Bhale Unnade OTT Release Date: 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Bhale Unnade OTT Release Date: రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ భలే ఉన్నాడే ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైపోవడం విశేషం.
Bhale Unnade OTT Release Date: టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్ వరుసబెట్టి బాక్సాఫీస్ పై దండయాత్రలు చేస్తున్నా.. ఏ ఒక్క సినిమా అతన్ని ఆదుకోవడం లేదు. పురుషోత్తముడు, తిరగబడరా సామీ తర్వాత భలే ఉన్నాడే అంటూ వచ్చినా అదీ నిరాశనే మిగిల్చింది. ఇప్పుడీ మూవీ థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది.
భలే ఉన్నాడే ఓటీటీ రిలీజ్ డేట్
రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే మూవీ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 13న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను అక్టోబర్ 3 నుంచి తమ ప్లాట్‌ఫామ్ పై స్ట్రీమింగ్ చేయనున్నట్లు సదరు ఓటీటీ వెల్లడించింది. ఓ ఫన్నీ క్యాప్షన్ ద్వారా భలే ఉన్నాడే ఓటీటీ రిలీజ్ డేట్ గురించి చెప్పింది ఈటీవీ విన్.
"ఆడోళ్లకు ఆమడ దూరమే.. కానీ చేసేది చీరల బేరం.. ఇంట్రెస్టింగ్ కదా? భలే ఉన్నాడే అక్టోబర్ 3 నుంచి కేవలం ఈటీవీ విన్ లో మాత్రమే. నాన్ స్టాప్ నవ్వులు, హద్దుల్లేని వినోదం, స్వచ్ఛమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్" అనే క్యాప్షన్ తో భలే ఉన్నాడే ఓటీటీ రిలీజ్ డేట్ రివీల్ చేసింది.
భలే ఉన్నాడే మూవీ ఎలా ఉందంటే?
ప్రముఖ దర్శకుడు మారుతి సమర్పణలో భలే ఉన్నాడే రావడంతో ఈ సినిమాపై రిలీజ్ కు ముందే కొద్దిగా అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ వరుస వైఫల్యాలతోపాటు వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్న రాజ్ తరుణ్ కూడా భలే ఉన్నాడేపై ఆశలు పెట్టుకున్నాడు. అయితే అంతకుముందు వచ్చిన పురుషోత్తముడు, తిరగబడరా సామీ అంత దారుణ వైఫల్యం కాకపోయినా.. ఈ భలే ఉన్నాడే కూడా అతనికి పెద్ద హిట్ ఏమీ ఇవ్వలేకపోయింది.
పెళ్లి కూతుళ్లకు చీరలు కట్టే రాధ అనే ఓ భిన్నమైన పాత్రలో రాజ్ తరుణ్ ఈ సినిమాలో నటించాడు. చేసేది అలాంటి వృత్తే అయినా.. అతనికి ఆడాళ్లంటే భయం, భక్తి, గౌరవం. అలాంటి వ్యక్తి జీవితంలోకి కృష్ణ అనే ఓ గడుసరి అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ఆడవాళ్లకు అతడు దూరంగా ఉండటానికి కారణమేంటి? అన్నవి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
తాను ఎంచుకున్న పాత్ర పరంగా రాజ్ తరుణ్ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నా.. మూవీ పెద్దగా మెప్పించలేకపోయింది. కామెడీ, ఎమోషన్ ఇలా అన్నీ అంతంతమాత్రంగానే పండాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర అతనికి మరో నిరాశ తప్పలేదు. మరి ఇప్పుడీ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో ఎంతమేర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. రాజ్ తరుణ్ నటించిన గత రెండు సినిమాలు పురుషోత్తముడు, తిరగబడరా సామీ ఇప్పటికే ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.