‘భీమ్లానాయక్’ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న డిస్నీ హాట్ స్టార్...అదరగొడుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్
పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటించిన ‘భీమ్లానాయక్’ చిత్రం ఈ నెల 25న విడుదలకాబోతోంది. రిలీజ్ కు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను రికార్డు ధరకు డిస్నీహాట్ స్టార్ కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి.
పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటించిన ‘భీమ్లానాయక్’ ప్రీ రిలీజ్ బిజినెస్ టాలీవుడ్ వర్గాలతో పాటు ట్రేడ్ అనలిస్ట్ లను విస్మయపరుస్తోంది. థియేట్రికల్ రైట్స్ బిజినెస్ దాదాపు వంద కోట్లకు చేరువ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఓవర్‌సీస్ లో ప్రీబుకింగ్స్ ప్రారంభించారు. మరో వారం రోజులు ఉండగానే లక్ష డాలర్స్ మార్కును దాటినట్లుగా తెలిసింది. తాజాగా సినిమా విడుదలకు ముందే డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీహాట్ స్టార్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. పవన్ కల్యాణ్ మార్కెట్ తో పాటు సినిమాపై ఉన్న అంచనాల్నిదృష్టిలో పెట్టుకొని రికార్డు ధరకు డిస్నీ హాట్ స్టార్ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఎన్ని కోట్లకు డీల్ కుదిరిందన్నది మాత్రం తెలియలేదు. థియేటర్లలో విడుదలైన యాభై రోజుల తర్వాత ఓటీటీలో అందుబాటులో ఉండేలా డిస్నీ హాట్ స్టార్ సంస్థ తో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.

సెన్సార్ పూర్తి..యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది..
‘భీమ్లానాయక్’ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు శుక్రవారం పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రానికి త్రివిక్రమ్ స్ర్కీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చుతున్నారు. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ ఆధారంగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందింది. నిత్యామీనన్, సంయుక్తమీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూర్చారు. త్వరలో ట్రైలర్ ను విడుదలచేయడంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు.
సంబంధిత కథనం