Bhamakalapam 2 Review: ప్రియమణి ‘భామాకలాపం 2’ ఆకట్టుకుందా.. ఈ సీక్వెల్ అంచనాలను అందుకుందా?-bhamakalapam 2 review in telugu priyamani shines in aha ott heist thriller around male chicken idol ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhamakalapam 2 Review: ప్రియమణి ‘భామాకలాపం 2’ ఆకట్టుకుందా.. ఈ సీక్వెల్ అంచనాలను అందుకుందా?

Bhamakalapam 2 Review: ప్రియమణి ‘భామాకలాపం 2’ ఆకట్టుకుందా.. ఈ సీక్వెల్ అంచనాలను అందుకుందా?

Chatakonda Krishna Prakash HT Telugu
Published Feb 16, 2024 03:42 PM IST

Bhamakalapam 2 Movie Review- Aha OTT: భామాకలాపం 2 సినిమా ఆహా ఓటీటీలోకి నేడు వచ్చేసింది. ప్రియమణి ప్రధాన పాత్రలో హీస్ట్ థ్రిల్లర్‌గా అడుగుపెట్టింది. సీక్వెల్‍గా వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకుందేమో ఈ రివ్యూలో చూడండి.

Bhamakalapam 2 Review: ప్రియమణి ‘భామాకలాపం 2’ ఆకట్టుకుందా.. సీక్వెల్ అంచనాలను అందుకుందా?
Bhamakalapam 2 Review: ప్రియమణి ‘భామాకలాపం 2’ ఆకట్టుకుందా.. సీక్వెల్ అంచనాలను అందుకుందా?
  • సినిమా: భామాకలాపం 2
  • స్ట్రీమింగ్: ఆహా (ఫిబ్రవరి 16 నుంచి)
  • ప్రధాన నటీనటులు: ప్రియమణి, శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్, రఘు ముఖర్జీ, సుదీప్ వేద్, అనూజ్ గుర్వారా, చైతూ జొన్నలగడ్డ, రుద్ర ప్రతాప్ తదితరులు
  • సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
  • సినిమాటోగ్రాఫర్: దీపక్ యారగెరా
  • నిర్మాతలు: బాపినీడు, సుధీర్ ఈదర
  • కథ, స్క్రీన్‍ప్లే, దర్శకత్వం: అభిమన్య తాడిమేటి

 

సీనియర్ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో రెండేళ్ల కిందట (2022) భామాకలాపం సినిమా ఆహా ఓటీటీలోకి నేరుగా వచ్చింది. ఆ చిత్రం మంచి ఆదరణ తెచ్చుకొని.. బాగా పాపులర్ అయింది. ఇప్పుడు, ఆ చిత్రానికి సీక్వెల్‍గా భామాకలాపం 2 వచ్చింది. ఆహాలో నేడు (ఫిబ్రవరి 16, 2024) ఈ సినిమా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మరి సీక్వెల్‍గా వచ్చిన భామాకలాపం 2 ఆకట్టుకుందా? అంచనాలను అందుకుందా అనేది ఈ రివ్యూలో తెలుసుకోండి.

భామాకలాపం 2 కథ ఇలా..

విలువైన కోడిగుడ్డు చుట్టూ తిరిగే భామాకలాపంలో కష్టాల్లో చిక్కుకొని అనుపమ (ప్రియమణి) బయటపడుతుంది. దీంతో అవన్నీ మరిచిపోయేందుకు వేరే ఇంటికి మారాలని అనుపమ.. భర్త మోహన్ (రుద్రప్రతాప్) నిర్ణయించుకోవడంతో భామాకలాపం 2 మొదలవుతుంది. అనుపమ కుటుంబం కొత్త ఇంటికి వెళుతుంది. యూట్యూబ్‍లో వచ్చిన డబ్బుతో అనుపమ ఘుమఘుమ అనే హోటల్ పెట్టి.. శిల్ప (శరణ్య ప్రదీప్)ను మళ్లీ పనిలో పెట్టుకుంటుంది అనుపమ. ఆ క్రమంలో అంథోనీ లోబో (అనూజ్ గుర్వారా), జుబేదా (సీరత్ కపూర్) కలిసి నిర్వహించే ఓ పెద్ద వంటల కాంటెస్టులో అనుపమకు కంటెస్టెంట్‍గా అవకాశం దొరుకుతుంది. ఆ పోటీలో గెలిస్తే బంగారు రంగులో ఉండే ఓ కోడి పుంజు ట్రోఫీ బహుమతిగా ఉంటుంది. అయితే, ఆ ట్రోఫీని అడ్డుపెట్టుకొని డ్రగ్స్ వ్యాపారం చేసేందుకు ఆంథోనీ, జుబేదా నిర్ణయించుకుంటారు. ఈ పోటీకి అనుపమ సిద్ధమవుతుండగా.. అనుకోకుండా చిక్కుల్లో పడుతుంది. దీంతో నార్కోటిక్స్ ఆఫీసర్ సదానంద్ (రఘు ముఖర్జీ)ను అనుపమ, శిల్ప కలుస్తారు. ఆ తర్వాత ఆ కోడి పుంజును దోపిడీ చేసి తనకు ఇవ్వాలని అనుపమ, శిల్పను సదానంద్ బెదిరిస్తాడు. ఆ కోడిపుంజు కోసం మరో మాఫియా గ్యాంగ్ ప్రయత్నిస్తుంటుంది. అసలు ఆ కోడిపుంజు ట్రోఫీ ఎందుకంత విలువైనది? సదానంద్‍ మాటను అనుపమ, శిల్ప ఎందుకు వింటారు? ఆ ట్రోఫీని వారు కాజేశారా? చిక్కుల్లో నుంచి బయటపడ్డారా? చివరికి ఏమైంది? అన్న అంశాలు భామాకలాపం 2లో ప్రధాన విషయాలుగా ఉన్నాయి.

కథనం ఇలా..

విలువైన కోడిగుడ్డు చుట్టూ భామాకలాపం చిత్రం రూపొందగా.. ఇప్పుడు వచ్చిన ‘భామాకలాపం 2’ కథ ‘కోడి పుంజు ట్రోఫీ’ చుట్టూ తిరుగుతుంది. అయితే, ఈ సీక్వెల్‍లో క్యారెక్టర్లు ఎక్కువగా ఉండటంతో పాటు యాక్షన్ టచ్ కూడా ఉంది. జుబేదా (సీరత్ కపూర్) పాత్రతో గ్లామర్‌ను కూడా యాడ్ చేశాడు దర్శకుడు అభిమన్యు. అనుపమ (ప్రియమణి) హోటల్ స్టార్ట్ చేయడం, గతంలోలా జరగకుండా ఉండాలని అనుకుంటుండటంతో కథ ముందుకు సాగుతుంది. వంటల కాంపిటిషన్ మాటున ఓ డ్రగ్స్ డీల్ చేయాలని లోబో, జుబేదా ప్రయత్నించడం, నార్కోటిక్స్ అధికారులు వారిని పట్టుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. నార్కోటిక్స్‌లోనే అవినీతి అధికారిగా ఉండే సదానంద్ ఎంట్రీతో ఈ కథలో వేగం పెరుగుతుంది.

కోడి పుంజు ట్రోఫీని దోపిడీ చేయాలని అనుపమ, శిల్పను సదానంద్ బెదిరించడం, వారు అందుకు అంగీకరించడం చుట్టూ సంఘర్షణను దర్శకుడు ఆసక్తికరంగా చూపించాడు. సదానంద్ మాటను వారెందుకు వింటారన్న విషయాన్ని లాజికల్‍గానే కన్వీన్స్ చేశాడు. అనుపమ, శిల్ప మధ్య సంభాషణలు చాాలాచోట్ల మెప్పిస్తాయి. ఈ కోడి పుంజును ఎలా దోపిడీ చేస్తారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. దోపిడీ కోసం ప్లానింగ్ కూడా ఇంట్రెస్టింగ్‍గానే కనిపిస్తుంది.

థ్రిల్ ఇవ్వని దోపిడీ ఎపిసోడ్

కోడి పుంజు ట్రోఫీ దొంగతనానికి పోటీలు జరిగే పెద్ద హోటల్‍లోకి కంటెస్టెంట్లుగా అనుపమ, శిల్ప అడుగుపెట్టాక కాసేపు ఇంట్రెస్టింగ్‍గా ఉంటుంది. శిల్పను వంట చేయాలని చెప్పి ప్లాన్‍ను అమలు చేసేందుకు అనుపమ వెళుతుంది. అయితే, ఆ తర్వాత దొంగతనం వ్యవహారం పెద్దగా ఆకట్టుకోదు. ఏదో సీన్లు ముందుకు సాగుతున్నట్టు ఉంటాయే తప్ప అంత ఆసక్తికరంగా ఉండదు. క్లైమాక్స్‌లో తుపాకులతో కాల్చుకోవడం కూడా గందరగోళంగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ కూడా ఊహలకు అందేలానే ఉంటుంది. ఆశించిన స్థాయిలో క్లైమాక్స్ థ్రిల్ ఇవ్వదు. ఆరంభంలో స్క్రీన్‍ప్లే ఆకట్టుకున్నా.. చివరి అరగంట మాత్రం సాధారణంగా అనిపిస్తుంది.

అదరగొట్టిన ప్రియమణి, శరణ్య

అనుపమ పాత్రలో ప్రియమణి మరోసారి ఆకట్టుకున్నారు. ఈ పాత్రకు మరోసారి ప్రాణం పోశారు. భర్త ఏమంటారో అని భయపడే గృహిణిగా.. చిక్కుల్లో ఉన్న సమయాల్లో తెగువ చూపే మహిళగా మెప్పించారు. తొలి భాగంతో పోలిస్తే ఈ సీక్వెల్‍లో సీరియస్‍నెస్ ఎక్కువగా ఉన్నా ప్రియమణి అలవోకగా చేసేశారు. శిల్ప పాత్రలో శరణ్య కూడా మళ్లీ అదరగొట్టారు. చాలా ఈజ్‍గా నటించారు. వీరిద్దరి కాంబినేషన్లలో సీన్లు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. సీరత్ కపూర్ గ్లామరస్‍గా కనిపించడంతో పాటు తన క్యారెక్టర్‌కు న్యాయం చేశారు. రఘు ముఖర్జీతో పాటు మిగిలిన నటీనటులు తమ పరిధి మేర నటించారు. కాసేపు కనిపించిన బ్రహ్మాజీ నవ్వించారు.

సాంకేతిక విషయాలు

భామాకలాపం 2కు కథను బాగానే రాసుకున్నారు అభిమన్యు. అయితే, సరిగా ఎగ్జిక్యూట్ చేయలేదనిపిస్తుంది. ముఖ్యంగా దొంగతనం ఎపిసోడ్‍ను మరింత పకడ్బందీగా చూపించి ఉంటే ఈ సినిమా మరింత థ్రిల్ పంచేది. ఊహలకు అందే విధంగా కొన్ని సీన్లు, క్లైమాక్స్ ఉండడం కూడా కాస్త ప్రతికూలత. అయితే, ఈ మూవీ ఎక్కడా బోరు కొట్టదు. అలాగని మరీ ఉత్కంఠగానూ సాగదు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సినిమాకు తగ్గట్టు సాగింది. పాటలు మరీ ఆకట్టుకునేలా లేవు. దీపక్ సినిమాటోగ్రఫీ మెప్పించింది.

చివరగా..

భామాకలాపం 2 చిత్రంలో ప్రియమణి, శరణ్య నటన.. వారి కాంబినేషన్‍లో వచ్చే సీన్లు మెప్పిస్తాయి. కొన్ని చోట్ల ఎంటర్‌టైనింగ్‍గా ఉంటుంది. అయితే, ప్రధానమైన దొంగతనం ఈ హీస్ట్ థ్రిల్లర్‌లో ఆశించినంత థ్రిల్ ఇవ్వదు. అయితే, నరేషన్ మాత్రం బాగానే ఉంటుంది. 2 గంటల 8 నిమిషాలు మాత్రమే రన్ టైమ్ ఉండడం ఈ సినిమాకు ప్లస్. ఈ వీకెండ్‍లో టైమ్ పాస్ కోసం తప్పకుండా ఈ మూవీని ఓసారి చూడొచ్చు. 'భామాకలాపం 3' కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించేశారు. 

రేటింగ్: 2.75/5

Whats_app_banner