మెగా ఫ్యామిలీ అభిమానులకు క్షమాపణ చెప్పిన భైరవం డైరెక్టర్.. ఆ పోస్ట్ తాను చేయలేదని వివరణ.. అసలేం జరిగింది?-bhairavam director vijay kanakamedala apologizes to mega family chiranjeevi pawan kalyan ram charan fans ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మెగా ఫ్యామిలీ అభిమానులకు క్షమాపణ చెప్పిన భైరవం డైరెక్టర్.. ఆ పోస్ట్ తాను చేయలేదని వివరణ.. అసలేం జరిగింది?

మెగా ఫ్యామిలీ అభిమానులకు క్షమాపణ చెప్పిన భైరవం డైరెక్టర్.. ఆ పోస్ట్ తాను చేయలేదని వివరణ.. అసలేం జరిగింది?

Hari Prasad S HT Telugu

భైరవం మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల మెగా ఫ్యామిలీ అభిమానులకు క్షమాపణ చెప్పాడు. బాయ్‌కాట్ భైరవం సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావడంతో అతడు దిగి వచ్చాడు. ఎప్పుడో తన ఫేస్‌బుక్ పోస్టులో చిరంజీవి, రామ్ చరణ్ లను అవమానించేలా చేసిన పోస్టుపై వివరణ ఇచ్చాడు.

మెగా ఫ్యామిలీ అభిమానులకు క్షమాపణ చెప్పిన భైరవం డైరెక్టర్.. ఆ పోస్ట్ తాను చేయలేదని వివరణ.. అసలేం జరిగింది?

మంచు మనోజ్ నటించిన భైరవం మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల తన ఎక్స్ అకౌంట్ ద్వారా మెగా ఫ్యామిలీ అభిమానులకు క్షమాపణ చెప్పాడు. వాళ్లను అవమానించేలా అతని ఫేస్‌బుక్ పేజ్ లో ఉన్న ఓ పోస్ట్ గురువారం (మే 22) సాయంత్రం నుంచి వైరల్ కావడంతో బాయ్‌కాట్ భైరవం అంటూ మెగా ఫ్యాన్స్ పిలుపునిచ్చారు. దీంతో విజయ్ వెంటనే రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టాడు.

ఆ పోస్ట్ ఏంటంటే?

భైరవం మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల 2011లో తన ఫేస్‌బుక్ పేజీలో చిరంజీవి, రామ్ చరణ్ లను అవమానించేలా చేసిన పోస్ట్ అంటూ గురువారం (మే 22) సాయంత్రం నుంచి ఓ ఫొటో వైరల్ అయింది. అందులో అమితాబ్, అభిషేక్ కలిసి నటించిన పా మూవీ పోస్టర్ ను మార్చేసి చిరంజీవి, రామ్ చరణ్ తో మార్చినట్లు ఉంది.

దానికి టైటిల్ ను చా (Chaaaaaa) అని పెట్టారు. సామాజిక న్యాయం ప్రెజెంట్స్ “చా” అనే క్యాప్షన్ తో ఆ ఫొటోను విజయ్ కనకమేడల పోస్ట్ చేసినట్లుగా ఉంది. దీనిపై మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాయ్‌కాట్ భైరవం అంటూ పిలుపునిచ్చారు. దీనిపై విజయ్ సుదీర్ఘ వివరణ ఇచ్చాడు.

ఎవరో హ్యాక్ చేశారు: విజయ్

ఆ పోస్ట్ తాను చేయలేదని, ఎవరో తన అకౌంట్ ను హ్యాక్ చేశారని విజయ్ కనకమేడల అంటున్నాడు. తాను మెగా హీరోలతో కలిసి పని చేశానని, అలాంటిది వాళ్లతో తాను ఎందుకు ఇలాంటివి పెట్టుకుంటానని ప్రశ్నించాడు. అతని సుదీర్ఘ పోస్టులో ఏముందో చూడండి.

“నమస్కారం. అందరికీ గుడ్ ఈవెనింగ్ అండీ.. మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ గుడ్ ఈవెనింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్ జరుగుతుంది.

దానికి ముందు నుంచి కూడా మెగా అభిమానుల నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నారు. కానీ ఈ రోజు నాకు తెలియకుండా ఒక 30 మినిట్స్ నుంచి మెగా అభిమానుల వైపు నుంచి కూడా ట్రోల్ జరుగుతున్నట్టు తెలిసింది. ఎప్పుడో 2011లో ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టానని ట్రోల్ చేస్తున్నారు. అది నేను పెట్టిన పోస్ట్ కాదు.. ఏదో జరిగింది.. హ్యాక్ అయి ఉంటుంది.

నేను అందరు హీరోలతో పని చేశాను.. ఎక్కువ పని చేసింది మెగా హీరోలతోనే. మెగా హీరోలు అందరితోనూ నాకు సానిహిత్యం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమాకు నేను పని చేశాను. అప్పుడు నన్ను కళ్యాణ్ గారు బాగా సపోర్ట్ చేశారు. అదే సమయంలో సాయి ధరమ్ తేజ్ గారిని కూడా పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకో అన్నారు. తేజ్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నన్ను అన్నా అన్నా అని సంబోధిస్తారు.

అలాంటిది నేను మెగా అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటానండి. అందరిలాగే నేను కూడా చిరంజీవి గారి సినిమాలు చూసి, పవర్ స్టార్ గారి సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాను డైరెక్టర్ అవుదామని..! అటువంటిది నేనెందుకు వాళ్లను దూరం చేసుకుంటాను.. అలాంటి తప్పు ఎందుకు చేస్తాను..? నా సోషల్ మీడియా పేజీలో పోస్ట్ అయింది.. తెలిసో తెలియకో జరిగింది.. అది హ్యాక్ అయింది..

అయినా కూడా నా సోషల్ మీడియా పేజీ కాబట్టి బాధ్యత తీసుకుంటున్నాను. ఇంకొకసారి ఇలాంటివి రాకుండా చూసుకుంటాను.. ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక పక్కన నా సినిమాపై ట్రోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు.. కాబట్టి ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదు.. దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగవు మెగా అభిమానులు అందరికీ.. మీలో ఒకడిగా నేను హామీ ఇస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. మీ విజయ్ కనకమేడల” అని తన ఎక్స్ అకౌంట్లో అతడు పోస్ట్ చేశాడు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం