Big Brother Movie Review: బిగ్ బ్ర‌ద‌ర్ మూవీ రివ్యూ - లేటెస్ట్ టాలీవుడ్ యాక్ష‌న్ మూవీ ఎలా ఉందంటే?-big brother telugu movie review siva kantamaneni sri surya priya hegde action entertainer movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Big Brother Movie Review: బిగ్ బ్ర‌ద‌ర్ మూవీ రివ్యూ - లేటెస్ట్ టాలీవుడ్ యాక్ష‌న్ మూవీ ఎలా ఉందంటే?

Big Brother Movie Review: బిగ్ బ్ర‌ద‌ర్ మూవీ రివ్యూ - లేటెస్ట్ టాలీవుడ్ యాక్ష‌న్ మూవీ ఎలా ఉందంటే?

Big Brother Movie Review: శివ కంఠ‌మ‌నేని హీరోగా గోసంగి సుబ్బ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బిగ్ బ్ర‌ద‌ర్ మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో ప్రియా హెగ్డే, ప్రీతీ హీరోయిన్లుగా న‌టించారు.

బిగ్ బ్ర‌ద‌ర్ మూవీ

Big Brother Movie Review: శివ కంఠమ‌నేని, శ్రీసూర్య‌, ప్రియా హెగ్డే, ప్రీతీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన బిగ్ బ్ర‌ద‌ర్ మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ ఫ్యామిలీ యాక్ష‌న్ మూవీకి టాలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ గోసంగి సుబ్బ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కె.ఎస్.శంకర్ రావు, ఆర్.వెంకటేశ్వరరావు ప్రొడ్యూస‌ర్లుగా వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమా ఎలా ఉందంటే?

బిగ్ బ్ర‌ద‌ర్ క‌థ‌...

శివ (శివ కంఠమనేని)కు కుటుంబ‌మే స‌ర్వ‌స్వం. త‌న వాళ్ల కోసం ఎంత‌దూర‌మైన వెళ‌తాడు. ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటాడు. శివ త‌మ్ముడు సూర్య మాత్రం అతి భ‌య‌స్తుడిగా పెరుగుతాడు. త‌న శ‌త్రువుల నుంచి త‌మ్ముడికి ఆప‌ద ఉండ‌టంతో అత‌డిని కంటికి రెప్పలా శివ కాపాడుకుంటాడు.

సూర్య‌ను ఇంటి గ‌డ‌ప దాట‌కుండా చూస్తుంటాడు. కానీ సూర్య మాత్రం అన్న‌య్య మాట వినడు. తన వదిన దుర్గ (ప్రియ హెగ్డే)కి అబ‌ద్దాలు చెప్పి బయటకు వెళ్తుంటాడు. సూర్య... పూజ (ప్రీతీ) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కుటుంబ‌స‌భ్యుల అనుమ‌తితో ఆమెను పెళ్లిచేసుకోవాల‌ని అనుకుంటాడు.అంత సాఫీగా సాగిపోతున్న స‌మ‌యంలో సూర్య, ప్రీతిల మీద అటాక్ జరుగుతుంది.

ఆ అటాక్‌ను శివ, సూర్య ఇద్దరూ కలిసి ఎదుర్కొంటారు. అసలు ఇంతకీ పూజ ఎవరు? నిజంగానే ఆమె సూర్య‌ను ప్రేమించిందా? వారి ప‌రిచ‌యం ఎప్పుడు ఎలా జ‌రిగింది? ఎంగేజ్మెంట్ జరిగినా పదేళ్లు పెళ్లి చేసుకోకుండా శివ ఎందుకు దూరంగా ఉంటాడు? చివరకు సూర్య, పూజల ప్రేమ కథ ఏం అవుతుంది? అన్నది కథ.

బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌...

అన్న‌ద‌మ్ముల అనుబంధంతో గ‌తంలో టాలీవుడ్ సిల్వ‌ర్‌స్క్రీన్‌పై ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ వ‌చ్చాయి. చిరంజీవి, బాల‌కృష్ణ‌తో పాటు ప‌లువురు అగ్ర హీరోలు బ్ర‌ద‌ర్స్ సెంటిమెంట్‌తో సినిమాలు చేసి హిట్టు కొట్టారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల ఒర‌వ‌డి పెర‌గ‌డంతో ఈ బ్ర‌ద‌ర్స్ సెంటిమెంట్ ఫార్ములా సినిమాలు త‌గ్గాయి.

ఫ్యామిలీ రిలేష‌న్స్‌...

బిగ్ బ్ర‌ద‌ర్‌తో శివ కంఠంనేని ఈ జోన‌ర్‌ను ట‌చ్‌చేశాడు. టైటిల్‌తోనే ఈ సినిమా ఎలా ఉండ‌బోతుందో చెప్పాడు. అందుకు త‌గ్గ‌ట్లే కంప్లీట్ మాస్ ఫ్యామిలీ కమర్షియల్ సినిమాను చూసిన ఫీలింగ్‌ను బిగ్‌బ్ర‌ద‌ర్ క‌లిగిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో డైరెక్ట‌ర్ గోసంగి సుబ్బ‌రావు ఈ మూవీని న‌డిపించాడు.

శివ‌, సూర్య రిలేష‌న్‌షిప్ నుంచి కామెడీ, సెంటిమెంట్‌ను రాబ‌ట్టుకున్నాడు. త‌మ్ముడి పై శ‌త్రువులు ఎటాక్ చేసే అవ‌కాశం ఉంద‌ని శివ కంగారు ప‌డే సీన్స్‌ను చూపిస్తూ స‌స్పెన్స్ మెయింటేన్ చేశారు. అయితే ఫ్యామిలీ సీన్స్ చాలా వ‌ర‌కు రొటీన్‌గానే సాగాయి. వాటిలో నాచురాలిటీ మిస్స‌యింది.

రొమాంటిక్ సీన్స్‌...

సెకండాఫ్‌లో మొత్తం ఫ్లాష్ బ్యాక్‌లో సాగుతుంది. సూర్య, ప్రీతీ మ‌ధ్య సీన్స్‌ను యూత్‌ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ రొమాంటిక్‌గా తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు. గొడ‌వ‌ల‌తో హీరోహీరోయిన్ల మ‌ధ్య మొద‌లైన ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డం, వారి ప్రేమ‌ను హీరోయిన్ తండ్రి వ్య‌తిరేకించిన‌ట్లుగా చూపించి క‌థ‌ను క్లైమాక్స్ వైపు న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. .

క్లైమాక్స్‌లో తమ్ముడి ప్రేమను గెలిపించేందుకు శివ చేస యాక్ష‌న్ ఎపిసోడ్‌తో క‌థ ముగుస్తుంది. బిగ్‌బ్ర‌ద‌ర్ క‌థను నేటి ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లుగా న‌డిపించ‌డంలో కొంత ద‌ర్శ‌కుడు త‌బ‌బ‌డిన‌ట్లు అనిపిస్తుంది. అన్న‌ద‌మ్ముల అనుబంధం మ‌రింత డెప్త్‌గా చూపిస్తే బాగుండేది.

బిగ్ బ్ర‌ద‌ర్‌గా...

బిగ్ బ్ర‌ద‌ర్ శివ పాత్ర‌లో శివ కంఠమనేని అన్ని ఎమోషన్స్‌ను పండించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో ఫుల్ ఎనర్జీతో కనిపించాడు. ల‌వ‌ర్‌బాయ్‌గా, అతి భ‌య‌స్తుడిగా శ్రీ సూర్య న‌ట‌న బాగుంది. గౌరి పాత్రలో ప్రియ హెగ్డే, పూజ కారెక్టర్‌లో ప్రీతి గ్లామరస్‌గా క‌నిపించారు.

నిడివి త‌క్కువే...

బిగ్ బ్ర‌ద‌ర్ నిడివి తక్కువగానే ఉండటం ప్లస్. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఈ మూవీ కమర్షియల్‌గానూ వర్కౌట్ అవుతుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

రేటింగ్‌: 2.5/5