు జ్యోతిష్యుడు వేణు స్వామి. నిజానికి నాగ చైతన్య, శోభిత భవిష్యత్తును అతడు అంచనా వేయకముందే అతని పేరు తెరపైకి వచ్చింది.
బిగ్ బాస్ 8 తెలుగులో వేణు స్వామి?
బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి పాల్గొనబోయే వాళ్లు ఎవరన్నదానిపై ఇప్పటి వరకూ అధికారికంగా ఎవరి పేర్లూ బయటకు రాలేదు. దీంతో ఎంతో మంది ఎన్నో పేర్లను తెరపైకి తీసుకొస్తున్నారు. మరి అందరూ అనుకుంటున్నట్లు వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి ఈసారి హౌజ్ లోకి అడుగుపెడతాడా?
తాజాగా ఓటీటీప్లే రిపోర్టు ప్రకారం.. ఈసారి వేణు స్వామి కంటెస్టెంట్ గా ఉండబోవడం లేదు. తమ విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లుగా వెల్లడిస్తూ.. మొదట్లో వేణు స్వామి పేరును పరిశీలించినా.. ఎప్పుడైతే అతడు నాగ చైతన్య, శోభితలపై నోరు పారేసుకున్నాడో అప్పుడే అతని పేరుని తొలగించినట్లు తెలిపింది. సాధారణంగా ఇలాంటి వివాదాస్పద వ్యక్తులనే బిగ్ బాస్ లాంటి షోలకు పిలుస్తుంటారు.
అయితే నాగార్జునే హోస్ట్ చేస్తున్న షో కావడం, అతని తనయుడు కాబోయే కోడలిపైనే వేణు స్వామి ఇలా నోరు పారేసుకోవడంతో అతన్ని పక్కన పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పైగా అక్కినేని అభిమానుల్లోనూ అతనిపై పీకలదాకా కోపం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వేణు స్వామిని బిగ్ బాస్ లోకి పిలవడం సరికాదని భావించినట్లు సమాచారం.
వేణు స్వామి ఏమన్నాడు?
నాగ చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ అయిన మరుసటి రోజే వాళ్ల భవిష్యత్తు గురించి వేణు స్వామి అంచనా వేశాడు. తన జీవితంలో ఇక జాతకాలు చెప్పబోనని ప్రతిజ్ఞ చేసిన కొన్నాళ్లకే మాట మార్చి వీళ్ల పెళ్లి జీవితంపై స్పందించాడు. వీళ్లు మూడేళ్లలోనే విడిపోతారని చెప్పడంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. వేణు స్వామిపై ఫిర్యాదులు కూడా చేశారు.
దీంతో ఈ మధ్యే అతడు స్పందిస్తూ.. ఈ ఇష్యూ వల్ల తన జీవనాధారానికి దెబ్బ పడిందని, అందుకే తాను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్లు కూడా చెప్పడం గమనార్హం. ఓ ప్రముఖ జర్నలిస్ట్ తమను రూ.5 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు వేణుస్వామి దంపతులు. ఈ మేరకు వారిద్దరూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు.
రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ ఓ వర్గం తమను వేధిస్తుందని, ఓ ఫోన్ కాల్ ఆడియోను విడుదల చేశారు. తమ వద్ద అంత డబ్బు లేదని, ఇక మాకు ఆత్మహత్య శరణ్యం అంటూ సంచలన ప్రకటన చేశారు. ఓవైపు అది అలా నడుస్తుండగానే.. ఇప్పుడతన్ని బిగ్ బాస్ 8 తెలుగులోకి కూడా తీసుకొచ్చే ఆలోచన లేదని తేలిపోవడం కూడా వేణు స్వామికి పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు.