Bigg Boss 8 Telugu Contestant: బిగ్ బాస్ 8 హౌజ్‌లోకి వస్తున్న యూట్యూబర్.. మిలియన్ ఫాలోవర్ల స్టార్
Bigg Boss 8 Telugu Contestant: బిగ్ బాస్ 8 తెలుగు వచ్చే నెలలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లపై రోజుకో వార్త వస్తోంది. తాజాగా ఓ స్టార్ యూట్యూబర్ అడుగుపెడుతున్నట్లు తెలిసింది.
Bigg Boss 8 Telugu Contestant: బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ కు టైమ్ దగ్గర పడుతోంది. సెప్టెంబర్ 1 నుంచే ఈ సరికొత్త సీజన్ ప్రేక్షకులను అలరించబోతోంది. దీంతో సహజంగానే ఈసారి హౌజ్ లో ఉండబోయే కంటెస్టెంట్లు ఎవరు అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రెండు ప్రోమోలతో ఈ షోపై ఆసక్తి రేపుతున్న ఈ కొత్త సీజన్ లో తాజాగా ఓ యూట్యూబర్ అడుగుపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బిగ్ బాస్ హౌజ్‌లోకి స్టార్ యూట్యూబర్
సినిమా సెలబ్రిటీలతోపాటు యూట్యూబర్లు, సామాన్యులను కూడా బిగ్ బాస్ హౌజ్ లోకి తీసుకొచ్చి ఆసక్తి రేపడం గత కొన్ని సీజన్లలో చూశాం. గతేడాది అయితే ఓ యూట్యూబరే విజేతగా నిలిచాడు. దీంతో ఈసారి అలాంటి మరో యూట్యూబరే రాబోతున్నాడు. అతని పేరు అనిల్ గీల. అనిల్ గీల వ్లోగ్స్ పేరుతో అతనికి ఓ యూట్యూబ్ ఛానెల్ ఉంది. దీనికి ఏకంగా 1.19 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం.
తెలంగాణకు చెందిన అనిల్ కు యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. నిజానికి అతడు బిగ్ బాస్ మూడో సీజన్లోనే పార్టిసిపేట్ చేస్తాడన్న వార్తలు వచ్చాయి. అప్పుడు కుదరకపోయినా.. ఈసారి మాత్రం అతనిపేరు కన్ఫమ్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇందులో పాల్గొనడానికి అతనికి భారీ మొత్తం ఇస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
హౌజ్‌లోకి ఆమె కూడా..
ఏ సీజన్ అయినా కంటెస్టెంట్ల ఎంపికలో ఆర్గనైజర్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. షోకి ముందే కావాల్సినంత ప్రమోషన్ కోసం కాంట్రవర్షియల్ కంటెస్టెంట్లను తీసుకొస్తూ ఉంటారు. ఈసారి కూడా విష్ణుప్రియ భీమినేనిని తీసుకురాబోతున్నారు. తన ఘాటు అందాలతో సోషల్ మీడియాలో రచ్చ చేసే ఆమె.. యాంకరింగ్ తోనూ పాపులర్ అయింది.
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ సీజన్‍లో పాల్గొంటాడని రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి. లావణ్యతో రిలేషన్‍పై ఇటీవలే వివాదంలో ఇరుక్కున్నారు రాజ్. బిగ్‍బాస్‍కు వచ్చేలా అతడితో నిర్వాహకులు చర్చలు జరిపినట్టు పుకార్లు ఉన్నాయి. కమెడియన్ అలీ సోదరుడు ఖయ్యూం ఈ సీజన్‍లో కంటెస్టెంట్‍గా ఉండడం ఖాయమని తెలుస్తోంది. సీరియల్ యాక్టర్ అంజలి పావని, కమెడియన్ కిర్రాక్ ఆర్పీ, యాంకర్ రితూ చౌదరి, ఆస్ట్రాలజర్ వేణు స్వామి సహా మరికొందరి పేర్లు ఈ సీజన్ కోసం వినిపిస్తున్నాయి. అయితే, అఫీషయల్‍గా ఇంకా ఎవరి పేర్లు వెల్లడి కాలేదు.
ఇలాంటి కంటెస్టెంట్లతో కొత్త సీజన్ రంజుగా సాగుతుందని స్టార్ మా అంచనా వేస్తోంది. ఇక ఈ కొత్త సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా ఉండగా.. తాజాగా ఆదివారం (ఆగస్ట్ 11) కొత్త ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. అందులో ఈ మన్మథుడు కొందరు అందగత్తెలతో కలిసి తనదైన స్టెప్పులు వేస్తూ ఉర్రూతలూగించాడు. ఇక్కడ ఒక్కసారి కమిటైతే లిమిటే ఉండదనే డైలాగు నాగ్ నోటి వెంట పలికింది.
బిగ్‍బాస్ 8 నుంచి వచ్చిన ఈ కొత్త ప్రోమోలోనూ హోస్ట్ నాగార్జున, కమెడియన్ సత్య ఉన్నారు. దొంగతనానికి వచ్చిన సత్య తనకు అన్నీ అన్‍లిమిటెడ్‍గా కావాలంటే.. సరేనని నాగార్జున చెప్పడంతో ఇటీవల వచ్చిన టీజర్ ముగిసింది. ఇప్పుడు వచ్చిన కొత్త టీజర్ దానికి కొనసాగింపుగా అడుగుపెట్టింది.