Bigg Boss 7 Telugu Promo: రైతుబిడ్డ, అమర్, శివాజీకి గట్టిగా క్లాస్ పీకిన నాగార్జున.. కింగ్స్ మీటర్‌తో హీటెక్కించేలా..
Bigg Boss 7 Telugu Promo: బిగ్‍బాస్ 7 తెలుగు రెండో వీకెండ్ ఎపిసోడ్ కూడా మంచి హీట్‍గా సాగేలా కనిపిస్తోంది. కింగ్ మీటర్ తీసుకొచ్చిన హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్‍లకు బాగానే క్లాస్ పీకారు. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది.
Bigg Boss 7 Telugu Promo: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. రెండో వారం మొత్తం కంటెస్టెంట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. నామినేషన్ల నుంచి టాస్కుల వరకు హీట్‍గా జరిగింది. ఈ తరుణంలో రెండో వారం వీకెండ్ వచ్చేసింది. హోస్ట్ కింగ్ నాగార్జున నేటి ఎపిసోడ్‍లో కంటెస్టెంట్‍లతో మాట్లాడనున్నారు. ఇందుకు సంబంధించిన నేటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ సహా మరికొందరికి కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగార్జున. ఆ వివరాలివే..
ట్రెండింగ్ వార్తలు
కింగ్స్ మీటర్‌తో బిగ్‍బాస్ 7 తెలుగు సెకండ్ వీకెండ్ ఎపిసోడ్‍కు వచ్చారు నాగార్జున. రెడ్, ఎల్లో, గ్రీన్ కలర్స్ ఉండే ఈ మీటర్‌తో కంటెస్టెంట్‍లపై అభిప్రాయాన్ని నాగార్జున వ్యక్తం చేశారు. ప్రోమో ప్రకారం ముందుగా శివాజీ గురించి నాగార్జున మాట్లాడారు. శివాజీకి మీటర్‌లో రెడ్ ఇచ్చారు నాగ్. “తలుపు తీయరా సామీ అని వెళ్లిపోతా అంటున్నావ్. తలుపు తీయడం ఎంతసేపు” అని నాగార్జున అన్నారు. పులిపై స్వారీ చేస్తున్నప్పుడు అలాగే కొనసాగాలని, మధ్యలో దూకేయకూడదని శివాజీకి క్లాస్ తీసుకున్నారు. మాటిమాటికీ వయసు గురించి ప్రస్తావిస్తున్న షకీలకు.. అది సరికాదని చెప్పారు నాగార్జున. ప్రియాంక జైన్‍కు కూడా మీటర్‌లో రెడ్ ఇచ్చారు.
గత వారం కూడా ఆడియన్స్ నిరాశ చెందారని, ఈవారం తాను ఏం చేయాలని అమర్ దీప్‍ను నాగార్జున ప్రశ్నించారు. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‍ను నామినేట్ చేసేటప్పుడు సంబంధం లేని విషయాలను మాట్లాడావంటూ అతడికి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగార్జున. పల్లవి ప్రశాంత్ సంపాదించిన డబ్బు ఎవరికైనా ఇచ్చుకుంటారని, నీకేం సంబంధం అంటూ అమర్‌ను వాయించారు నాగ్.
చివర్లో పల్లవి ప్రశాంత్ గాలి కూడా తీశారు నాగార్జున. గ్రీన్, ఎల్లో మధ్యలో తన పర్ఫార్మెన్స్ ఉంటుందని ప్రశాంత్ చెప్పారు. ఆ తర్వాత మీటర్‌లో రెడ్ చూపించారు నాగ్. “ప్రశాంత్.. రైతు బిడ్డ అని నేను గర్వంగా చెప్పుకున్నాను. కానీ నువ్వు చేసింది ఏంటి” అని నాగార్జున అన్నారు. హౌస్‍లోకి వెళ్లే ముందు తాను ప్రశాంత్‍కు ఇచ్చిన మొక్కను నాగ్ చూపారు. అది ఎండిపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేశారు. “ఒక మొక్కను చూసుకోలేని వాడు రైతుబిడ్డా?” అని నాగ్ ప్రశ్నించారు. కంటెస్టెంట్‍లతో నాగార్జున ఏం మాట్లాడారో నేటి ఫుల్ ఎపిసోడ్‍లో పూర్తిగా చూడొచ్చు.